HYD: రోబో సాయంతో గుండె ఆపరేషన్‌.. ఇదే దీని ప్రత్యేకత

7 Apr, 2023 16:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో వైద్య రోబో అనుసంధానంతో ఓ రోగికి గుండె ఆపరేషన్‌ జరిగింది. గచ్చి»ౌలిలోని కాంటినెంటల్‌ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా ఈ ఆపరేషన్‌ నిర్వహించి చరిత్ర సృష్టించారు. సాధారణ గుండె ఆపరేషన్లకు భిన్నంగా అత్యాధునిక రోబో అనుసంధానంతో గుండె ఆపరేషన్‌ చేయడం ఓ ముందడుగు.

గతంలో రెండుసార్లు యాంజియోప్లాస్టీ చేయించుకున్న ఓ 36 ఏళ్ల రోగికి కాంటినెంటల్‌ ఆసుపత్రి కార్డియో థొరాసిక్, వాస్క్యులర్‌ సర్జన్‌ డాక్టర్‌ ప్రదీప్‌ రాచకొండ నేతృత్వంలోని శస్త్రచికిత్స బృందం ప్రపంచ ప్రఖ్యాత రొబోటిక్‌ సీటీవీఎస్‌ సర్జన్, ఎస్‌ఎస్‌ ఇన్నొవేషన్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ సు«దీర్‌ శ్రీవాస్తవ ఆధ్వర్యంలో ఎస్‌ఎస్‌ఐ మంత్ర రోబో అనుసంధానంతో విజయవంతంగా ఆపరేషన్‌ నిర్వహించింది. ఈ విషయాన్ని కాంటినెంటల్‌ ఆసుపత్రుల చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ గురు ఎన్‌.రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ శస్త్రచికిత్సను వైద్యశాస్త్రంలో ఒక ముందడుగుగా అభివర్ణించారు. రోగికి అతితక్కువ బాధ, తక్కువ ఇబ్బందితోనే ఆపరేషన్‌ నిర్వహించగలగడం ఈ విధానం ప్రత్యేకత అని వివరించారు. అతితక్కువ సమయంలోనే రోగి తిరిగి సాధారణ స్థాయికి చేరుకోవడం విశేషమని తెలిపారు. ఈ విజయం దేశ ప్రతిష్టతను పెంపొందించడమేగాక యావత్‌ దేశానికి స్ఫూర్తిదా యకంగా, తెలంగాణకు గర్వకారణంగా వెలుగొందుతోందన్నారు.

మరిన్ని వార్తలు