హైదరాబాద్‌ సిటీలో ఈ సమస్యలు తీరేదెన్నడు?

8 Sep, 2022 11:42 IST|Sakshi

నగర రోడ్లపై పాదచారులకు నరకమే 

గణనీయంగా పెరిగిన వీరి మరణాలు 

గతేడాది ఏకంగా 94 మంది మృత్యువాత 

53 నగరాలకు ఆరో స్థానంలో నిలిచిన సిటీ 

స్పష్టం చేస్తున్న ఎన్సీఆర్బీ గణాంకాలు 

అందుబాటులోకి రాని మౌలిక వసతులు

సాక్షి, హైదరాబాద్‌: ‘పెడస్ట్రియన్‌ ఈజ్‌ కింగ్‌ ఆఫ్‌ ది రోడ్‌’ ఈ అంతర్జాతీయ నానుడి నగరంలో మాత్రం మాటలకే పరిమితమవుతోంది. హైదరాబాద్‌ సిటీలో పాదచారులకు మాత్రం పిటీగా మారింది. ఇక్కడ జరుగుతున్న ప్రమాదాలు, కనిపించని మౌలిక వసతులే దీన్ని స్పష్టం చేస్తున్నాయి. నగరంలో ప్రతి ఏడాదీ రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారిలో పాదచారులది రెండో స్థానం. గత ఏడాది నగర పరిధిలో జరిగిన మొత్తం ప్రమాదాల్లో 94 మంది పాదచారులు మరణించారని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్సీఆర్బీ)–2021 గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా మొత్తం 53 నగరాలకు సంబంధించిన గణాంకాలు విడుదల కాగా... వీటిలో హైదరాబాద్‌ పాదచారుల మరణాలకు సంబంధించి ఆరో స్థానంలో నిలిచింది.
 
ఈ సమస్యలు తీరేదెన్నడో... 
రాజధానిలో ఉన్న రహదారులపై పాదచారులు భద్రంగా తిరిగేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేవు. పురాతన నగరమైన పాతబస్తీలోనే కాదు... ఇటీవలే రూపుదిద్దుకుని, నానాటికీ అభివృద్ధి చెందుతున్న హైటెక్‌ సిటీ పరిసరాల్లోనూ ఇవి మచ్చుకైనా కనిపించవు. ట్రాఫిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థలోనూ పాదచారులకు అవసరమైన స్థాయిలో ప్రాధ్యానం లభించట్లేదు. ప్రణాళిక లోపం కారణంగా నగరంలో ఉన్న ఫుట్‌పాత్‌ల్లో సగం ఆక్రమణకు గురికాగా... మిగిలిన చోట్ల అనేక అడ్డంకులు వస్తున్నాయి. జంక్షన్స్‌ వద్ద పెడస్ట్రియన్స్‌ క్రాసింగ్‌ కోసం ప్రత్యేకమైన చర్యలు, అందుకు అనుగుణంలో ‘ఆల్‌ రెడ్స్‌’ అనే సాంకేతిక అంశం ఏర్పాటు ఇంకా జరుగుతూనే ఉంది. ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌ (ఎఫ్‌ఓబీ) నిర్మాణం, అందుబాటులోకి తీసుకురావడం నత్తనడకన సాగుతున్నాయి.  

చదవండి: (Hyderabad: సెప్టెంబర్‌ గండం.. గ్రేటర్‌ వాసుల వెన్నులో వణుకు)
భూగర్భ మార్గాలు కనుమరుగు... 
నగరంలోని రద్దీ ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు ఎక్కువగా ఉన్న చోట్లగతంలో భూగర్భ క్రాసింగ్‌ మార్గాలు నిర్మించారు. సరైన నిర్వహణ, భద్రతా ప్రమాణాలు లేకపోవడంతో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, కోఠిల్లో ఏర్పాటు చేసిన భూగర్భ క్రాసింగ్‌ మార్గాలు ఆదరణకు నోచుకోలేదు. దీంతో ఒకటి పూర్తిగా కనుమరుగు కాగా... మరోటి స్వరూపం మార్చుకుని పాదచారులకు పనికిరాకుండా పోయింది. మెట్రోరైల్‌ నిర్మాణాల కోసం అప్పట్లో సిటీలోని ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జ్‌ల్ని తొలగించారు. ఆ తర్వాత జీహెచ్‌ఎంసీ కొన్నింటిని నిర్మిస్తున్నా... అవసరాలకు తగ్గట్టు మాత్రం ఇవి లేవు. ఈ పరిస్థితుల కారణంగా గతేడాది నగరంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాల కారణంగా 590 మంది క్షతగాత్రులుగా కాగా... 94 మంది మరణించారు.  

ఈ చర్యలు తీసుకోవాల్సిందే... 
ఫుట్‌పాత్‌లపై చిరు వ్యాపారాలు, కాలిబాటల్ని మింగేసిన బడా మాల్స్‌ ఇవన్నీ ఒక ఎత్తయితే ప్రభుత్వ విభాగాల అనాలోచిత చర్యలు మరో ఎత్తు. వీటివల్ల మరికొన్ని ఇబ్బందులు వచ్చిపడి కాలిబాటలు బాటసారులకు బాసట కాలేకపోతున్నాయి. ఫుట్‌పాత్‌లపై ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన, పెంచిన చెట్లకు తోడు అధికారులు ఉద్దేశపూర్వకంగా, అనాలోచి ధోరణిలో ఏర్పాటు చేసిన (చేస్తున్న) విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంబాలు, మూత్రశాలలు ఆ కొద్ది స్థలాన్నీ ఆక్రమించేస్తూ పాదచారులకు పాదం మోపే చోటు లేకుండా చేస్తున్నాయి.

రోడ్లకు అనుసంధానంగా ఉన్న క్యారేజ్‌వే ఆధారంగా కాలిబాటలు కనిష్టంగా 4–5 అడుగుల వెడల్పు ఉండేలా విస్తరించాలి. ప్రస్తుతం ఉన్న వాటిపై అడ్డదిడ్డంగా ఉంటున్న చెట్లు, ట్రాన్స్‌ఫార్మర్లు వంటివి తొలగించాలి. ఈ తొలగింపు ప్రక్రియ సాధ్యం కాని ప్రాంతాల్లో ఉన్న ఫుట్‌పాత్‌ వెడల్పు కనీసం 2 నుంచి మూడు అడుగులు అధికంగా విస్తరించాలి. ఈ ఫుట్‌పాత్‌లు కేవలం పాదచారులు నడవడానికి మాత్రమే అన్నది అందరికీ అవగాహన కల్పించడంతో పాటు అది కచ్చితంగా అమలు అయ్యేలా చేయాలని సూచించారు. ఆక్రమణలు నిరోధించడానికి జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్‌ పోలీసులతో కూడిన సంయుక్త ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలను ఏర్పాటు చేయాలి.   

మరిన్ని వార్తలు