తక్కువ ధరకే లగ్జరీ కార్లు ఇప్పిస్తానని మోసం

15 Dec, 2021 08:41 IST|Sakshi

బంజారాహిల్స్‌: లగ్జరీ కార్లను మార్కెట్‌ ధరలో 30 శాతం తక్కువ ధరకు ఇప్పిస్తానని నమ్మించి మోసగించిన స్పేస్‌ టైమ్‌ ఇంటీరియర్స్‌ డైరెక్టర్‌ ఆత్మకూరి ఆకాష్, అజయ్, విజయ్‌ కాంజీలపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో చీటింగ్‌ కేసు నమోదైంది. పోలీసుల సమాచారం మేరకు... జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం. 82లోని సినార్‌వ్యాలీలో నివసించే వ్యాపారి వి.పి.ఆనంద్‌కు తన స్నేహితుడు దివేష్‌ ద్వారా ఆత్మకూరి ఆకాష్, అజయ్‌ పరిచయం అయ్యారు.

తాము హైఎండ్‌ కార్లను 30 శాతం రాయితీతో ఇప్పిస్తామని చెప్పడంతో నమ్మిన ఆనంద్‌ ఆ మేరకు ఇన్నోవా క్రిస్టా కారును కొనేందుకు ఆసక్తి చూపాడు. రూ. 18 లక్షల విలువ చేసే ఈ కారును రూ. 15 లక్షలకే ఇస్తామని చెప్పడంతో ఆ మేరకు రూ. 10.83 లక్షలు చెల్లించాడు. ఇందుకు సంబంధించిన ఆర్‌సీని కూడా పంపించాడు. అయితే కారును ఇవ్వడంలో ఆకాష్‌ విఫలమయ్యాడు. అంతకుముందే ఆయన వంద మందికిపైగా వీవీఐపీలను రాయితీ కార్ల పేరుతో రూ. 60 కోట్ల వరకు మోసగించిన కేసులు పోలీస్‌ స్టేషన్‌లో నమోదై ఉన్నాయి. తాను మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులపై ఐపీసీ సెక్షన్‌ 406, 420 కింద క్రిమినల్‌ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

(చదవండి: మాజీ ప్రియురాలు ఫోన్‌​ అన్‌లాక్‌ చేసి... ఏకంగా రూ 18 లక్షలు కొట్టేశాడు!!)

మరిన్ని వార్తలు