క్షౌరవృత్తిని నాయీబ్రాహ్మణులకే పరిమితం చేయాలి

12 Nov, 2022 13:01 IST|Sakshi
లింగం నాయీ

తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: క్షౌరవృత్తిని నాయీబ్రాహ్మణులకే పరిమితం చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక విజ్ఞప్తి చేసింది. బడా పారిశ్రామిక వేత్తలు, ఇతర కులాలు తమ వృత్తిలోకి ప్రవేశించి నాయీబ్రాహ్మణుల జీవనోపాధికి గండికొడుతున్నాయని ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు యం. లింగం నాయీ ఆవేదన వ్యక్తం చేశారు. రిలయన్స్‌ సహా పలు బడా సంస్థలు మోడ్రన్‌ సెలూన్స్‌ పేరుతో తమ పొట్ట కొడుతున్నాయని.. ఇలాంటి వాటికి అనుమతులు ఇవ్వొద్దని ప్రభుత్వాన్ని కోరారు. 

తెలంగాణ ఉద్యమ సమయంలో మోడ్రన్‌ సెలూన్స్‌కు వ్యతిరేకంగా తాము చేపట్టిన ఆందోళనకు కేసీఆర్‌ అండగా నిలబడ్డారని.. ప్రత్యేక రాష్ట్రం రాగానే క్షౌరవృత్తిని నాయీబ్రాహ్మణులకే పరిమితం చేస్తూ జీవో ఇస్తానని మాటిచ్చినట్టు గుర్తు చేశారు. ఇతర కులవృత్తులను కాపాడటానికి జీవోలు ఇచ్చినట్టుగానే తమకు కూడా ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అభ్యర్థించారు.

నాయీ బ్రాహ్మణ సహకార సంఘాల సమాఖ్య ద్వారా క్షౌరవృత్తిదారులకు ఆర్థిక సహాయం అందించాలని పత్రికా ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. కాగా, రిలయన్స్‌ సెలూన్స్‌ వ్యాపారంలోకి రావడాన్ని వ్యతిరేకిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో నాయీబ్రాహ్మణులు ఆందోళనలకు దిగుతున్నారు. 
 

మరిన్ని వార్తలు