కారును పోలిన గుర్తులు కేటాయించొద్దు.. ఢిల్లీ హైకోర్టుకు బీఆర్‌ఎస్

12 Oct, 2023 08:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కారును పోలిన గుర్తులను కేంద్ర ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్‌ నుంచి తొలగించాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. కారును పోలిన రోడ్డు రోలర్‌లాంటి గుర్తుల వల్ల బీఆర్‌ఎస్‌కు ఎన్నికల్లో నష్టం కలుగుతుందని పిటిషన్‌లో పేర్కొంది. దీనిపైటిషన్‌పై ఢిల్లీ న్యాయస్థానం నేడు (గురువారం) విచారణ చేపట్టనుంది.

కాగా కారును పోలిన గుర్తులను తొలగించాలని, వాటిని ఏ పార్టీకి కేటాయించవద్దని కోరుతూ బీఆర్‌ఎస్‌ పార్టీ గతంలో పలుమార్లు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. బీఆర్‌ఎస్‌ విజ్ఞప్తి మేరకు 2011లో రోడ్డురోలర్‌ గుర్తును తొలంగించినప్పటికీ తిరిగి చేర్చటాన్ని అభ్యంతరపెడుతూ ఆ గుర్తును తొలగించాలని విజ్ఞప్తి చేసింది. స్వతంత్ర అభ్యర్థులు, ఎన్నికల సంఘం గుర్తింపు పొందని పార్టీలకు కేటాయించే ఎన్నికల గుర్తుల్లో కారు గుర్తును పోలిన వాటిని కేటాయించకూడదని కోరింది.

కెమెరా, చపాతి రోలర్‌, రోడ్‌రోలర్‌, సోప్‌డిష్‌, టెలివిజన్‌, కుట్టుమిషన్‌, ఓడ, ఆటోరిక్షా, ట్రక్‌ వంటి గుర్తులు ఈవీఎంలలో కారు గుర్తును పోలినట్టు ఉన్నాయని, ఆ గుర్తులను రాబోయే ఎన్నికల్లో ఎవరికీ కేటాయించకూడదని ఎన్నికల సంఘాన్ని కోరింది. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో అభ్యర్థులకు ఆ గుర్తులను కేటాయించకూడదని, దీని వల్ల బీఆర్‌ఎస్‌కు నష్టం వాటిల్లుతున్నదని తెలిపింది. అయితే బీఆర్‌ఎస్‌ విజ్ఞప్తులపై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటి వరకు స్పందించకపోవడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. 
చదవండి: ద–పొలిటికల్‌–‘పుష్ప’! సినిమాలూ, రాజకీయ గుర్తులు.. తగ్గేదేలే

మరిన్ని వార్తలు