జనగామ.. లంకె బిందె: వెలుగుచూసిన మరిన్ని ఆభరణాలు

10 Apr, 2021 07:56 IST|Sakshi

దొంగల భయంతో దాచిపెట్టారా?

రెండోరోజూ పెంబర్తి ప్రాంతంలో తవ్వకాలు.. బయటపడిన ఆభరణాలు

పరిశీలించిన పురావస్తు శాఖ అధికారులు

వాటా కావాలని రైతుల నిరసన.. 

జనగామ: రెండోరోజైన గురువారం జరిపిన తవ్వకాల్లోనూ అరుదైన పగడాలు, రాతిపూసలు, నాగుపాము ఆకారంలో ఉన్న బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. జనగామ జిల్లా పెంబర్తి గ్రామశివారు టంగుటూరు రోడ్డు సమీపంలో వెంచర్‌ కోసం భూమిని చదును చేస్తుండగా గురువారం లంకె బిందె, అందులో గుప్తనిధులు బయటపడ్డ సంగతి తెలిసిందే. ఈ మేరకు పురావస్తు శాఖ వరంగల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బి.మల్లునాయక్‌ నేతృత్వంలో ఉద్యోగులు భానుమూర్తి, బాబు శుక్రవారం ఈ ప్రాంతాన్ని సందర్శించి మట్టిని జల్లెడ పట్టించారు.

ఈ సందర్భంగా కోరల్‌ బీడ్‌(ఎముకలతో తయారు చేసిన పూసలు), రాతి పూసలు(మహిళలు పుస్తెలతాడులో వేసుకునే పగడాలు), ల్యాపిన్‌ లాజ్యులీ స్టోన్‌(స్టోన్‌ రకానికి చెందిన పగడం), నాగుపాము ఆకారంలో ఉన్న బంగారు ఆభరణాలు వెలుగుచూశాయి. మట్టిలో దొరికిన ఆభరణాలను ప్రత్యేక కవర్‌లో ప్యాక్‌ చేసి ఉన్నతాధికారులకు అందజేశారు. ఇక అధికారులు ఆభరణాలను సేకరించే సమయంలో రైతులు అక్కడికి చేరుకుని తమకు కూడా వాటా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎస్సై రవికుమార్‌ సర్దిచెప్పగా వారు వెనక్కి తగ్గారు. 

అమ్మవారి ఆభరణాలు కావు! 
వ్యవసాయ క్షేత్రంలో బయటపడినవి అమ్మవారికి అలంకరించే ఆభరణాలు కాకపోవచ్చని పురావస్తు శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. 1930– 40 ప్రాంతంలో రజాకార్ల దాడుల్లో సంపన్న కుటుంబాలు భద్రత కోసమే బండరాళ్ల మధ్య వీటిని దాచిపెట్టాయా.. లేక దారి దోపిడీ దొంగలు ఎత్తుకొచ్చి ఇక్కడ పాతిపెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటిల్లో ఎక్కువగా మహిళలు, పిల్లలు వినియోగించే ఆభరణాలు ఉండటం గమనార్హం. కాగా, గురువారం రాత్రి ఈ ప్రాంతంలో ఎలాంటి నిఘా లేకపోవడంతో బంగారు ఆభరణాల కోసం పలువురు పోటీపడి తవ్వినట్లు సమాచారం. కొందరికి బంగారు ఆభరణాలు లభించాయని తెలిసింది. 

ఈరోజు తవ్వకాల్లో వెలుగుచూసిన ఆభరణాల వివరాలు 
బంగారు ఆభరణాలు: 6 తులాల 300 మి.గ్రా. 
వెండి ఆభరణాలు: 2 తులాల 800 మి.గ్రా. 
కోరల్‌ బీడ్స్‌: 7 తులాల 200 మి.గ్రా.  
చదవండి: జనగామ: బయటపడ్డ లంకె బిందె.. బంగారం, వెండి లభ్యం!

మరిన్ని వార్తలు