బతుకమ్మ బంగారం.. విదేశీ పూల సింగారం.. సింగపూర్, స్విట్జర్లాండ్‌ నుంచి..

3 Oct, 2022 09:10 IST|Sakshi

పూల కరువు ఓ వైపు.. భిన్నమైన రకాల పూల కోసం మరోవైపు

హైదరాబాద్‌లో బతుకమ్మల కోసం భారీగా పూల అవసరం

ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వెళ్లి తీసుకువస్తున్న సేకర్తలు

హైదరాబాద్‌: బతుకమ్మ అంటేనే పూల పండుగ. బతుకమ్మ పాటే ‘తీరొక్క పువ్వేసి చందమామో.. ’అంటూ మొదలవుతుంది. తంగేడు, గునుగు పూలతోపాటు రకరకాల పూలనూ బతుకమ్మను రూపొందించేందుకు వాడుతుంటారు. అయితే మారిన వాతావరణ పరిస్థితులు, పట్టణాల విస్తరణ, వ్యవసాయ విస్తీర్ణం పెరగడంతో కొన్నాళ్లుగా బతుకమ్మకు వినియోగించే పూలు తగ్గిపోయాయి. మరోవైపు తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి బతుకమ్మ పండుగ మరింత విస్తృతమైంది. పెద్ద పెద్ద బతుకమ్మలను పేర్చి పూజించేవారు పెరిగారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో బతుకమ్మ పూల కోసం ఇతర జిల్లాలు, రాష్ట్రాలు కూడా దాటుతున్నారు. కొందరైతే విదేశాల నుంచీ రకరకాల పూలను తెప్పించి బతుకమ్మలను రూపొందిస్తున్నారు.

కూకట్‌పల్లి, ఇతర ప్రాంతాల నుంచి..
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లితోపాటు పలు ప్రాంతాల్లో ప్రజలు భారీ బతుకమ్మలను పేర్చి పండుగ జరుపుతుంటారు. కొందరు ఏకంగా పది, ఇరవై అడుగుల మేర బతుకమ్మలనూ రూపొందిస్తుంటారు. ఇందుకోసం వివిధ రకాల పూలను భారీగా తెప్పిస్తుంటారు. మొదట్లో కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్‌ వంటి జిల్లాల నుంచి పూలు తీసుకువచ్చేవారు. ఆ జిల్లాల్లోనూ కొరత ఏర్పడటంతో మహారాష్ట్రలోని బీదర్, నాందేడ్‌ ప్రాంతాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి ముందుగా పూలు తెప్పించుకుంటున్నారు. గత ఏడాది కూకట్‌పల్లిలో 15 అడుగుల ఎత్తున ఏర్పాటు చేసిన లోటస్‌ బతుకమ్మ కోసం జమ్మూ కాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌తోపాటు సింగపూర్, స్విట్జర్లాండ్‌ నుంచి కూడా కొత్త రకాల పూలను తెప్పించారు.  

కూకట్‌పల్లిలో ప్రత్యేకంగా.. 
కూకట్‌పల్లి ప్రాంతంలో సుమారు 50 కుటుంబాలకుపైగా 10 అడుగుల కన్నా ఎత్తున బతుకమ్మలను పేర్చి పూజిస్తుంటాయి. కూకట్‌పల్లికి చెందిన గుండాల నర్సింగరావుకు ఐదుగురూ కుమారులే. ఆ కుమారులకూ తొలుత కొడుకులే పుట్టారు. ఈ క్రమంలో మొదటిసారిగా ఓ కుమారుడికి బిడ్డ పుట్టడంతో వేడుక చేసుకు న్నారు. మనవరాలిపై ప్రేమతో ఆమె వయసుకు అనుగుణంగా బతుకమ్మ ఎత్తును పెంచుకుంటూ వెళ్లారు. అలా 20 అడుగుల వరకు చేరాక ఏటా అంతపెద్ద బతుకమ్మను పేర్చడం, నిమజ్జనానికి తీసుకెళ్లడం కష్టమైంది. దీనితో ఏటా అదే ఎత్తుతో బతుకమ్మను పేర్చి పూజిస్తున్నారు. ఆయన ఐదుగురు కుమారులు అదే సంప్రదాయాన్ని అనుసరిస్తూ.. భారీ బతుక మ్మలను పేర్చుతున్నారు.  కూకట్‌పల్లికే చెందిన అబ్బినేని వజ్రమ్మ కుటుంబం 40 ఏళ్లుగా భారీ బతుకమ్మలను పేరుస్తోంది. తమ ఇంట్లో కష్టాలు తీర్చిన బతుకమ్మను పెద్దగా త యారు చేయాలన్న సెంటిమెంట్‌ను ఆమె వారసులు కొనసాగిస్తున్నారు. వీరితోపాటు మరికొంద రూ పెద్ద బతుకమ్మలను పేర్చుతుంటారు.

పెద్ద బతుకమ్మను పేర్చి పూజిస్తాం
కూకట్‌పల్లిలో అచ్చమైన పూలతో బతుకమ్మ ను పేర్చడం మా అత్త గుండాల చంద్రమ్మ నుంచి మాకు సంప్రదాయంగా వచి్చంది. అత్తగారు మా ప్రాంతంలో రెండు దశాబ్దాల పాటు అతిపెద్ద బతుకమ్మను పేర్చి ప్రత్యేక స్థానాన్ని చాటారు. ఇప్పుడు మేం తోటి కోడ ళ్లం ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ పెద్ద బతుకమ్మలను పేరుస్తున్నాం. గత సంవత్సరం ఇక్కడ పూలు లభించక ఇతర రాష్ట్రాల నుంచి పూలు తెప్పించుకున్నాం. ఈసారి కూడా పెద్ద బతుకమ్మను ఏర్పాటు చేస్తున్నాం.  
– గుండాల అర్చన, కూకట్‌పల్లి
చదవండి: పోలీసు కొలువులకు తగ్గిన కటాఫ్‌

మరిన్ని వార్తలు