‘బెస్ట్‌ విలేజ్‌’ పోటీలో భూదాన్‌పోచంపల్లి

15 Sep, 2021 02:03 IST|Sakshi

యూఎన్‌డబ్ల్యూటీవో బెస్ట్‌ టూరిజం విలేజ్‌కు ఎంట్రీ

భారత్‌ నుంచి మూడు గ్రామాలకు కేంద్రం ప్రతిపాదనలు   

భూదాన్‌పోచంపల్లి: తెలంగాణలోని చారిత్రక, పర్యాటక ప్రదేశాలకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. రామప్ప దేవాలయానికి ఇటీవలే యునెస్కో ప్రపంచ వారసత్వ హోదాను కల్పించింది. తాజాగా ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేస్తున్న ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీఓ) నిర్వహించే బెస్ట్‌ టూరిజం విలేజ్‌ పోటీల్లో భారత్‌ తరఫున తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి గ్రామం పోటీపడుతోంది. మన దేశంలోని భూదాన్‌పోచంపల్లితో పాటు మేఘాలయలోని ప్రఖ్యాతిగాంచిన కాంగ్‌థాన్, మధ్యప్రదేశ్‌లోని చారిత్రక గ్రామం లద్‌పురాఖాస్‌ కూడా పోటీలో నిలిచాయి. ఈ మేరకు కేంద్రం ప్రతిపాదనలు పంపించింది. 

పోచంపల్లికి ఘనమైన చరిత్ర 
భూదాన్‌పోచంపల్లికి ఘనమైన చారిత్రక నేపథ్యం ఉంది. 1951లో మహాత్మాగాంధీ ప్రియశిష్యుడైన ఆచార్య వినోబాభావే పోచంపల్లికి రావడం, ఆయన పిలుపు మేరకు వెదిరె రాంచంద్రారెడ్డి హరిజనులకు 100 ఎకరాల భూమి దానం చేయడంతో భూదానోద్యమానికి అంకురార్పణ జరిగింది. దాంతో భూదాన ఖ్యాతితో భూదాన్‌పోచంపల్లిగా మారి ప్రపంచపుటల్లోకెక్కింది. అలాగే ఇక్కడి చేనేత కళాకారులు తమ కళా నైపుణ్యాలతో అగ్గిపెట్టెలో పట్టే్ట చీరలు నేసి ఔరా అన్పించారు.

ఇక్కడి చేనేత కళాకారుల ప్రతిభతో సిల్క్‌సిటీగా పేరు తెచ్చుకుంది. నాటి నిజాం రాజులతో పాటు అరబ్‌దేశాలకు తేలియా రుమాళ్లు, గాజులు, పూసలను ఎగుమతి చేసింది. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న భూదాన్‌పోచంపల్లి దేశ, విదేశీయులకు అధ్యయన కేంద్రంగా మారింది. భూదానోద్యమ చారిత్రక గాథ, గ్రామీణ పర్యాటక కేంద్రం, చేనేత, చేతివృత్తులతో పాటు కుటీర పరిశ్రమలు, వ్యవసాయానికి నిలయం. అంతేగాక నిరుద్యోగ యువతకు ఉచిత స్వయం ఉపాధి కోర్సులకు శిక్షణ ఇస్తున్న జలాల్‌పురంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ రాష్ట్రంలోనే పేరు గాంచింది.

దాంతో పోచంపల్లిని అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, చైనా, రష్యా తదితర 100 దేశాలకు పైగా వేలాది పర్యాటకులు, విదేశీ ప్రతినిధులు సందర్శించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా గ్రామీణ పర్యాటకాన్ని, అక్కడి ప్రజల జీవన శైలిని వినూత్న పద్ధతిలో ప్రపంచానికి తెలియజేయడంలో భాగంగా ప్రపంచ టూరిజం సంస్థ ‘బెస్ట్‌ టూరిజం విలేజ్‌’పోటీని నిర్వహిస్తో్తంది.  

మరిన్ని వార్తలు