ప్రభుత్వ పాలనలో ప్రణాళికా శాఖ పాత్ర కీలకం 

28 Oct, 2020 02:06 IST|Sakshi

తెలంగాణ స్టేట్‌ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌ పుస్తకావిష్కరణలో  వినోద్‌ కుమార్‌ 

సాక్షి, హైదరాబాద్‌: దైనందిన పాలనలో ప్రణాళికా శాఖ పాత్ర కీలకమని, ప్రభుత్వంలోని ప్రతి శాఖకు ప్రణాళిక శాఖ దిక్సూచిగా నిలుస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం గణాంకభవన్‌లో ‘తెలంగాణ స్టేట్‌ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌’పుస్తకాన్ని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళికా శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావుతో కలిసి వినోద్‌ కుమార్‌ ఆవిష్కరించారు. రాష్ట్రానికి సంబంధించిన జీఎస్డీపీ అంచనాలు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వివిధ పథకాల పురోగతి, పలు సర్వేలు, గణాంక శాఖల సమాచారం, రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతి వివరాలను ఈ పుస్తకంలో పొందుపర్చారు. ఈ సందర్భంగా వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రణాళికా శాఖ ముఖ్య భూమికను పోషిస్తోందని తెలిపారు. రాష్ట్ర సమగ్ర కార్యాచరణ సమాచారాన్ని క్రోడీకరించి పుస్తక రూపంలో అందుబాటులోకి తీసుకు రావడం గొప్ప విషయమని చెప్పారు.

ఈ సమగ్ర సమాచారం http://tsdps. telangana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు విధిగా ఈ వెబ్‌సైటును ఉపయోగించాలని, ఆయా సమావేశాల్లో ఈ గణాంకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ సీఈవో జి.దయానంద్, రాష్ట్ర రిమోట్‌ సెన్సింగ్‌ శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ శ్రీనివాస్‌రెడ్డి, సిజిస్‌ సంస్థ ప్రతినిధి రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు