తగ్గిన పప్పు ధాన్యాల సాగు 

30 Sep, 2023 03:33 IST|Sakshi

58.46 శాతానికే పరిమితం

వానాకాలం సీజన్లో కేవలం వరి మాత్రమే పెరిగింది 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్‌లో పప్పుధాన్యాల సాగు గణనీయంగా తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. నేటి(శనివారం)తో వానాకాలం సీజన్‌ ముగియనుంది. ఆదివారం నుంచి యాసంగి సీజన్‌ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ ఒక నివేదిక విడుదల చేసింది. వానాకాలం సీజన్‌లో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాలు కాగా, గతేడాది ఇదే సీజన్‌లో 1.32 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి.

ఈ ఏడాది మాత్రం 1.26 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో అత్యధికంగా వరి సాగు విస్తీర్ణం ఆల్‌ టైం రికార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వరి సాధారణ సాగు విస్తీర్ణం 49.86 లక్షల ఎకరాలు కాగా, ఏకంగా 65 లక్షల ఎకరాల్లో (130.37 శాతం) సాగైంది. ఇక సోయాబీన్‌ సాధారణ సాగు విస్తీర్ణం 4.13 లక్షల ఎకరాలు కాగా, 4.67 లక్షల (113%) విస్తీర్ణంలో సాగైంది. 

వరి మినహా పెరగని ప్రధాన పంటల విస్తీర్ణం 
వరి, సోయాబీన్‌ మినహా ఇతర ముఖ్యమైన పంటల విస్తీర్ణం పెరగలేదు. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.59 లక్షల ఎకరాలు కాగా, 44.77 లక్షల (88.51 శాతం) విస్తీర్ణంలోనే సాగైంది. ఇక పప్పు ధాన్యాల సాగు మాత్రం గణనీయంగా తగ్గిందని నివేదిక వెల్లడించింది.

పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం ఈ వానాకాలం సీజన్‌లో 9.43 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 5.51 లక్షల ఎకరాల్లోనే సాగైంది. అంటే 58.46 శాతానికే పరిమితమైంది. అందులో కంది సాధారణ సాగు విస్తీర్ణం 7.69 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.74 లక్షల (61.62 శాతం) ఎకరాల్లోనే సాగైంది. 

జొన్న సాధారణ సాగు విస్తీర్ణం 81,389 ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 31,107 ఎకరాల్లో (38.22 శాతం) సాగైంది. రాగులు దాని సాధారణ సాగు విస్తీర్ణంలో కేవలం 19.70 శాతం, కొర్రలు, సామలు, కోడో వంటి మిల్లెట్ల సాగు 16.15 శాతానికే పరిమితమైంది. 

మరిన్ని వార్తలు