గ్రేటర్‌లో తీరొక్క దసరా

25 Oct, 2020 07:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విజయ దశమి... చెడుపై విజయం సాధించినందుకు చిహ్నంగా జరుపుకుంటాం. ఆశ్వయుజ మాసంలో పాడ్యమి నుంచి దశమి వరకు తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. రోజుకొక ప్రత్యేక అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. సృష్టి, స్థితి, లయ అనే మూడు ధర్మాలు ప్రారంభమైన కాలంగా నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటారని ప్రతీతి. తొమ్మిదికి చాలా ప్రాధాన్యత ఉంది. మానవ దేహంలో రంధ్రాలు తొమ్మిది... సప్తశతిలో అమ్మవారు సంహరించిన రాక్షసుల సంఖ్య తొమ్మిది... నవధాన్యాలు తొమ్మిది...అలా నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నారని శాస్త్రం చెబుతోంది. అయితే నవరాత్రి ఉత్సవాలను ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన సంప్రదాయ రీతిలో నిర్వహిస్తారు. సకల సంస్కృతుల సమ్మేళనంగా నిలుస్తోన్న భాగ్యనగరంలో ఆయా ప్రాంతవాసుల పండుగ శైలి విభిన్న శైలిలో కనిపిస్తోంది. ఆ సంస్కృతుల సమాహారం మీ కోసం.

గుజరాత్‌: ప్రత్యేక పూజలు.. దాండియా...
దేవీ శరన్నవరాత్రి రోజుల్లో ప్రతి మూడు రోజులకు గుజరాతీలు దేవీ రూపాన్ని ఆరాధిస్తాం. మహిషాసురుడిని వధించినందుకు మొదటి మూడు రోజులూ దుర్గాదేవి రూపంలో, ఐశ్వర్యానికి ప్రతీకగా లక్ష్మిదేవిని మరో మూడు రోజులు, తదుపరి మూడు రోజులు విద్యామాత అయిన సరస్వతీదేవిని పూజిస్తాం. గుజరాతీలు అంబికాదేవిగా అమ్మవారిని పిలుస్తారు. ’దాండియా నృత్యం దసరా వేడుకలకు సరికొత్త ఆకర్షణ. దసరా తొమ్మిది రోజుల్లో మా రాష్ట్రంలోని ప్రతి పల్లె ఈ దాండియా నృత్యాలతో సందడిగా ఉంటుంది. హైదరాబాద్‌లో ఉండే గుజరాతీయులు కూడా అసోసియషన్‌లుగా ఏర్పడి దాండియా నృత్యాలు చేసి   సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాన్స్‌ ఫెస్టివల్‌ దాండియా నవరాత్రి ఉత్సవాల సమయంలోనే జరుగుతుంది. మా రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారు ‘రస’ అనే ప్రత్యేక నృత్యం చేస్తారు. శ్రీకృష్ణుని జీవిత ఘట్టాల ఆధారంగా ఈ నృత్యం సాగుతోంది. దసరా రోజుల్లో శక్తి పీఠాలైన అంబాజీ, పవాగడ్, బహుచర్‌రాజీ క్షేత్రాలతో పాటు కుచ్‌లో ఉన్న ఆషాపురమాత, భావ్‌నగర్‌లో గల కొడియార్‌ మందిర్, చోటిలాలో ఉన్న చాముండి మాత మందిరాలు భక్తులతో కళకళలాడతాయి. –  సురేష్‌భాయ్‌ తన్నా, సికింద్రాబాద్

కేరళ: పంచవాద్యం ప్రత్యేకం  
దేవీ శరన్నవరాత్రులుఅందరికీ శుభం చేకూర్చే రోజులుగా దేవీ నవరాత్రులను కేరళలో భావిస్తాం. అందుకే విద్యార్థులకు చదువు బాగా రావాలని పుస్తకాలను, కులవృత్తులు చేసేవారు తమ యంత్రాలను దశమి రోజుకు మూడు రోజుల ముందు నుంచే పూజలో ఉంచుతాం. ప్రతి దసరా సమయంలో బొమ్మల కొలువు ఉంటుంది. కేరళలో కొలువుదీరిన దేవతామూర్తులు, ఆలయాల నిర్మాణశైలితో కూడిన బొమ్మలను కొలుస్తారు. దసరా ఉత్సవాల్లో పంచవాద్యం హైలెట్‌గా ఉంటుంది. ముఖ్యమైన ఆలయాల్లో అంబారీతో పంచావాద్యం, సింగేరి మేళా నడుమ నవరాత్రుల పాటు ప్రతిరోజూ లక్ష్మీదేవికి పూజలు చేస్తాం. – అరుణ్‌గురుస్వామి, అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం ప్రధాన కార్యదర్శి, సనత్‌నగర్‌

పంజాబ్‌: తొమ్మిది రకాల పండ్లతో పూజలు 
దేవీ శరన్నవరాత్రి సమయంలో సిక్కులు బుట్టలో ఎర్రమట్టి  (పుట్టమన్ను) వేస్తారు. 12 గంటల ముందు నానబెట్టిన గోధుమలను మట్టిలో వేస్తారు. అనంతరం తొమ్మిది రకాల పండ్లు, పూలతో పూజిస్తాం. చండీకాపాన్‌ను తొమ్మిది రోజుల పాటు పఠిస్తారు. విజయదశమి రోజున నగర కీర్తన జరుగుతుంది. ప్రతియేటా గౌలిగూడలోని గురుద్వారా నుంచి అత్తాపూర్‌ గురుద్వారా  వరకు నగర కీర్తన్‌ కొనసాగుతోంది. తిరిగి మళ్లీ కాలిడనక గౌలిగూడకు చేరుకుంటుంది. నగర కీర్తన్‌ కొనసాగుతున్నంతవరకు కత్తి విన్యాసాలు చేసి అబ్బురపరుస్తారు. ఈ తంతు పూర్తయిన తరువాత గౌలిగూడ గురుద్వారా లంగర్‌ (అన్నదానం) నిర్వహిస్తారు. తాత ముత్తాతలు నుంచి ఉపయోగించిన కత్తులను తొమ్మిది రోజుల పాటు పూజిస్తారు. దసరా రోజు గురుద్వారాకు తీసుకుని ప్రత్యేక పూజలు జరుపుతారు. – మంజోత్‌కౌర్, అమీర్‌పేట  

అస్సాం: మాతా పూజ ప్రత్యేకం.. 
మాకు దుర్గా మాత పూజ ఎంతో ప్రత్యేకం. మిఠాయిలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించి వాటినే ప్రసాదంగా పంచుకుంటాం.  ఉదయం 8 గంటలకే పూజను పూర్తి చేస్తాం. ఆ సాయంత్రం గ్రామ కూడలిలో గానా బజానాతో వేడుక చేసుకోవడం ఆనవాయితీ.  వేడుకల్లో కుటుంబసభ్యులమంతా పాల్గొంటాం. – సీమ్కథర్, ఖైరతాబాద్‌.

రాజస్థాన్‌: రోజుకోసారే నీళ్లు
దేవీశరన్నవరాత్రి రోజులను అత్యంత నిష్టగా పాటిస్తాం. తొమ్మిది రోజుల పాటు రోజుకొకసారి మంచినీళ్లు తాగి అఖండ ఉపవాస దీక్షలు కొనసాగిస్తాం. ప్రతిరోజూ అమ్మవారికి పూజలు చేస్తాం. తొమ్మిది రోజుల పాటు పాదరక్షలు కూడా ధరించం. దశమి రోజున రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు వేషాధారణలు వేయించి బాణంతో రావణసురుడి వధ (దహనం) కార్యక్రమంతో నవరాత్రి ఉత్సవాలను ముగిస్తాం. ఇక్కడ బతుకమ్మ వేడుకలు ఎలాగో మేము గర్బా నృత్యం చేస్తుంటాం.  
– గులాబ్‌సింగ్‌ రాజ్‌పురోహిత్,రాజస్థానీ మండల్‌ ప్రతినిధి, అమీర్‌పేట 

వాహనాలకు పూజలు చేస్తాం
అబిడ్స్‌: దసరా వేడుకల్లో త్రిజోడీలు, వాహనాలకు పూజలు చేస్తాం. డబ్బు నిల్వ ఉంచే త్రిజోడీలకు ముందుగా పూజలు నిర్వహిస్తాం. వాహనాలు, ట్యాక్సీలకు పూజలు నిర్వహిస్తాం. ఇంట్లో ప్రత్యేకంగా మిఠాయిలు తయారు చేసి పంచిపెడతాం. కాచిగూడలోని షామందీర్‌ ఆలయానికి వెళ్లి జమ్మిపూజలు నిర్వహిస్తాం. – గోవింద్‌రాఠి,మార్వాడి సమాజ్‌ నాయకుడు 

కర్ణాటక: ఆటలు.. పాటలు.. 
దసరా వచ్చిందంటే కర్ణాటకలో ఇళ్లు శోభయామానంగా వెలుగొందుతాయి. అక్కడి ప్రభుత్వం పది రోజులు సంగీత, నృత్య ప్రదర్శనలు, బొమ్మల కొలువులతో పాటు మల్లయుద్ధం, ఇతర ఆటల పోటీలు నిర్వహిస్తుంది.  దసరా పండుగను పురస్కరించకుని ఫుడ్, ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ జరుగుతాయి.మైసూర్‌లోని వివిధ దేవాలయాలలో పూజలు జరుగుతాయి.  చాముండిహిల్స్‌పై నిర్మించిన చాముంండేశ్వరి ఆలయంలో దసరా సమయంలో  కిక్కిరిస్తోంది. – దుల్లప మిత్రే, రెజిమెంటల్‌ బజార్‌ 

ఒక్కో సంవత్సరం ఒక్కో గ్రామంలో పూజలు చేస్తాం 
కంటోన్మెంట్‌: తమిళనాడులో దసరాకు ఒకరోజు ముందునుంచే ఉత్సవాలు ఆరంభమవుతాయి. నగరంలో మూడు లక్షల మంది తమిళులు ఉండగా, కేవలం కంటోన్మెంట్‌ పరిసర ప్రాంతాల్లోనే లక్ష మంది వరకు ఉంటారు.  చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా కలిసి ఒక్కో సంవత్సరం ఒక్కో గ్రామంలో ఉత్సవం చేస్తాం.  దసరాకు ఒక్కరోజు ముందే ఆ గ్రామంలోని గ్రామదేవత ఆలయంలో పూజలు నిర్వహించి రథాల ఊరేగింపు చేపడతాం. రథాల ఊరేగింపు అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన జమ్మిచెట్టుకు పూజ చేసి ఆ ఆకును ఇళ్లకు తీసుకెళతాం. ఈ ఆకును బంగారులా భావించి తోటివారితో పంచుకుంటాం. నవరాత్రుల సందర్భంగా పూజలు, బొమ్మల కొలువు  చేస్తాం. గత ఏడాది అమ్ముగూడలో ఉత్సవాలు చేశామం. పండుగ రోజున రామాలయంతో పాటు కరమరి, తులకాంతమ్మ, మథర్‌వీరన్‌ ఆలయాల్లో పూజలు చేస్తాం. – మహదేవన్,ఆలిండియా అరవమాల సంఘం అధ్యక్షుడు.  

ప్రత్యేక మట్టితో అమ్మవారి విగ్రహాన్ని తయారుచేస్తాం 
ఒడిస్సాలో దసరా ఉత్సవాల కోసం ప్రత్యేకంగా మట్టిని తీసుకొచ్చి దుర్గామాత విగ్రహాన్ని తయారు చేస్తాం. మండపాలను రూ. కోటి అయినా వెచ్చించి అత్యంత ఆకర్షణీయంగా అలంకరిస్తాం. అమ్మవారికి చావల్, సబ్జీ,దాల్‌ ప్రసాదంగా వండి పెడతాం. రోజూ వేదిక వద్ద డ్యాన్స్‌లు, దాండియా, ఆటాపాటా జాతరలా ఉంటుంది. – గధాధర్‌దాల్, ఒడిస్సా 

ప్రాంతాలు వేరైనా కలిసికట్టుగా...

చార్మినార్‌:  ప్రాంతాలు వేరైనా.. ఉత్సవాలను మాత్రం కలసి కట్టుగా నిర్వహించుకోవడం నిజాం కాలం నుంచి వస్తోంది. నగరంలో దసరా వేడుకలు విభిన్నంగా జరుగుతాయి.   

  • నగరంలో స్థిరపడిన రాజస్థాన్, గుజరాత్, హర్యాన, హిమాచల్‌ ప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన ఉత్తర భారతీయులైన అగర్వాల్‌ కుటుంబీకులు, మరాఠిలు, కర్ణాటక రాష్ట్రానికి చెందిన కన్నడీగులు,పశ్చిమబెంగాళ్‌కు చెందిన బెంగాలీలు తమ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహరాలకు అనుగుణంగా దసరా ఉత్సవాలను  నిర్వహిస్తున్నారు.  
  • నగరంలోని జియాగూడ, అత్తాపూర్,సికింద్రాబాద్, గుల్జార్‌హౌజ్, మామాజుమ్లాపాటక్, చార్‌కమాన్, కోకర్‌వాడీ, చెలాపురా, ఘాన్సీబజార్, జూలా,కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌ తదితర ప్రాంతాల కన్నడిగులు దసరా వేడుకల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు. 
  • నగరంలో స్థిరపడ్డ పశ్చిమబెంగాళ్‌కు చెందిన బెంగాలీలు దసరా ఉత్సవాలను ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. బెంగాలీలకు దసరా పెద్ద పండుగ.
  • దుర్గామాతను ప్రతిష్టించిన నాటి నుంచి నాలుగు రోజుల వరకు ప్రత్యేక పూజలు నిర్వహించిన బెంగాలీలు ఆదివారం విజయ దశమి రోజు నిమజ్జనం చేయనున్నారు.  
  • వాస్తవానికి కలకత్తాలో దుర్గామాత విగ్రహాం వద్ద మేకలను బలిస్తామని... ఇక్కడ మాత్రం తొమ్మిది రకాల వేర్వేరు ఫలాలను దుర్గామాత వద్ద బలిస్తామని నిర్వాహకులు  తెలిపారు. 
  • ఉత్తర భారతీయులైన అగర్వాల్‌ కుటుంబీకులు దసరా ఉత్సవాలను రోజంతా ఉపవాసంతో నిర్వహిస్తారు.   

నిరాడంబరంగా దసరా వేడుకలు... 
ఈసారి దసరా వేడుకలను నిరాడంబరంగా జరుపుకుంటున్నాం. వర్షం, వరదలు, కరోనా...ఇలా తమను దసరా వేడుకలకు కొద్దిగా దూరం చేసాయి. అయినప్పటికీ... తొమ్మిది రోజుల పాటు ఉపవాసం ఉన్న తామంతా ఆదివారం విజయ దశమి పండుగ నిర్వహించడానికి సిద్దమయ్యాం.  – నాగ్‌నాథ్‌ మాశెట్టి, కోకర్‌వాడి  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు