Telangana: రాష్ట్రంలో ‘డెల్టా’ కేసులే ఎక్కువ..!

12 Aug, 2021 03:06 IST|Sakshi

జూలైలో 95 శాతం కరోనా కేసులు ఆ రకానివే.. 

14 జిల్లాల్లో నూటికి నూరు శాతం డెల్టా కేసులే 

కరోనా కేసులను జీనోమ్‌  సీక్వెన్సింగ్‌ చేసిన శాస్త్రవేత్తలు 

ఏప్రిల్‌లో 33%, మేలో 84%, జూన్‌లో 86%  

రోజురోజుకూ పెద్దఎత్తున విస్తరిస్తున్న డెల్టా రకం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా డెల్టా వేరియంట్‌ రకానివే ఉన్నట్లు తేలింది. క్రమంగా ఈ వేరియంటే స్థిరపడిపోతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వేరియంట్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల్లో రోజురోజుకూ డెల్టా వేరియంట్‌ కేసులు పెరుగుతున్నట్లు నిర్ధారణ అయింది. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నమోదైన కేసుల శాంపిళ్లను శాస్త్రవేత్తలు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేశారు. ఆ వివరాలు తాజాగా గ్లోబల్‌ ఇన్షియేటివ్‌ ఆన్‌ షేరింగ్‌ ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా డేటా (జీఐఎస్‌ఏఐడీ)లో పొందుపరిచారు.

అన్ని దేశాల జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ డేటాను ఇందులోనే అధికారికంగా పొందుపరుస్తారు. ఇందులో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో డెల్టా వేరియంట్‌ ఏ స్థాయిలో ఉందో ప్రస్తావించడం గమనార్హం. జూలైలో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల్లో 95 శాతం డెల్టా వేరియంట్‌వేనని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో జగిత్యాల, జనగాం, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్, ములుగు, నాగర్‌కర్నూలు, నల్లగొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిరిసిల్ల, వికారాబాద్, వనపర్తి, వరంగల్‌ వంటి 14 జిల్లాల్లో నమోదైన కేసులన్నీ డెల్టా వేరియంట్‌వేనని నిర్ధారించారు. హైదరాబాద్‌లో నమోదైన వాటిల్లో 94 శాతం, గద్వాల జిల్లాలో 93%, సూర్యాపేట జిల్లాలో 86% కేసులు డెల్టా రకానివని కనుగొన్నారు. 

నెలనెలా పెరుగుతున్న తీవ్రత 
ఏప్రిల్‌ నుంచి రాష్ట్రంలో సెకండ్‌ వేవ్‌ తీవ్రత పెరిగిన విషయం విదితమే. డెల్టా వేరియంట్‌ రకం వైరస్‌ సోకిన రోగులకు తీవ్ర లక్షణాలు కనిపించాయి. దీంతో వారికి రెమిడెసివిర్, స్టెరాయిడ్స్‌ ఎక్కించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సమయంలోనే మరణాలు కూడా అధికంగా నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 33 శాతం డెల్టా రకానివి ఉండగా, అవి మే నెలలో ఏకంగా 84 శాతానికి పెరిగాయి. జూన్‌లో 86 శాతానికి చేరగా, జూలైలో అదికాస్తా 95 శాతానికి చేరడం గమనార్హం. ఆగస్టులో ఇంకా పెరగవచ్చని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం రాష్ట్రంలో డెల్టా ప్లస్‌ కేసులు రెండు నమోదయ్యాయి. డెల్టా రకంతో పోలిస్తే ఇది ప్రమాదకరమా కాదా అన్నదానిపై స్పష్టత లేదు. మహారాష్ట్ర, కేరళలో డెల్టా ప్లస్‌ కేసులు పెరుగుతున్నాయి. మున్ముందు ఇది మరింత విస్తరించే ప్రమాదముందని హెచ్చరికలు వస్తున్నాయి. థర్డ్‌వేవ్‌లో ఏ రకం వైరస్‌ విజృంభిస్తుందో ఇంకా స్పష్టత రావడం లేదని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.  

టీకానే పరిష్కారం: డాక్టర్‌ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకుడు 
కరోనాకు సంబంధించి ఎలాంటి వేరియంట్‌ వచ్చినా జాగ్రత్తలతోనే తిప్పికొట్టాలి. మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడం, చేతులను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసుకోవడంతోనే వైరస్‌ను ఎదుర్కోవచ్చు. వీటితోపాటు వ్యాక్సిన్‌ వేసుకుంటేనే అన్ని రకాల వైరస్‌లకు చెక్‌ పెట్టొచ్చు. కాబట్టి ప్రజలు టీకా వేయించుకునేందుకు ముందుకురావాలి. రాష్ట్రంలో 12 లక్షల టీకాలు అందుబాటులో ఉన్నాయి. రెండ్రోజులకోసారి రెండు లక్షల టీకా డోసులను కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది. కాబట్టి టీకాకు ఎక్కడా కొరతలేదు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు