లింగంపల్లిలో అరుదైన ఆత్మార్పణ శిల వెలుగులోకి

4 Sep, 2021 03:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేవుడికి తనను తాను నైవేద్యంగా సమర్పించుకుంటే ఆ భక్తిని ఏమనాలి?.. గతంలో ఈ తరహా వీరభక్తి ఉండేదన్న గాథలు అడపాదడపా వింటూనే ఉన్నాం. భక్తితో దేవుడికి తనను తాను ఆత్మార్పణ ద్వారా సమర్పించుకున్న వారి శిల్పాలు అప్పట్లో  వేయించారు. అలాంటి ఓ అరుదైన ఆత్మార్పణ శిల తాజాగా వెలుగుచూసింది. అది మహిళది కావడం మరో విశేషం. జనగామ జిల్లా చిల్పూరు మండలం లింగంపల్లిలో కొత్త తెలంగాణ బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్‌ ఈ ‘ఆత్మార్పణ’శిల్పాన్ని గుర్తించినట్లు ఆ బృందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ పేర్కొన్నారు.

కర్ణాటక ప్రాంతంలో వీటిని సిడితల వీరగల్లుగా పేర్కొంటారని తెలిపారు. ఈ శిల్పంలోని దృశ్యం రెండంతస్తులుగా ఉంది. దిగువ భాగంలో.. ఓ మహిళ కూర్చుని ఆత్మత్యాగం చేసేందుకు సిద్ధంగా ఉంది. చేతిలో శివలింగం పట్టుకుని ఉంది. తల భాగాన్ని ఎదురు కర్రకు కట్టినట్టు ఉంది. ఓ వెదురుకర్రను వంచి చివరి భాగాన్ని తలకు జుట్టుకు కడతారు. ఆ తర్వాత కత్తితో మెడ నరుక్కోగానే, వెదురు కర్ర తలను వేరు చేస్తూ పైకి లేస్తుంది.

ఈ మహిళ ఆ పద్ధతిలో ఆత్మత్యాగం చేసినట్టు శిల్ప దృశ్యం చెబుతోంది. పైఅంతస్తులో చనిపోయిన మహిళ ఆత్మను తోడుకుని ఇద్దరు చామరధారిణులైన అమరాంగనలు దేవలోకానికి వెళ్తున్న దృశ్యం చిత్రించి ఉంది. శిల్పశైలినిబట్టి కాకతీయుల కాలానంతరం చెక్కినట్లుగా ఉందని హరగోపాల్‌ పేర్కొన్నారు. వీరశైవ భక్తులెక్కువగా ఇలా ఆత్మార్పణ చేసుకునేవారని  పేర్కొన్నారు. ఈ శిల్పం ఓ పొలం వద్ద వెలుగుచూసినట్టు వెల్లడించారు.  

మరిన్ని వార్తలు