ఎలక్ట్రానిక్స్‌ వస్తువుల ధరలకు రెక్కలు 

2 Feb, 2021 11:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో స్మార్ట్‌ ఫోన్ల దిగుమతి సుంకాన్ని 2.5 శాతం పెంచింది.  విడిభాగాల పరికరాలకు కస్టమ్స్‌ డ్యూటీని 10 నుంచి 15 శాతానికి పెంచడంతో వీటి ధరలు పెరుగుతాయని నగర సెల్‌ఫోన్‌ దుకాణ నిర్వాహకులు అంటున్నారు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ల ధరలు మాత్రం ఏప్రిల్‌ నుంచి మరింత ప్రియమవుతాయని చెబుతున్నారు.

ఎలక్ట్రానిక్‌ వస్తువులైన రిఫ్రిజ్‌రేటర్, ఎయిర్‌ కండిషన్‌ కంప్రెషర్లలపై ఉన్న కస్టమ్స్‌ డ్యూటీని 12.5 నుంచి 15 శాతానికి పెంచడం కూడా ఆయా వస్తువుల ధరలపై ప్రభావాన్ని స్పష్టంగా చూపెడుతుందని వ్యాపారులు అంటున్నారు. నగరంలో వేలల్లో సెల్‌ఫోన్‌ దుకాణాలతో పాటు వందల్లో ఎలక్ట్రానిక్‌ షోరూమ్‌లు రూ.వందల కోట్లలో వ్యాపారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎలక్ట్రానిక్‌ వస్తువుల ధరల పెంపు మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలపై మరింత భారం కానుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత భారమే.. 
స్మార్ట్‌ఫోన్ల ధరలు మరింత పెరగనున్నాయి. ప్రతి ఒక్కరికీ సమాచార మార్పిడికి ఫోన్లు తప్పనిసరి కావడంతో ధరలు పెరిగినా కొనడం మాత్రం ఆగడంలేదు. అయితే అతి కష్టంమీద సెల్‌ఫోన్‌ కొనుగోలు చేసేవారికి మాత్రం ఈ నిర్ణయం గుదిబండలా మారింది.  – ఎల్‌.నరేష్, ఆర్‌పీ మొబైల్‌ షాప్, వనస్థలిపురం 

తప్పదు వాడకం.. ఎలా కొనడం? 
కరోనా నేపథ్యంలో పాఠశాలలు, కాలేజీలు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తుండడంతో ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ఇన్నాళ్లూ కేవలం తల్లిదండ్రులు మాత్రమే వాడగా.. ఇప్పుడు పిల్లలకు చదువు కోసం కొనివ్వాల్సిన పరిస్థితి వచ్చింది.  మధ్య, పేద తరగతి ప్రజలకు భారమే.   – రితిక, సీబీఐటీ కాలేజీ విద్యార్థిని, గండిపేట 

సామాన్యుడిపై భారమే... 
ఇంట్లో అవసరాల కోసం రిఫ్రిజిరేటర్, వాషింగ్‌ మెషిన్‌లు కొనుగోలు చేసేవారికి భారమే. వచ్చే జీతం ఇంటి అద్దెకు, అవసరాలకు, పిల్లల చదువులకే సరిపోతున్నాయి.  కేంద్రం తాజా బడ్జెట్‌తో ఎలక్ట్రానిక్‌ వస్తువుల ధరలకు రెక్కలు రానుండడంతో సామాన్యుడిపై మరింత భారం పడనుంది.  – పి.శేఖర్, ఎల్‌బీనగర్‌

మరిన్ని వార్తలు