ఇంటి కుళాయికి బిరడా

5 Jan, 2023 03:59 IST|Sakshi

పశువుల కాపరికి మరో షాక్‌

వివాదాస్పదం కావడంతో తొలగించిన అధికారులు

మంగపేట: రోడ్డువెంట మొక్కల్ని పశువులు ధ్వంసం చేస్తున్నాయంటూ పశువుల కాపరికి రూ.7,500 జరిమానా విధించిన అధికారులు.. తాజాగా సదరు కాపరి ఇంటి కుళాయికి బిరడా బిగించడం వివాదాస్పదమైంది. ములుగు జిల్లా మంగపేటలో అవెన్యూ ప్లాంటేషన్‌ మొక్కలను పశువులు ధ్వంసం చేయడానికి కారకుడంటూ పశువుల కాపరి గంపోనిగూడెంకు చెందిన బోయిన యాకయ్యకు పంచాయతీ అధికారులు రూ.7500 జరిమానా విధించడం తెలిసిందే.

తాజాగా యాకయ్య ఇంటి కుళాయి (నల్లా)ను సైతం పంచాయతీ అధికారులు సీజ్‌ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బుధవారం కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య వాహనానికి పశువులు అడ్డం వచ్చాయి. ఎంత హారన్‌ కొట్టినా వాటిని పక్కకు అదిలించకుండా పశువుల కాపరి యాకయ్య ఫోన్‌ మాట్లాడుతుండడంతో కలెక్టర్‌ అసహనానికి గురయ్యారు. దీంతో తన గన్‌మెన్‌ను పంపి కాపరి ఫోన్‌ను లాక్కున్నట్టు స్థానికులు చెబుతున్నారు.

దీనికి పశువులు మొక్కలను ధ్వంసం చేస్తున్నాయన్న సాకుతో జరిమానా విధించినట్లు చెబుతున్నారు. నల్లాకు బిరడా బిగింపుపై పశువుల కాపరి యాకయ్య మాట్లాడుతూ రూ.7,500 జరిమానాను మూడు నెలల్లో చెల్లించాలని చెప్పి ఫోన్‌ ఇచ్చారని తెలిపాడు. ఇంటికి వచ్చి చూడగా పంచాయతీ సిబ్బంది తన ఇంటి నల్లాకు బిరడా వేసి సీజ్‌ చేశారని పేర్కొన్నాడు. సాయంత్రం ఎంపీడీవో ఫోన్‌ చేసి నల్లా బిరడా తొలగించుకోమన్నారని, తనకు తెలియదని చెబి తే.. పంచాయతీ సిబ్బంది వచ్చి తొలగించి వెళ్లారని వివరించాడు. తనకు విధించిన జరిమానాపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశాడు.

నిర్లక్ష్యానికే జరిమానా: ఎంపీడీవో
మండలంలోని ఏటూరునాగారం–బూర్గంపాడు ప్రధాన రోడ్డుకిరువైపులా నాటిన అవెన్యూ ప్లాంటేషన్‌ మొక్కలను పశువులు ధ్వంసం చేస్తున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసినందుకే పశువుల కాపరికి పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం జరిమానా విధించామని ఎంపీడీవో శ్రీధర్‌ ఓ వీడియోలో వివ రణ ఇచ్చారు. ఈ వీడియో సామాజిక మాధ్యమా ల్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై వివరణ కోరేందుకు ఎంపీడీవోకు ఫోన్‌ చేయగా స్విచాఫ్‌ అని వస్తోంది. 

మరిన్ని వార్తలు