‘చీకోటి’ వ్యవహారంలో ఈడీ దూకుడు

17 Nov, 2022 02:56 IST|Sakshi

తలసాని సోదరులను ప్రశ్నించిన అధికారులు 

ఎమ్మెల్సీ రమణ, మెదక్‌ డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డికి నోటీసులు

సాక్షి, హైదరాబాద్‌: విదేశాల్లో కేసినో వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దూకుడు పెంచింది. ప్రత్యేక విమానాల్లో శ్రీలంక, నేపాల్, ఇండోనేషియా తీసుకెళ్లి అక్కడ కేసినో ఆడించిన వ్యవహారంలో ఇప్పటికే చీకోటి ప్రవీణ్‌పై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మంత్రి తల­సాని శ్రీనివాస్‌యాదవ్‌ సోద­రు­లు మహేశ్, ధర్మేందర్‌ సంబంధాలపై ఈడీ బుధవారం ప్రశ్నించింది. చీకోటి నిర్వహించిన ఈ కేసీనోలకు వీరు కూడా హాజరయ్యారన్న సమాచారం మేరకు అధి­కా­రుల వారి నుంచి కూపీ లాగుతున్నారు. విదేశాల్లో కేసినో నిర్వహణ, ఆర్థిక లావాదేవీలు, మనీ లాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై వారిపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం.

ఇక్కడ కరెన్సీని విదేశాలకు హవాలా ద్వారా చేరవేసి, అక్కడ కరెన్సీ తీసుకున్నారా? నిబంధనల ప్రకారం మార్పిడి చేశారా?.. ఇలా పలు అంశాలపై మంత్రి సోదరులను ప్రశ్నించినట్లు తెలిసింది. ట్రావెల్‌ ఏజెన్సీ ద్వారా జరిగిన విదేశీ ప్రయాణాల విమాన టికెట్ల బుకింగ్‌ వ్యవహారాలనూ ఈడీ సేకరించినట్లు చెబుతున్నారు. వీరిని గురువారం కూడా మరోసారి విచారించనున్నట్లు తెలిసింది. చీకోటి ప్రవీణ్, ఆయన ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ రికార్డులను పరిశీలించిన ఈడీ అధికారులు ఈ కేసీనో వ్యవహారంలో ఎవరెవరూ ఉన్నారన్న పూర్తి సమాచారాన్ని రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిలో దాదాపు వంద మంది వరకు ఉన్నట్లు గుర్తించి.. ఆ మేరకు జాబితా సిద్ధం చేసినట్లు తెలిసింది. కేసీనోలతో సంబంధమున్న వారికి నోటీసులు ఇవ్వడం ప్రారంభించింది. అందులో భాగంగానే శుక్రవారం విచారణకు హాజరుకావాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, మెదక్‌ డీసీసీబీ చైర్మన్‌ దేవేందర్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది.

ఇదీ చదవండి: కేసీఆర్‌ కాళ్లుమొక్కిన ఉన్నతాధికారి.. ఎమ్మెల్యే టిక్కెట్‌ కోసమేనా!

మరిన్ని వార్తలు