నల్లమలలో ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌

28 Feb, 2022 03:28 IST|Sakshi
నల్లమల ముఖద్వారాన్ని ప్రారంభించిన అటవీ శాఖ ఉన్నతాధికారులు

కేంద్ర అటవీశాఖ డీజీ సీపీ గోయల్‌

సాక్షి, నాగర్‌కర్నూల్‌: అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ విశిష్టతను కాపాడుతూనే వన్యప్రాణుల పరిరక్షణకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామని కేంద్ర అటవీశాఖ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రప్రకాశ్‌ గోయల్‌ తెలిపారు. ఆదివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం మన్ననూర్‌ వద్ద నల్లమల ముఖద్వారాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మన్ననూర్‌ నుంచి దోమలపెంట వరకు 70 కి.మీ. రహదారిని ప్లాస్టిక్‌ రహితంగా మార్చడంతో పాటు ఆ ప్లాస్టిక్‌ను మన్ననూర్‌లో రీసైక్లింగ్‌ చేయిస్తామన్నారు.

ఇందుకోసం 15 మంది స్థానిక చెంచులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశామన్నారు. టైగర్‌ రిజర్వులో ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ చేయడం దేశంలోనే తొలిసారన్నారు. అనంతరం మన్ననూర్‌లోని వైజ్ఞానిక, పర్యావరణ కేంద్రం, బయోల్యాబ్‌ను కేంద్ర బృందం పరిశీలించింది. అమ్రాబాద్‌ జంగిల్‌ సఫారీలో ప్రయాణించిన అధికారులు ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తంచేశారు.

నల్లమలలో చెంచు మహిళలకు ఉపాధి కల్పించేందుకు అపోలో ఫౌండేషన్‌ ఏర్పాటుచేసిన ప్యాకేజింగ్‌ వర్క్‌షాపు, అచ్చంపేట అటవీశాఖ కార్యాలయంలో చౌసింగా మీటింగ్‌ హాల్, ఔషధ మొక్కలతో ఏర్పాటుచేసిన మెడిసినల్‌ గార్డెన్‌ను ప్రారంభించారు. అలాగే అచ్చంపేటలో నిర్మించనున్న అటవీ అమరవీరుల స్తూపానికి శంకుస్థాపన చేశారు.

మరిన్ని వార్తలు