నువ్వు గ్రేట్ అన్న.. చనిపోతూ కూడా..

19 Aug, 2021 09:09 IST|Sakshi

సాక్షి,చాదర్‌ఘాట్‌(హైదరాబాద్): కుటుంబ సభ్యుడు విగతజీవిగా మారినా గుండె నిబ్బరం చేసుకుని ఓ కుటుంబం తీసుకున్న నిర్ణయం ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. మానవత్వాన్ని మించిన గొప్పతనాన్ని చాటిన ఆ కుటుంబానికి ఆసుపత్రిలోని పలువురు కన్నీటితోనే ఓదార్పును అందజేశారు. తనువు చాలిస్తూ కూడా ఆరుగురికి జీవన దానం చేసిన అతడు దేవుడితో సమానమని.. సరైన సమయంలో ఆ కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకోవటం గొప్ప విషయమని మలక్‌పేట యశోదా ఆసుపత్రి ఎండీ సురేందర్‌రావు కొనియాడారు. 
► కొత్తగూడెం భద్రాద్రి జిల్లా బాబుక్యాంపులో నివాసముండే కంజుల అనిల్‌కుమార్‌ (45) మణుగూరు టీఎస్‌ జెన్‌కో బీటీపీఎస్‌లో జేపీఏగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈనెల 11న పాల్వంచ నుంచి మణుగూరుకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. మెరుగైన చికిత్స కోసం కుటుంబసభ్యులు అతడిని మలక్‌పేట యశోదా ఆసుపత్రిలో చేర్పించారు. అనిల్‌కుమార్‌కు శస్త్ర చికిత్స నిర్వహించి ఆరు రోజుల పాటు వెంటిలేటర్‌పై ఉంచారు.  
► మంగళవారం సాయంత్రం అనిల్‌కుమార్‌ బ్రెయిన్‌ డెడ్‌ అయ్యాడని వైద్యులు తెలిపారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులకు “జీవన్‌ దాన్‌’కార్యక్రమం గురించి వివరించారు. మృతుడి అవయవాలను చికిత్స పొందుతున్న ఆరుగురికి అందించి ప్రాణదాతలు కావాలని ఆ కుటుంబ సభ్యులను కోరారు. శోక సంద్రంలో ఉన్న ఆ కుటుంబ సభ్యులు జీవన్‌ దాన్‌కు ఒప్పుకుని ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపారు.

ఆరుగురికి అవయవ దానం... 
బ్రెయన్‌డెడ్‌ అయిన అనిల్‌కుమార్‌ గుండెను ప్రత్యేక విమానంలో చెన్నై ఆసుపత్రికి.. కిడ్నీని అపోలో, యశోదా ఆసుపత్రులకు, కళ్లను ఎల్వీ ప్రసాద్‌ ఆసుపత్రికి, లివర్, ఊపిరితిత్తులను సికింద్రాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి తరలించి అక్కడి రోగుల చికిత్సకు అందజేశారు. అనిల్‌కుమార్‌ మృతదేహానికి యశోదా ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది గౌరవ వందనం చేశారు.

మరిన్ని వార్తలు