నకిలీ మద్యం సరఫరా చేస్తే పీడీ యాక్టు

3 Mar, 2023 03:11 IST|Sakshi
అధికారులతో సమావేశమైన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

అధికారులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎక్సైజ్‌ ఆదాయానికి గండికొట్టేందుకు ఇతర రాష్ట్రాల్లోని మద్యాన్ని సరఫరా చేస్తున్నారని అలాంటి వారిని గుర్తించి పీడీ యాక్టు నమోదు చేయాలని ప్రొహిబిషన్, ఎక్సైజ్‌ శాఖా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదేశించారు. గురువారం తన కార్యాలయంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. శాఖలోని టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ను పటిష్టపర్చాలని ఆదేశించారు.

ఒడిషాలో నకిలీ మద్యం తయారు చేసి రాష్ట్రానికి సరఫరా చేస్తున్న మాఫియాను ఎక్సైజ్‌ అధికారులు సమర్థవంతంగా అడ్డుకున్నారని మంత్రి అభినందించారు. అదేవిధంగా కర్ణాటక, మహారాష్ట్ర, గోవా నుంచి రాష్ట్రానికి వస్తున్న నకిలీ మద్యాన్ని కూడా అరికట్టాలన్నారు. ఎక్సైజ్‌ ఆదాయం పెరిగేందుకు అధికారులు నిబద్ధతతో కృషి చేయడమే కారణమన్నారు. సమీక్షాసమావేశంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ సర్పరాజ్‌ అహ్మద్, అడిషనల్‌ కమిషనర్‌ అజయ్‌ కుమార్, జాయింట్‌ కమిషనర్‌లు ఖురేషి, కె ఏ బి శాస్త్రి, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌లు, బ్రివరేజ్‌ కార్పొరేషన్‌ అధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు