సబ్‌కా వికాస్‌ కాదు.. సబ్‌ బక్వాస్

8 Dec, 2022 02:55 IST|Sakshi

మోదీ ప్రధాని అయ్యాక దేశంలో సాధించిన పురోగతి ఏమిటి?  

ఊరికో చైనా బజార్‌ రావడమే మీ మేకిన్‌ ఇండియానా? 

జగిత్యాల సభలో సీఎం కేసీఆర్‌ ఫైర్‌ 

ఎల్‌ఐసీని, కరెంటు సదుపాయాలను అమ్ముకుంటున్నారు 

కేంద్రం తీరుతో పెట్టుబడిదారులు దేశాన్ని వీడుతున్నారు 

50లక్షల మంది నిరుద్యోగులయ్యారు.. దీనిపై దేశంలో ఎక్కడైనా చర్చకు సిద్ధం 

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రోజుకో లైంగికదాడి, దళితులపై దౌర్జన్యాలు 

మత పిచ్చిగాళ్ల మాటలు వింటే మోసపోతాం.. 

మరో పది రోజుల్లో రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ 

కొండగట్టుకు రూ. 100 కోట్లు

నేను బతికి ఉన్నంతకాలం రైతుబంధు, రైతుబీమా  
విచ్ఛిన్నమైన, ధ్వంసమైన  తెలంగాణ రైతాంగానికి పునరుజ్జీవం కల్పించేందుకే రైతు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం. నేను బతికి ఉన్నంతకాలం.. రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్‌ కొనసాగిస్తాం. మాటల గారడీ, మత పిచ్చిగాళ్ల మాటలు వింటే మోసపోతాం. అప్రమత్తంగా ఉండాలి. 

ప్రభుత్వ ఆస్తి షావుకార్లకు కట్టబెట్టే కుట్ర 
రాష్ట్రాలు పేదలకు ఉచిత పథకాలను అమలు చేయొద్దు. కానీ కేంద్రంలోని బీజేపీ సర్కారు ఎన్‌పీఏల పేరిట రూ.14 లక్షల కోట్ల ఆస్తులను ప్రైవేటుపరం చేసింది. కేంద్ర బడ్జెట్‌తో సమాన బడ్జెట్‌ ఉన్న ఎల్‌ఐసీని షావుకార్లకు కట్టబెట్టే కుట్రలు   జరుగుతున్నాయి. 25 లక్షల మంది ఎల్‌ఐసీ  ఏజెంట్లు దీనికి వ్యతిరేకంగా పిడికిలి ఎత్తాలి. వందలు, వేలకోట్ల ప్రజల సొమ్ముతో విద్యుత్‌ రంగంలో ఏర్పాటు చేసుకున్న మౌలిక సదుపాయాలను నామమాత్రపు ధరలకు కట్టబెట్టే కుట్ర జరుగుతోంది. 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:  ‘‘కేంద్రంలో  నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక దేశంలో ఏ రంగంలో విజయవంతం అయిందో చెప్పాలి. మేకిన్‌ ఇండియాతో ఏ పరిశ్రమ వచ్చిందో చెప్పాలి. ప్రతీ ఊర్లో చైనా బజార్లు రావడమేనా మీరు సాధించింది. దీపాంతలు, జెండాలు, బ్లేడ్లు, కుర్చీలు కూడా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. బీజేపీ విధానాల కారణంగా దేశంలో వేల పరిశ్రమలు మూతపడ్డాయి.

50 లక్షల మంది నిరుద్యోగులు అయ్యారు. బీజేపీది సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్‌ కాదు.. సబ్‌ బక్వాస్‌..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. ఉత్త మాటల గారడీ, డంబాచారం తప్ప బీజేపీ సాధించినదేమీ లేదని పేర్కొన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా కొత్త కలెక్టరేట్, టీఆర్‌ఎస్‌ కార్యాలయాల ప్రారంభం, మెడికల్‌ కాలేజీకి భూమి పూజ కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. అనంతరం జగిత్యాల అర్బన్‌ మండలం మోతె వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే.. 
 
‘‘కొంతకాలంగా గోల్‌మాల్‌ గోవిందాలు, మాటలగారడీ గాళ్లు తిరుగుతున్నారు. వారితో అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా లేకపోతే ఆగమైపోతాం. ఒకసారి తెలంగాణ నాయకులు చేసిన చిన్న పొరపాటు వల్ల 60 ఏళ్లు ప్రజలు ఉద్యమించారు. సమ్మెలు, పోరాటాలు, ప్రాణత్యాగాలు చేశారు. మోసపోతే దెబ్బతింటాం. 100 ఏళ్లు వెనక్కిపోతాం. మేధావులు, రచయితలు, విద్యావంతులు, యువత దీనిపై చర్చించాలి. 
జగిత్యాల పట్టణం మోతె గ్రామం వద్ద బుధవారం నిర్వహించిన బహిరంగసభకు హాజరైన జనం. (ఇన్‌సెట్‌) ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్‌  

బీజేపీ సాధించినదేమీ లేదు 
బీజేపీ విధానాల కారణంగా దేశంలో 10 వేల పరిశ్రమలు మూతబడ్డాయి. 50 లక్షల మంది నిరుద్యోగులయ్యారు. దీనిపై నేను దేశంలో ఎక్కడైనా చర్చకు సిద్ధం. ఏటా 10వేల మంది పెట్టుబడిదారులు దేశాన్ని వీడుతున్నారు. అన్న వస్త్రం కోసం పోతే.. ఉన్న వస్త్రం ఊడిపోయింది అన్నట్టు దేశం పరిస్థితి తయారైంది. సబ్‌కా సాత్‌.. సబ్‌కా వికాస్‌ కాదు.. సబ్‌ బక్వాస్‌. మాటలగారడీ, డంబాచారం తప్ప బీజేపీ సాధించిందేమీ లేదు.

దేశ రాజధాని ఢిల్లీలోనూ కరెంటు కోతలు, మంచినీళ్లు రావు. అంగన్‌వాడీ నిధులతో బేటీ బచావో బేటీ పడావో అంటూ నినాదాలా? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రోజుకో లైంగికదాడి, దళితులపై దౌర్జన్యాలు జరగకుండా రోజు గడుస్తోందా? తెలంగాణ జీఎస్‌డీపీ 5 లక్షల కోట్ల నుంచి 11.5 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. అదే కేంద్రం తీరు సరిగ్గా ఉంటే.. రూ.14 లక్షల కోట్లకు చేరి ఉండేది. 

వ్యవసాయ స్థిరీకరణకే పథకాలు 
ఛిద్రమైన తెలంగాణ వ్యవసాయాన్ని స్థిరీకరించేందుకే రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్‌ పథకాలను అమలు చేస్తున్నాం. కేసీఆర్‌ బతికి ఉన్నంత కాలం ఈ పథకాలు అమలవుతాయి. దాదాపు 7,000 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కేవలం ఐదు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాం. మరో 5–10 రోజుల్లో రైతుబంధు కూడా వస్తుంది. దేశంలోని 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులుండగా వారి గోస ఎవరూ పట్టించుకోలేదు.

వారికి నెలకు వందల కోట్లు వెచ్చిస్తూ రూ.2,016 పింఛన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే. ఆరోగ్యశ్రీ, కల్యాణలక్షి, కేసీఆర్‌ కిట్‌ వంటి సంక్షేమ పథకాలెన్నో అందజేస్తున్నాం. కులమతాలకు అతీతంగా అందరికీ ఉపయోగపడేలా దాదాపు వెయ్యి గురుకులాలతో దేశంలోనే ఆదర్శంగా నిలిచాం. వ్యక్తిగత ఆదాయం, విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉంది. 

వరద కాల్వను జీవనది చేసుకున్నాం.. 
గతంలో వరద కాల్వపై మోటార్లు పెట్టుకుంటే పీకేసేవారు. రైతులు ఆత్మహత్యలు, దుబాయ్, బొంబాయి వలసలతో అల్లాడే పరిస్థితి. తెలంగాణ వచ్చాక వరద కాల్వను జీవనదిగా మార్చుకున్నాం. ఈ కాల్వపై ఉన్న తూముల నుంచి దాదాపు 13 వేల మోటార్లు పెట్టుకుని రైతులు స్వేచ్ఛగా సాగు చేసుకుంటున్నారు. అలాంటి మోటర్లకు మీటర్లు పెడతారంట.. ఇది సబబేనా? రాష్ట్ర రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ కోసం రూ.13–14 వేల కోట్లను ప్రభుత్వం చెల్లిస్తోంది. ప్రపంచంలో రైతుబంధు, రైతుబీమా ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణనే. 

రెండు జిల్లాల్లోని నియోజకవర్గాలు అదనపు నిధులు 
ఉద్యమ సమయంలో గోదావరి తీరంలోని ధర్మపురి క్షేత్రంలో పుష్కరాలపై వివక్ష చూపడంపై చాలాసార్లు ప్రశ్నించాను. ప్రజలు, పండితుల దీవెన వల్ల నేడు తెలంగాణ సాకారమైంది. మన వద్ద ఘనంగా పుష్కరాలు చేసుకున్నాం. ఉద్యమ సమయంలో జగిత్యాల జిల్లాలో ఎటుచూసినా ఎండిన చెరువులు, బోర్లు కనిపించేవి. అప్పట్లో నేను బండలింగాపూర్‌ గ్రామంలో బస చేశాను కూడా. ఆ గ్రామస్తుల కోరిక మేరకు దాన్ని మండలంగా ప్రకటిస్తున్నాను.

జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాలోని నియోజకవర్గాలకు రూ.10 కోట్ల చొప్పున అదనంగా మంజూరు చేస్తాం. రోళ్లవాగు ప్రాజెక్టును త్వరగా పూర్తిచేస్తాం. వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్, భీమారంలకు ఉపయోగపడేలా సూరమ్మ చెరువును నింపుతాం. మల్యాల మండలం ‘మద్దుట్ల’ ఎత్తిపోతలను వెంటనే చేపడతాం. పోతారం, నారాయణపూర్‌ రిజర్వాయర్లను పూర్తి చేస్తాం..’’ అని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. జై తెలంగాణ, జై భారత్‌ నినాదాలతో ప్రసంగం ముగించారు. 

అభివృద్ధిలో ఉద్యోగుల కృషి ఎనలేనిది 
జగిత్యాల కలెక్టరేట్‌ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి సంక్షేమ పథకం విజయం వెనుక ఉద్యోగుల కృషి ఎనలేనిదని.. ఉద్యమంలోనూ ఎంతో పోరాడారని చెప్పారు. పరిపాలన వికేంద్రీకరణ కోసమే కొత్త జిల్లాలు, కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు, జిల్లాకో మెడికల్‌ కాలేజీలు నిర్మించుకున్నామన్నారు.

రైతుబంధు, బీమా, ఇతర పథకాలతో వ్యవసాయ స్థిరీకరణ జరిగి, వలసలు తగ్గాయని చెప్పారు. కార్యక్రమాల్లో సీఎం వెంట మంత్రులు మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు సంజయ్, విద్యాసాగర్‌రావు, రవిశంకర్, రమేశ్‌బాబు, ఎమ్మెల్సీలు కె.కవిత, ఎల్‌.రమణ, పాడి కౌశిక్‌రెడ్డి, భానుప్రసాద్‌రావు, ఎంపీ వెంకటేశ్‌ నేత తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు