విషాదం: కుటుంబాన్ని కాటేసిన కరెంటు.. వైరు అంచు విద్యుత్‌ ఫ్యూజ్‌కు తాకడంతో..

13 Jul, 2022 02:26 IST|Sakshi
ఎండీ అహ్మద్‌, పర్వీన్‌బేగం, మాహీన్‌, అద్నాన్‌  

భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు మృతి 

కామారెడ్డిలో విషాదం

కామారెడ్డి: వెలుగులు నింపే విద్యుత్‌ ఓ కుటుంబంలో చీకటి నింపింది. విద్యుదాఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడ్డారు. రెండేళ్ల బాబు అనాథయ్యాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన ఈ విషాద ఘటన వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి బీడీ వర్కర్స్‌ కాలనీకి చెందిన ఎండీ అహ్మద్‌ (40) ఆటో నడుపుకొంటూ జీవిస్తున్నాడు. అతడికి భార్య పర్వీన్‌ బేగం (32), కూతురు మాహీన్‌ (6), కుమారులు అద్నాన్‌ (3), ఫైజాన్‌ (2) ఉన్నారు.

ఫైజాన్‌ సమీపంలో ఉండే అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. బట్టలు ఆరేయడానికి వారు నివసించే రేకుల ఇంటి ముందు గోడకు రెండువైపులా మేకులు కొట్టి వైరుకట్టారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో పర్వీన్‌ బేగం దుప్పటిని వైరుపై ఆరేస్తుండగా బరువు కారణంగా వైరు కిందకు జారింది. వైరు అంచుకు కొద్దిదూరంలోనే విద్యుత్‌ ఫ్యూజ్‌ ఉంది.

దానికి వైరు తాకడంతో విద్యుత్‌ సరఫరా అయ్యింది. దీంతో పర్వీన్‌ బేగం విద్యుదాఘాతానికి గురైంది. ఆమె అరుపు విని ఇంట్లో ఉన్న అహ్మద్, పిల్లలు బయటకు పరుగెత్తుకొచ్చారు. ఆమెను కాపాడబోయే ప్రయత్నంలో ఒకరి వెంట మరొకరు విద్యుదాఘాతానికి గురై నలుగురూ మృతిచెందారు. చుట్టుపక్కలవారు గమనించి విద్యుత్‌శాఖ అధికారులు, పోలీసులకు సమాచారమిచ్చారు. 

3 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా 
ఈ ఘటనపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశా రని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ తెలిపారు. ఆయన ఉర్దూ అకాడమీ చైర్మన్‌ ముజీబొద్దీన్‌తో కలిసి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఎం కేసీఆర్‌ ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని గోవర్ధన్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు