కడుపుకోతల్లో కరీంనగర్‌ టాప్‌

5 Apr, 2022 04:05 IST|Sakshi

ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో 92.8శాతం సిజేరియన్లే 

ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనగామ జిల్లాలో అత్యధికం  

తెలంగాణ జనాభా, ఆరోగ్య స్థితిపై నివేదిక విడుదల చేసిన ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 60.7శాతం ప్రసవాలు సిజేరియన్‌ పద్ధతిలో జరుగుతున్నాయని తెలంగాణ జనాభా, ఆరోగ్య నివేదిక వెల్లడించింది. కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ ప్రచురించిన ఈ రిపోర్టును గణాంకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సోమవారం విడుదల చేశారు. నివేదిక ప్రకారం... సిజేరియన్‌ ప్రసవాలు కుమ్రం భీం జిల్లాలో అత్యంత తక్కువగా 27.2% జరుగుతున్నాయి.

అత్యంత అధికంగా కరీంనగర్‌ జిల్లాలో 82.4% జరుగుతున్నాయి. ఇక ప్రైవేట్‌ ఆసుపత్రు ల్లో 81.5% ప్రసవాలు సిజేరియన్‌ పద్ధతిలో జరుగుతుండగా, అందులో అత్యధికంగా కరీంనగర్‌ జిల్లా లో 92.8% జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల్లో మొత్తం 44.5% మాత్రమే సిజేరియన్‌లుండగా, అత్యధికంగా జనగాంజిల్లాలో 73% సిజేరియన్‌ ప్రసవాలు అవుతున్నాయి.  

నివేదికలోని ముఖ్యాంశాలు... 
15 ఏళ్ల లోపు జనాభా అధికంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉంది. అక్కడి జనాభాలో 27.8% మంది ఆ వయస్సులోపు వారే. ఆ వయస్సువారి తెలంగాణ సరాసరి జనాభా 22.5%.  
రాష్ట్రంలో వెయ్యి మంది పురుషులకు 1,049 మంది స్త్రీలు ఉన్నారు. అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 1,219 మంది ఉండగా, హైదరాబాద్‌లో అత్యంత తక్కువగా 959 మంది ఉన్నారు.  
తెలంగాణలో 95.8 శాతం మంది ఇళ్లల్లో అయోడైజ్డ్‌ ఉప్పు వాడుతున్నారు. అత్యధికంగా కరీంనగర్‌ జిల్లాలో 99.1శాతం మంది వాడుతున్నారు.  
రాష్ట్రంలో 60.8శాతం కుటుంబాలకు ఆరోగ్య బీమా ఉంది. అత్యధికంగా వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 72శాతం మందికి ఉంది.  
రాష్ట్రంలో 15–19ఏళ్ల వయస్సులో తల్లులైనవారు, గర్భిణీలుగా ఉన్నవారు 5.8% ఉండగా, వీరిలో అత్యంత తక్కువగా సిద్దిపేట జిల్లాలో ఒక శాతం ఉన్నారు. అత్యంత ఎక్కువగా జోగులాంబ గద్వాల జిల్లాలో 15.9శాతం ఉన్నారు.  
రాష్ట్రంలోఆసుపత్రుల్లో ప్రసవాలు సరాసరి 97% ఉండగా, వరంగల్‌ రూరల్‌ జిల్లాలో వంద శాతం ప్రసవాలు ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి.  
రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 49.7% జరుగుతుండగా, ఇందులో ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 66.8శాతం ఉన్నాయి.  
రాష్ట్రంలో 15ఏళ్లు పైబడినవారిలో తీవ్రమైన షుగర్‌ వ్యాధితో మందులు వాడుతున్న పురు షులు 18.1శాతం ఉన్నారు. అత్యధికంగా హైదరాబాద్‌లో 26.8 శాతం మంది ఉన్నారు. కాగా, మహిళల్లో 15 ఏళ్లు పైబడిన వారిలో 14.7శాతం ఉండగా, హైదరాబాద్‌లో 21.2శాతం ఉన్నారు.   

మరిన్ని వార్తలు