రైతుల ఆశలకు ‘గండి’.. సాగర్‌ ఎడమకాల్వ తెగడంతో పంటలకు తీవ్ర నష్టం

9 Sep, 2022 01:50 IST|Sakshi
నిడమనూరు సమీపంలోని వేంపాడు వద్ద తెగిన నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ, నిడమనూరు మండలం నర్సింహులుగూడెం వద్ద నీటమునిగిన పొలాలు

750 ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా 

కాలువను పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక బృందం 

మరమ్మతులు షురూ.. వారం పాటు సాగునీరు బంద్‌ 

నిడమనూరు: నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ కట్టకు నల్లగొండ జిల్లా నిడమనూరు సమీపంలో బుధవారం పడిన గండి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వరద ఆ ప్రాంతంలోని పొలాలను ముంచెత్తింది. సమీప వరి పొలాల్లో ఇసుక మేట వేసింది. ఆధునీకరణ సమయంలో కాలువ అడుగు భాగంలో కొత్తగా నిర్మాణం చేపట్టకపోవడంతోనే కాలువకు గండి పడిందని రైతులు ఆరోపిస్తున్నారు.

మరోవైపు నీళ్లు సుడి తిరగడం కారణంగానే గండి పడిందని సాగర్‌ ప్రాజెక్టు ఎస్‌ఈ ధర్మా పేర్కొన్నారు. గండి పడటంతో సుమారు 750 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. నిడమనూరులోని కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారి మీదుగా వరద నీరు ప్రవహించడంతో రోడ్డు దెబ్బతిన్నది.

ఈ రహదారిని ఇంకా అధికారికంగా ప్రారంభించలేదు. సాగర్‌ ఎడమ కాల్వ తెగడంతో ప్రభుత్వానికి రూ.2 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, మరో వారం పది రోజులపాటు సాగునీటి విడుదల నిలిచిపోతుండటంతో మిగతా వరి పంటలకు నష్టం వాటిల్లే అవకాశముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

వారంలో శాశ్వత మరమ్మతులు... 
కాలువ కట్ట తెగిన ప్రాంతాన్ని గురువారం రాష్ట్ర అధికారులు, ప్రత్యేక ఇంజనీర్ల బృందం పరిశీలించింది. ఇందులో సీఎం ఓఎస్‌డీ శ్రీధర్‌ దేశ్‌ముఖ్‌పాండే, చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీదేవి అరవింద్‌తో పాటు సాగర్‌ ప్రాజెక్ట్‌ సీఈ శ్రీకాంత్‌రావు, ఎస్‌ఈ ధర్మా, సబ్‌ కలెక్టర్‌ రాహుల్‌ ఉన్నారు. వారంలో శాశ్వత మరమ్మతులు చేపడతామని శ్రీకాంత్‌రావు తెలిపారు. సాయంత్రం గండి పూడ్చే పనులు ప్రారంభించారు. కాగా, ఎమ్మెల్యే నోముల భగత్‌ కూడా గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. గతంలో జరిగిన ఆధునీకరణ పనుల్లో నాణ్యత లోపం కారణంగానే కాలువలు దెబ్బతిన్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.  

మరిన్ని వార్తలు