సామాన్యుడి నుంచి ఎమ్మెల్యే వరకు..

7 Aug, 2020 04:27 IST|Sakshi

తుదిశ్వాస విడిచే వరకు నమ్మిన సిద్ధాంతాన్ని వీడని నేత సోలిపేట

దుబ్బాకటౌన్ ‌: సామాన్య రైతు కుటుంబంలో పుట్టి నాలుగుమార్లు శాసనసభ్యుడిగా పనిచేసినా.. తుదిశ్వాస విడిచే వరకు నమ్మిన సిద్ధాంతాన్ని వీడని నాయకుడిగా దుబ్బాక ఎమ్మెల్యే దివంగత సోలిపేట రామలింగారెడ్డి ప్రజల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు. రామలింగారెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డి గ్రామంలో పోలీస్‌పటేల్‌. రామలింగారెడ్డి చిన్నప్పటి నుంచే అభ్యుదయ భావాలతో పెరిగారు. పాఠశాలకు రోజూ నడిచి వెళ్లేవారు. టెన్త్‌ అయ్యాక చదువుకోకుండా వ్యవసాయం చేస్తూ దోస్తులతో తిరుగుతుండడంతో తండ్రి రామకృష్ణారెడ్డి బలవంతంగా ఆయనను దుబ్బాకలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చేర్పించారు. 1981లో ఇంటర్‌లో చేరిన ఆయన.. ప్రగతిశీల విప్లవభావాలతో పీడీఎస్‌యూలో చేరారు. అదే సమయంలో దుబ్బాక జూనియర్‌ కళాశాలలో రాడికల్‌ విద్యార్థి సంఘం పురుడుపోసుకోవడంతో అందులో రామలింగారెడ్డి చేరి ఉద్యమ ప్రస్థానం మొదలుపెట్టారు.

కళాశాల విద్యార్థి సంఘం ఎన్నికల్లో వైస్‌ప్రెసిడెంట్‌గా గెలిచారు. అప్పటి పీపుల్స్‌వార్‌ అగ్రనేత శాఖమూరి అప్పారావుతో ఏర్పడిన పరిచయం రామలింగారెడ్డిని పూర్తిస్థాయి విప్లవకారుడిగా మార్చింది. ఆర్‌ఎస్‌యూ ఉమ్మడి మెదక్‌ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి ఆర్‌ఎస్‌యూను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థుల్ని ఉద్యమంలో చేర్చడంలో ముఖ్యపాత్ర పోషించారు. పోలీసు నిర్బంధం పెరగడంతో కొంతకాలం అజ్ఞాతంలో ఉన్నారు. తర్వాత కుటుంబసభ్యుల ఒత్తిడితో బయటకు వచ్చారు. 1985లో జర్నలిస్టుగా ప్రస్థానం మొదలుపెట్టారు. మొదట్లో ఆంధ్రజ్యోతిలో, ఆ తరువాత ‘ఉదయం’లో దుబ్బాక విలేకరిగా పనిచేశారు. అనంతరం ‘వార్త’పత్రిక తరఫున దుబ్బాక, జహీరాబాద్, సిద్దిపేటలో పనిచేశారు. జర్నలిస్టుగా పలు సంచలన కథనాలతో పేరు తెచ్చుకున్నారు. జర్నలిస్టు సంఘం జిల్లా అధ్యక్షుడిగానూ పనిచేశారు. 

మొదటి టాడా కేసు రామలింగారెడ్డిపైనే.. 
జర్నలిస్టుగా పనిచేస్తున్న సమయంలో పోలీసులకు వ్యతిరేకంగా కొన్ని కథనాలు రాసిన ఆయనపై 1989లో రాష్ట్రంలోనే మొదటి టాడా కేసు నమోదైంది. పోలీసులు ఆయనను జైలులో పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఎగశాయి. ఆయనపై పెట్టి న కేసులో సరైన ఆధారాల్లేవంటూ కోర్టు కొట్టివేసింది. జర్నలిస్టుగా ఉన్న సమయంలో కూడా పీపుల్స్‌వార్‌ గ్రూపులో కేంద్ర, రాష్ట్ర కమిటీ ముఖ్య నేతలతో సంబంధాలు కొనసాగించడంతో చాలాకాలం ఆయనపై పోలీసుల నిర్బంధం కొనసాగింది.

కేసీఆర్‌ వెన్నంటి ఉంటూ.. 
2001లో మలిదశ తెలంగాణ ఉద్యమంలో రామలింగారెడ్డిది కీలకపాత్ర. కేసీఆర్‌ 2001లో టీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించినప్పటి నుంచి ఆయన జర్నలిస్టుగా ఉంటూనే పలు కథనాలు రాసి ఉద్యమ బలోపేతానికి కృషి చేశారు. కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేసే క్రమంలో టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లినపుడు రామలింగారెడ్డి వెన్నంటి ఉండి ఆయన గెలుపులో ముఖ్యపాత్ర పోషించారు. అప్పటి నుంచి రామలింగారెడ్డి కేసీఆర్‌కు నమ్మినబంటుగా మారారు. ఈ క్రమంలో కేసీఆర్‌ రామలింగారెడ్డిని పిలిచి 2004లో టీఆర్‌ఎస్‌ తరపున దొమ్మాట నియోజకవర్గం టికెట్‌ ఇచ్చా రు. ఆ ఎన్నికల్లో రామలింగారెడ్డి గెలవడం ద్వారా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది. 2008 ఉప ఎన్నికల్లో మళ్లీ గెలిచిన ఆయన 2009లో ఓటమిపాలయ్యారు. మళ్లీ 2014, 2018 ఎన్నికల్లో గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమం లో భాగంగా రామలింగారెడ్డిపై 30కిపైగా పోలీస్‌ కే సులు నమోదయ్యాయి. రామలింగారెడ్డి జీవితకాలమంతా కుటుంబం కంటే ఎక్కువగా ఉద్యమాలు, పేదలకు సేవచేయడంలో గడిచిపోయింది. 

పేరు: సోలిపేట రామలింగారెడ్డి 
తల్లిదండ్రులు: మాణిక్యమ్మ, రామకృష్ణారెడ్డి 
పుట్టిన ఊరు: చిట్టాపూర్‌ దుబ్బాక 
మండలం, సిద్దిపేట జిల్లా
పుట్టిన తేదీ: 1962, అక్టోబర్‌ 2 
భార్య: సుజాత 
సంతానం: సతీష్‌రెడ్డి, ఉదయశ్రీ 
జర్నలిస్టుగా: రెండు దశాబ్దాలపాటు వివిధ పత్రికల్లో పనిచేశారు 
ఎమ్మెల్యేగా విజయం: 2004, 2008, 2014, 2018 (దొమ్మాట/దుబ్బాక)  

మరిన్ని వార్తలు