ఆ ఇద్దరు ఖైదీల క్షమాభిక్షపై నిర్ణయం తీసుకోండి 

27 Oct, 2023 03:59 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: ఓ కేసులో యావజ్జీవశిక్ష పడి 27 ఏళ్లుగా జైలుశిక్ష అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు క్షమాభిక్ష కోసం పెట్టుకున్న అర్జీపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల గడువు ఇస్తున్నామని, ఈలోగా నిర్ణయం తెలియజేయాలని స్పష్టం చేసింది. ఒకే కేసులో ఖైదీలుగా ఉన్న ముగ్గురికి క్షమాబిక్ష ప్రసాదించి.. తమను పట్టించుకోవడంలేదని అషారఫ్‌ అలీ, ఆరిఫ్‌ఖాన్‌ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.

1997లో నమోదైన ఓ కేసులో కిందికోర్టు ఈ ఇద్దరితోపాటు మరో ముగ్గురికి యావజ్జీవ జైలుశిక్ష విధించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది పేర్కొన్నారు. హైకోర్టులో అప్పీలు చేసుకున్నా కొట్టివేసిందని చెప్పారు. ఈ ఐదుగురిలో ముగ్గురికి క్షమాభిక్ష ప్రసాదిస్తూ ఆగస్టు 19న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఒకే కేసులో శిక్ష అనుభవిస్తున్న ఐదుగురిలో ముగ్గురిని విడుదల చేసి, ఇద్దరి వినతిపత్రాన్ని పట్టించుకోకపోవడం సరికాదని వ్యాఖ్యానించింది. అనంతరం విచారణను నవంబర్‌ 21వ తేదీకి వాయిదా వేసింది.  

మరిన్ని వార్తలు