Telangana: ఎన్నికలకు సర్వం సిద్ధం

24 Sep, 2023 02:00 IST|Sakshi

షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు: సీఈఓ వికాస్‌రాజ్‌ 

చివరి దశలో ఓటర్ల జాబితా రూపకల్పన... కొత్తగా 15 లక్షల మంది ఓటర్లకు జాబితాలో చోటు

3న రాష్ట్రానికి ఈసీఐ ఫుల్‌కమిషన్‌ రాక

సీఈఓ కార్యాలయంలో ఎన్నికల కోసం మీడియా సెంటర్‌ ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: షెడ్యూల్‌ ప్రకారం రాష్ట్ర శాసన సభ ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉన్నామని, ఇందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్‌ తెలిపారు. గత మే 23 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యే క సవరణ కార్యక్రమాన్ని ప్రారంభించామని, మరో వారంలో తుది జాబితాను ప్రకటిస్తామని వెల్లడించారు.

ఈవీఎంలన్నింటికీ ప్రాథమిక స్థాయి తనిఖీలతోపాటు అన్ని జిల్లాల్లో ఎన్నికల శిక్షణ కార్యక్రమాలను సైతం పూర్తి చేశామన్నారు. శాసనసభ ఎన్నికల కవరేజీ కోసం బీఆర్‌కేఆర్‌ భవన్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా కేంద్రాన్ని ఆయన శనివారం ప్రారంభించి విలేకరులతో మాట్లాడారు.

ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకటించిన వెంటనే రిటర్నింగ్‌ అధికారులు నామినేషన్లను స్వీకరించి పరిశీలిస్తారని, బ్యాలెట్‌ పత్రాల ముద్రణ తర్వాత ఈవీఎంలకు ద్వితీయస్థాయి తనిఖీల(ఎస్‌ఎల్‌ఎఫ్‌)ను నిర్వహిస్తారని చెప్పారు.

అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చే ఎన్నికల పరిశీలకుల సమక్షంలో ఈవీఎంల ర్యాండమైజేషన్‌ నిర్వహిస్తారన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే నెల తొలి వారంలో వచ్చే అవకాశం ఉందా? అని విలేకరులు ప్రశ్నించగా, షెడ్యూల్‌ను ఈసీ ప్రకటిస్తుందని బదులిచ్చారు. 

జిల్లాల్లో చురుగ్గా ఏర్పాట్లు
అక్టోబర్‌ 4న తుది ఓటర్ల జాబితాను ప్రకటించిన తర్వాత జిల్లాల్లో ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటుందని వికాస్‌రాజ్‌ చెప్పారు. ఈవీఎంల పంపిణీ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూమ్‌లు ఏర్పాటు, ప్రిసైడింగ్‌ అధికారులు, పోలింగ్‌ అధికారులను గుర్తించి శిక్షణ ఇస్తామని తెలిపారు.

నిబంధనల మేరకు ర్యాంపులు, విద్యుదీకరణ, టాయిలెట్లు వంటి కనీస సదుపాయాలు ప్రతీ పోలింగ్‌ కేంద్రంలో ఉన్నాయా? లేవా? అని పరిశీలించామని,  సదుపాయాలను కల్పించే ప్రక్రియ చివరి దశకు చేరుకుందన్నారు. కేంద్ర బలగాలకు వసతి, రవాణా సదుపాయాలు కల్పించడంతోపాటు ఎంత మందిని సమస్యాత్మక ప్రాంతాల్లో నియమించాలన్న దానిపై ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.  

6.99 లక్షల మంది యువ ఓటర్లు
గత జనవరి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 15 లక్షల మంది కొత్త ఓటర్లు జాబితాలో చేరారని, వీరిలో 6.99 లక్షల మంది 18–19 ఏళ్ల యువ ఓటర్లు ఉన్నారని వికాస్‌రాజ్‌ తెలిపారు. లక్ష మంది దివ్యాంగ ఓటర్లను గుర్తించామన్నారు. 80 ఏళ్లుపైబడిన, దివ్యాంగ ఓటర్లకు ఇంటి నుంచే బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఇందుకోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

వచ్చే నెల 3 నుంచి 5 వరకు రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం ఫుల్‌ కమిషన్‌ పర్యటించనుందని ఆయన తెలిపారు. కమిషన్‌ రాజకీయ పార్టీలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీఎస్, డీజీపీ, 20కి పైగా కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో మూడు రోజులపాటు సమావేశాలు నిర్వహిస్తుందని వివరించారు. దర్యాప్తు సంస్థల నుంచి ఇప్పటికే నివేదికలు తమకు అందుతున్నాయన్నారు. 

ఓటరు నమోదు కోసం..
ఓటర్ల జాబితాతో సహా ఇతర అంశాలపై తమకు చాలా ఫిర్యాదులు అందాయని, ప్రతి ఫిర్యాదుపై సమగ్రంగా విచారణ జరిపి ఫిర్యాదుదారులకు సైతం నివేదిక ప్రతిని అందజేస్తున్నామని వికాస్‌రాజ్‌ వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో 700 బృందాలు నాలుగు వేలకు పైగా ఇళ్లను సందర్శించి చిరునామా మారిన ఓటర్ల తొలగింపును చేపట్టారని తెలిపారు.

నామినేషన్ల చివరి తేదీ వరకు ఓటరుగా నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు సీఈఓలు సర్ఫరాజ్‌ అహ్మద్, లోకేష్‌కుమార్, సమాచార శాఖ కమిషనర్‌ అశోక్‌ రెడ్డి, జాయింట్‌ సీఈఓ సత్యవాణి పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు