తెలంగాణలో అడవులు, పచ్చదనం భేష్‌

27 Feb, 2022 01:45 IST|Sakshi
అటవీ అధికారులతో మాట్లాడుతున్న వివిధ రాష్ట్రాల పీసీసీఎఫ్‌లు 

నేషనల్‌ కంపా సీఈఓ సుభాష్‌ చంద్ర ప్రశంస 

అర్బన్‌ పార్కుల అభివృద్ధితో ప్రజలకు ఆక్సిజన్‌ 

హైదరాబాద్‌ శివార్లలో వివిధ రాష్ట్రాల పీసీసీఎఫ్‌ల పర్యటన 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అటవీ శాఖ నిబంధనల మేరకు ప్రత్యామ్నాయ అటవీకరణ నిధులను వినియోగిస్తూ మంచి ఫలితాలు రాబడుతోందని నేషనల్‌ కంపా సీఈవో సుభాష్‌చంద్ర ప్రశంసించారు.  అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల ఏర్పాటు ప్రస్తుత పట్టణీకరణ పరిస్థితుల్లో చాలా ఉపయోగకరమైన కార్యక్రమమని పేర్కొన్నారు. జాతీయ అటవీ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర పర్యటనలో సుభాష్‌చంద్ర, వివిధ రాష్ట్రాల అటవీ సంరక్షణ ప్రధాన అధికారు (పీసీసీఎఫ్‌)లు శనివారం క్షేత్ర స్థాయి సందర్శనలో పాల్గొన్నారు.

హైదరాబాద్‌ శివారు కండ్లకోయ అక్సిజన్‌ అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుతోపాటు, ఔటర్‌రింగ్‌ రోడ్డు పచ్చదనం, ఎవెన్యూ ప్లాంటేషన్‌లను పరిశీలించారు. తెలంగాణలో అడవుల నిర్వహణ, పచ్చదనం పెంపు చాలా బాగుందని మెచ్చుకున్నారు. తెలంగాణ అటవీశాఖ చొరవ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని  యూపీ పీసీసీఎఫ్‌ సంజయ్‌ శ్రీవాత్సవ అన్నారు. కార్యక్రమంలో మణిపూర్‌ పీసీసీఎఫ్‌ ఆదిత్య జోషి, పీసీసీఎఫ్‌(కంపా) లోకేశ్‌ జైస్వాల్, హైదరాబాద్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఎం.జె. అక్బర్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు