పాపికొండల యాత్రకు పచ్చజెండా.

6 Nov, 2022 04:31 IST|Sakshi

రేపటి నుంచి లాంచీలు ప్రారంభించనున్న ఏపీ సర్కార్‌ 

గోదావరి, ప్రకృతి అందాలు తిలకించే అవకాశం  

వర్షాలు, వరదలతో ఐదు నెలల క్రితం నిలిపివేత  

వ్యాపారులు, పర్యాటకుల్లో వెల్లువెత్తుతున్న ఆనందం

భద్రాచలం: పాపికొండల విహార యాత్రకు తిరిగి రంగం సిద్ధం అవుతోంది. భారీ వర్షాలు, గోదావరి వరదల నేపథ్యంలో జూన్‌ మొదటి వారంలో నిలిచిపోయిన యాత్ర సోమవారం పునఃప్రారంభం కానుంది. పాపికొండలు యాత్రను ప్రారంభించడానికి ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందనే సమాచారంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.  

జూన్‌ 4న నిలిచిన యాత్ర..   
ఏపీలోని కచ్చలూరు వద్ద 2019లో జరిగిన  ప్రమాదంతో నిలిచిపోయిన పాపికొండల యాత్ర గత ఏడాది డిసెంబర్‌లో ప్రారంభమైంది. సందడిగా మారిన గోదావరి తీరం.. వరదల నేపథ్యంలో జూన్‌ 4న ఆగిపోయింది. సెప్టెంబర్‌ వరకూ వరదల భయం వీడలేదు. దీంతో యాత్ర ముందుకు సాగలేదు. దీంతో భద్రాచలంలో కొంతకాలంగా వ్యాపారాలన్నీ నిస్తేజంగా మారాయి. పాపికొండల యాత్ర పునఃప్రారంభం అవుతుండడంతో వ్యాపారులు, లాడ్జీలు, హోట­ళ్లు, ట్రావెల్‌ వాహనాల యజమానుల్లో హర్షం వెల్లువెత్తుతోంది. భద్రాచలం పరిసర ప్రాంతాలు మళ్లీ సందడిగా మారనున్నాయి.

పర్యాటకులకు కనువిందు.. 
సెప్టెంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు  పర్యాటకులకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. పూర్తిగా గోదావరి నదిపై సాగే లాంచీ ప్రయాణం, ఆ లాంచీలోనే ఆటపాటలు, నృత్యాలు, రుచికరమైన భోజనం, గిరిజనులు తయారు చేసే వెదురు బొమ్మలు, వస్తువులతో పాటుగా అక్కడ మాత్రమే దొరికే ‘బొంగు చికెన్‌’ వంటివి ప్రత్యేకం. పోచవరం నుంచి పాపికొండలు వెళ్లి,  తిరిగి వచ్చేంతవరకు ‘సెల్‌ ఫోన్‌ సిగ్న­ల్స్‌’ లేని ప్రశాంతమైన యాత్ర ఇదొక్కటే అంటే అతిశయోక్తి కాదు! కార్తీక మాసం సీజన్‌ కావడంతో భద్రాచలానికి యాత్రికులు, భక్తులు అధికంగా వస్తుంటారు. ముఖ్యంగా వారాంతపు సెలవులు, ప్రత్యేక రోజుల్లో భారీగా పోటెత్తుతారు.  

ఇలా చేరుకోవచ్చు..  
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా వీఆర్‌పురం మండలం పోచవరం ఫెర్రీ పాయింట్, దేవీపట్నం మండలం పోశమ్మ గండి ఫెర్రీ పాయింట్‌ వద్ద నుంచి బోటింగ్‌ ఉంటుంది. సోమవారం ఈ రెండు ప్రాంతాల నుంచి ఏపీ టూరిజం లాంచీలు ప్రారంభం కానున్నాయి. రెండు, మూడు రోజుల్లో మరికొన్ని లాంచీలు పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలనుంచి, హైదరాబాద్‌ నుంచి పాపికొండలకు వెళ్లాలనుకునేవాళ్లు.. అక్కడ రాత్రి బయలుదేరితే తెల్లవారి ఉదయం 6 గంటలకు భద్రాచలం చేరుకుంటారు.

రైలు ద్వారానైతే కొత్తగూడెం వరకు వచ్చి, అక్కడి నుంచి బస్సులు, ప్రైవేట్‌ వాహనాల్లో భద్రాచలానికి చేరుకోవచ్చు. ఉదయం 8గంటల లోపు శ్రీ సీతారామచంద్రస్వామి వారి దర్శనం చేసుకుని పాపికొండల యాత్రకు వెళ్లవచ్చు. యాత్ర ప్రారంభమయ్యే పోచవరం.. భద్రాచలానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సులు, ప్రైవేట్‌ వాహనాల్లో వెళ్లవచ్చు. పోచవరం పాయింట్‌ నుంచి ఉదయం 9.30 – 10.30 గంటల మధ్య ‘జలవిహారం’ ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 – 5 గంటల వరకు తిరిగి పోచవరానికి చేరుకుంటుంది. 

పాపికొండల ప్యాకేజీ... 
పోచవరం నుంచి పాపికొండల యాత్రకు టికెట్‌ ధర పెద్దలకు రూ.930, పిల్లలకు రూ.730 ఉంటుంది. కళాశాల విద్యార్థులు గ్రూç­³#గా టూర్‌కు వస్తే వారికి రూ.830 చొప్పున వసూలు చేస్తారు. ఈ టికెట్లు భద్రాచలంలో లభిస్తాయి. తెలంగాణ టూ­రిజం ప్రత్యేక ప్యాకేజీ అందిస్తోంది.  హైదరాబాద్‌ నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక బస్సులో సాగే ఈ ప్యాకేజీలో భద్రాచలం, పర్ణశాల రామచంద్రస్వామి దర్శ­నం, పాపికొండల యాత్ర ఉంటాయి. వసతి, భోజన సదుపాయం ఉంటుంది. టికెట్‌ ధర పెద్దలకు రూ.4,999, పిల్లలకు రూ.3999గా నిర్ణయించారు. టికెట్లు టూరిజం శాఖ వెబ్‌సైట్‌లో లభిస్తాయి. కాగా.. టూరిజం అధికారులు ఈ సీజన్‌లో అ«ధికారికంగా ప్రకటించాల్సి ఉంది.  

సంతోషిస్తున్నాం.. 
పాపికొండల యాత్రికులపైనే ఆధారపడి జీవిస్తున్నాం. గోదావరి వరదల కారణంగా ఐదు నెలలుగా ఉపాధిని కోల్పోయాం. మళ్లీ బోటింగ్‌ ప్రారంభానికి అధికారులు ఒప్పుకున్నారని తెలిసి సంతోషిస్తున్నాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం టికెట్లు విక్రయిస్తాం.   
– పఠాన్‌ హుస్సేన్‌ ఖాన్, టికెట్‌ విక్రయ కేంద్రం, భద్రాచలం  

లాంచీలన్నీ సిద్ధంగా ఉంచాం 
లాంచీలను పోచవరం ఫెర్రీ పాయింట్‌ వద్ద సిద్ధంగా ఉంచాం. పర్యాటకుల భద్రత మా ప్రధాన బాధ్యత. అందుకు అనుగుణంగా పలు రకాల రక్షణ సామగ్రి ఏర్పాటు చేశాం.  
– పూనెం కృష్ణ, లాంచీల నిర్వాహకుడు   

మరిన్ని వార్తలు