సైబరాబాద్‌: ఖాకీలపై మూడో కన్ను

8 Jul, 2022 09:56 IST|Sakshi

సాక్షిహైదరాబాద్‌: సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని పోలీసుల పనితీరుపై కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర ప్రత్యేక దృష్టి సారించారు. దీర్ఘకాలికంగా ఒకే చోట పోస్టింగ్‌లో ఉన్న ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్ల (ఎస్‌ఐ)లను బదిలీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే, అక్రమాలకు పాల్పడే పోలీసులను ఏమాత్రం ఉపేక్షించేదిలేదని స్పష్టంచేస్తున్నారు. అంతర్గత విచారణ జరిపించి, ఆరోపణలు నిజమని తేలితే వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారు. సీపీగా స్టీఫెన్‌ బాధ్యతలు చేపట్టిన అనంతరం.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒకేసారి 126 మంది ఎస్‌ఐలను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 19 మంది మహిళా ఎస్‌ఐలు కూడా ఉన్నారు. 

రెండేళ్లు పైబడితే బదిలీ.. 
సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో మాదాపూర్, శంషాబాద్, బాలానగర్‌ జోన్లలో మొత్తం 36 శాంతి భద్రతల ఠాణాలున్నాయి. ఒకే పీఎస్‌లో రెండేళ్లకు మించి పోస్టింగ్‌లో ఉన్న ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలను బదిలీ చేసేందుకు ఉన్నతాధికారులు నిర్ణయించారు. త్వరలోనే పోలీసు అధికారుల పనితీరు, సమర్థతను బట్టి పోస్టింగ్స్‌ ఇవ్వనున్నట్లు తెలిసింది.  

తాజాగా శంషాబాద్‌ జోన్, మాదాపూర్‌ జోన్ల నుంచి ఒక్కొక్కరు, బాలానగర్‌ జోన్‌లో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. పేట్‌బషీరాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌ రమేష్‌ను బదిలీ చేసి, ఆయన స్థానంలో వెయిటింగ్‌లో ఉన్న ప్రశాంత్‌ను, జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న బాలరాజు స్థానంలో సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ పవన్‌లను బదిలీ చేశారు.  

గచ్చిబౌలి మహిళా పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ బాలకృష్ణను బదిలీ చేసి, ఆయన స్థానంలో షీ టీమ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సునీత, రాజేంద్రనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ కనకయ్యను సీసీఎస్‌కు బదిలీ చేసి, ఆయన స్థానంలో ఏసీబీ నాగేంద్రబాబును నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 

ఎస్‌బీ నివేదికల ఆధారంగా.. 
పోలీసుల పనితీరుపై స్పెషల్‌ బ్రాంచ్‌ (ఎస్‌బీ) నిఘా పెట్టింది. క్షేత్రస్థాయిలో వారి పనితీరు, అక్రమాలపై  కూపీలాగుతూ సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేస్తున్నారు. ఎస్‌బీ అధికారులకు ఇచ్చే నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు రుజువైన పోలీసులపై చర్యలతో పాటు భవిష్యత్తులో వారికి పదోన్నతి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం గతంలో నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో పనిచేసిన ముగ్గురు ఎస్‌ఐలను కమిషనరేట్‌ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ ఆకస్మికంగా బదిలీ చేశారు. 

గతంలో నార్సింగి ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన గంగాధర్‌ స్థానికంగా భూ లావాదేవీలలో తలదూర్చి అక్రమార్కులకు వంత పాడిన ఆరోపణల నేపథ్యంలో గంగాధర్‌తో పాటు ఎస్‌ఐ లక్ష్మణ్‌లను సస్పెండ్‌ చేశారు. ఈ వ్యవహారంలో రాములు (ప్రస్తుతం రాజేందర్‌ పీఎస్‌) బలరాం నాయక్‌ (నార్సింగి పోలీస్‌ స్టేషన్‌), అన్వేష్‌ రెడ్డి (ప్రస్తుతం సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌)లు సహకరించారని, అంతర్గత విచారణలో నిజమని తేలడంతో రెండేళ్ల తర్వాత వారిపై వేటు వేసినట్లు విశ్వసనీయ సమాచారం.    

మరిన్ని వార్తలు