Assigned Lands: అసైన్డ్‌పై రియల్‌ కన్ను! ఎకరాకు రూ.20 లక్షలకు చెల్లింపు, గుట్టుగా రిజిస్ట్రేషన్లు

5 Jul, 2022 13:33 IST|Sakshi

నేరమని తెలిసినా కొనుగోలుకు సై అంటున్న వ్యాపారులు

ధరణిలో పట్టా నమోదుకు యత్నం 

యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్,ఇబ్రహీంపట్నం, మహేశ్వరంలోబేరసారాలు  

సాక్షి, రంగారెడ్డి జిల్లా: అసైన్డ్‌ భూములపై కొంత మంది రియల్టర్ల కన్నుపడింది. వీటిని అమ్మడం, కొనడం నేరమని తెలిసినా చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడైనా వీటిని స్వాధీనం చేసుకోవచ్చని స్థానికంగా ప్రచారం చేస్తూ.. రైతులను భయాందోళనకు గురిచేస్తున్నారు. వీరి నుంచి తక్కువ ధరకు కొల్లగొట్టే కుట్రకు 
తెరలేపారు. రెవెన్యూ శాఖలోని లొసుగులకు తోడు అధికార పార్టీ పెద్దల అండదండలు వీరికి కలిసొస్తోంది. న్యాయపరమైన చిక్కులు, అధికారులతో ఏ సమస్యలు ఎదురైనా అన్నీ తామే చూసుకుంటామని నమ్మబలుకుతున్నారు.

రిజిస్ట్రేషన్‌కు ముందే అసైన్డ్‌దారుల పేరుతో ఎన్‌ఓసీ సంపాదించి రూ.కోట్లు విలువ చేసే భూములను చవక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని అడ్డుకోవాల్సిన యంత్రాంగం వీరిచ్చే కమీషన్లకు కక్కుర్తి పడి అడ్డగోలుగా ఎన్‌ఓసీలు జారీ చేసి, రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. భూ అగ్రిమెంట్‌ సమయంలో అసైన్డ్‌ దారులకు వ్యాపారులునగదు రూపంలో కాకుండా చెక్కుల రూపంలో చెల్లిస్తుండటం గమనార్హం.  

అబ్దుల్లాపూర్‌మెట్‌లో.. 
పెద్దఅంబర్‌పేట్‌లోని సర్వే నంబర్‌ 244లో నాలుగెకరాలు, సుర్మాయిగూడ సర్వే నంబర్‌ 128లో వంద ఎకరాలకుపైగా, బాటసింగారం సర్వే నంబర్‌ 10లో సుమారు 20 ఎకరాల అసైన్డ్‌ భూమి ఉంది. రూ.కోట్లు విలువ చేసే ఈ భూములపై వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలు, అనుచరుల కన్నుపడింది. రెవెన్యూలోని లొసుగులను అడ్డుపెట్టుకుని అసైన్డ్‌ దారుని పేరుతోనే ఎన్‌ఓసీ పొందేందుకు యత్నిస్తున్నారు. అగ్రీమెంట్లు చేసుకుని, కొంత అడ్వాన్స్‌ కూడా ఇస్తున్నట్లు తెలిసింది. అబ్దుల్లాపూర్‌మెట్‌ కొత్త పోలీసు స్టేషన్‌ వెనుకభాగంలో సర్వే నంబర్‌ 283లోని 350పైగా ఎకరాల అసైన్డ్‌ భూమి ఉంది. ప్రస్తుతం వంద ఎకరాల వరకు ఖాళీగా ఉంది. దీనిపై రియల్టర్ల కన్ను పడింది.  

మహేశ్వరంలో.. 
మహేశ్వరం మండలం మహబ్బుత్‌నగర్‌లో రంగనాథసాయి పేరిట 9.06 ఎకరాల భూములున్నాయి. ప్రభుత్వం వీటిని 1988లోనే సీలింగ్‌ భూములుగా గుర్తించి, స్వాధీనం చేసుకుని స్థానిక తహసీల్దార్‌కు అప్పగించింది. ఆ తర్వాత ఇందులోని ఆరెకరాలను అప్పటి ఆర్డీఓ ఉత్తర్వుల (ఎ/ 6345/1987) మేరకు 1989 జనవరిలో భూమిలేని ఆరుగురు పేదలకు అసైన్‌ చేశారు. మరో 3.06 ఎకరాలను ఇద్దరు ఎక్స్‌ సర్వీస్‌మెన్‌లకు కేటాయించారు.

బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం దీని విలువ ధర రూ.60 కోట్ల పైమాటే. విలువైన ఈ భూమిపై ఓ ప్రముఖ సంస్థ కన్నుపడింది. పక్కనే ఉన్న తమ భూమిలో అసైన్డ్‌ భూములను కలిపేసుకుంది. ఇందుకు సంబంధించిన పత్రాలను బ్యాంకులో తనఖా పెట్టి రుణం కూడా తీసుకుంది. ఈ విషయం బ్యాంకు, రెవెన్యూ అధికారులకు తెలిసి ఒత్తిడి చేయడంతో.. తీసుకున్న లోన్‌ డబ్బులు తిరిగి చెల్లించింది. కానీ సదరు భూమి మాత్రం ఇప్పటికీ సంస్థ ఆధీనంలోనే ఉండటం, స్వాధీనం చేసుకునేందుకు అధికారులు వెనకడుగు వేస్తుండటం విశేషం.  

ఇబ్రహీంపట్నంలో 
చెర్లపటేల్‌గూడ రెవెన్యూలోని సర్వే నంబర్‌ 710లో 83 ఎకరాల భూమిని 70 మందికి అసైన్‌ చేశారు. కొంత సాగుకు అనుకూలంగా ఉండగా, మరికొంత ప్రతికూలంగా ఉంది. ఈ భూమిని దక్కించుకునేందుకు కొంత మంది రియల్టర్లు యత్నిస్తున్నారు. నల్లగొండ, వరంగల్‌ జిల్లాలకు చెందిన రాజకీయ నాయకులు, వారి అనుచరులు, వ్యాపారులు ఈ భూములపై కన్నేశారు. స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు కూడా వీరికి సహకరిస్తున్నారు. పొల్కపల్లి, దండుమైలారం, రాయపోలు రెవెన్యూ పరిధిలో కూడా అసైన్డ్‌ భూముల క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి.    

యాచారంలో.. 
మొండిగౌరెల్లి, నల్లవెల్లి, కొత్తపల్లి, తక్కెళ్లపల్లి, మా ల్, మంతన్‌గౌరెల్లి రెవెన్యూ పరిధిలో అసైన్డ్‌ భూము లు అధికంగా ఉన్నాయి. ఇప్పటికే కుర్మిద్ద, తాడిపర్తి, నానక్‌నగర్, నక్కర్తమేడిపల్లిలోని సుమారు పది వేల ఎకరాల అసైన్డ్‌ భూములను ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో సేకరించింది. బాధితులకు రూ.8 లక్షలు నష్టపరిహారంగా ఇచ్చింది. ఫార్మాసిటీ భూ సేకరణను బూచిగా చూపిస్తున్న రియల్టర్లు మిగిలిన గ్రామాల్లోని రైతులను భయాందోళనలకు గురి చేస్తున్నారు.

రైతుకు ఎకరాకు రూ.17 లక్షలు చెల్లిస్తూ, మరో రూ.2 లక్షలు మధ్యవర్తులు కమీషన్‌గా తీసుకుంటున్నారు. ఇప్పటికే 60– 70  ఎకరాలకు అడ్వాన్స్‌లు కూడా చెల్లించినట్లు సమాచారం. మొండిగౌరెల్లిలో సర్వే నంబర్‌ 19లో 575.30 ఎకరాలు ఉండగా, సర్వే నంబర్‌ 68లో 625.20 గుంటలు, సర్వే నంబర్‌ 127లో 122.22 ఎకరాల భూమి 
ఉంది. వీటిపై నగరానికి చెందిన కొంత మంది రియల్టర్ల కన్నుపడింది.    

ఈటల వ్యవహారంతో కలకలం
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కుటుంబానికి చెందిన జమున హేచరీస్‌ ఆధీనంలో (మెదక్‌ అచ్చంపేట) ఉన్న ఎనిమిది సర్వే నంబర్లలో 85.19 ఎకరాల అసైన్డ్‌ భూమిని 65 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయడంతో జిల్లాలోని అసైన్డ్‌ భూముల అమ్మకాలు, కొనుగోలు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. మన జిల్లాలోని 26 మండలాల పరిధిలో 321 గ్రామాల్లో 6,471.03 ఎకరాల అసైన్డ్‌ భూమి ఉండగా, 5,440 మందికి 6,198.11 ఎకరాలు అసైన్‌ చేశారు. వీటిలో ఇప్పటికే చాలా భూములు పరాధీనమయ్యాయి. రైతులను మభ్యపెట్టి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసిన రియల్టర్ల నుంచి మళ్లీ భూములు స్వాధీనం చేసుకునేందుకు అనేక మంది యత్నిస్తుండటంతో వీటిని కొనుగోలు చేసిన రియల్టర్లలో ఆందోళన మొదలైంది.  

అమ్మడం, కొనడం నేరం 
అసైన్డ్‌ భూములు అమ్మడం, కొనడం నేరం. వీటిని రిజిస్ట్రేషన్‌ చేయలేము. అమ్మిన రైతులతో పాటు కొనుగోలు చేసిన వ్యాపారులపై కూడా కేసులు నమోదు చేస్తాం. ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా మా దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటాం.    
వెంకటాచారి, ఆర్డీఓ, ఇబ్రహీంపట్నం  

మరిన్ని వార్తలు