'సర్జికల్ స్ట్రైక్ ఆపరేషన్‌లో బిపిన్‌ రావత్ పాత్ర మరువలేం'

9 Dec, 2021 18:23 IST|Sakshi

రావత్‌ స్నేహితుడు కల్నల్‌ పి.వి. దుర్గాప్రసాద్‌

సాక్షి, హైదరాబాద్‌: బిపిన్‌ రావత్‌లోని కృషి, పట్టుదలే అతన్ని ఈ స్థాయికి తీసుకువచ్చిందని రావత్‌ స్నేహితుడు కల్నల్‌ పి.వి. దుర్గాప్రసాద్‌ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'బిపిన్‌రావత్‌తో 20 ఏళ్ల పాటు కలిసి పనిచేశాను. ఆయన అందరితో కలసిపోయే స్వభావం కలవాడు. మూడు రక్షణ విభాగాలను ఒకే తాటిపై తీసుకురావడంలో బిపిన్ రావత్ పాత్ర మరువలేనిది. రావత్ కుటుంబం మొత్తం దేశానికి సేవ చేసిన వారే. ఇద్దరం కలిసి ఒకే రెజిమెంట్‌లో పనిచేశాం. దేశ సరిహద్దుల సమస్యలను ఎదుర్కొనడంలో వ్యూహాలు రచించేవారు.

అనేక కీలకమైన ఆపరేషన్‌లలో రావత్ ముందుండి నడిపించేవాడు. సర్జికల్ స్ట్రైక్ ఆపరేషన్‌లో రావత్ పాత్ర మరవలేము. రావత్ కుటుంబంతో మాకు మంచి పరిచయం ఉంది. రావత్‌కు ఇద్దరు కుమార్తెలు. ఇటీవల దుందిగల్ ఎయిర్ పోర్ట్‌కు వచ్చినప్పుడు చివరిసారిగా కలిశాము. రావత్ మరణం దేశానికి తీరని లోటు. వ్యక్తిగతంగా జీర్ణించుకోలేక పోతున్నాను. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరుపుతారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేలా చర్యలు ఉంటాయి' అని కల్నల్‌ పి.వి. దుర్గాప్రసాద్‌ అన్నారు

చదవండి: (Bipin Rawat: భయమంటే తెలియని.. అలుపెరగని సైనికుడు)

మరిన్ని వార్తలు