యువర్‌..‘ఆనర్స్‌’

8 Dec, 2021 02:05 IST|Sakshi

బీఏ కోర్సులంటేనే బోర్‌ కొట్టించే పరిస్థితిని రూపుమాపేందుకు ఉన్నత విద్యా మండలి ప్రయత్నిస్తోంది. సరికొత్త రాజనీతి బోధనకు శ్రీకారం చుట్టింది. బీఏ ఆనర్స్‌ పొలిటికల్‌ సైన్స్‌ కోర్సును తొలిసారిగా కోఠి ఉమెన్స్‌ కాలేజీలో ఈ విద్యాసంవత్సరంలో ప్రవేశపెట్టింది.  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఉన్నత విద్యామండలి సాధన చేసి సరికొత్త రాజనీతి బోధనకు శ్రీకారం చుట్టింది. విద్య, విలువల కలబోతగా కొత్త కోర్సును విద్యార్థుల ముందుకు తెచ్చింది. వినూత్న పాఠ్యప్రణాళిక ఈ కోర్సు విశేషం. బీఏ (బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌) కోర్సులంటేనే బోర్‌ కొట్టించే పరిస్థితిని రూపుమాపేందుకు ప్రయత్నిస్తోంది. కొత్త కోర్సుకేకాదు, బావితరాల కోసం కొత్త రాజకీయ నాయకత్వానికి డిజైన్‌ చేసింది. బీఏ ఆనర్స్‌ పొలిటికల్‌ సైన్స్‌ కోర్సును తొలిసారిగా కోఠి ఉమెన్స్‌ కాలేజీలో ఈ విద్యాసంవత్సరంలో ప్రవేశపెట్టింది. 60 మంది విద్యార్థులతో ప్రయోగాత్మకంగా మొదలైన తొలిబ్యాచ్‌ ప్రారంభ కార్యక్రమం మంగళవారం ఇక్కడ జరిగింది. కార్యక్రమంలో హెచ్‌సీయూ ప్రొఫెసర్‌ అరుణ్‌ పట్నాయక్, కోఠి ఉమెన్స్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ విద్యుల్లత, రాజనీతిశాస్త్రం ప్రొఫెసర్‌ వి.శ్రీలత తదితరులు పాల్గొన్నారు. నాయకత్వలక్షణాలు, రాజకీయ మేధోమథనం, క్షేత్రస్థాయి రాజనీతిజ్ఞత మేళవించిన పాఠ్యప్రణాళికను ఈ కోర్సులో జోడించారు. ఈ కోర్సు ప్రాధాన్యతలపై నిపుణులు ‘ఇండస్‌ ప్రోగ్రామ్‌’లో ఏమన్నారంటే... 

దేశంలోనే భిన్నమైన ఆలోచన: ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ లింబాద్రి 
భిన్నమైన ఆలోచనలతో కోర్సుకు డిజైన్‌ చేశాం. సమకాలీన అంతర్జాతీయ, రాజకీయ విషయాలే బోధనాంశాలు. తరగతికే పరిమితమయ్యే పాతవిధానానికి భిన్నంగా రాజకీయప్రముఖుల అనుభవాలే పాఠ్యాంశాలుగా నేరుగా విద్యార్థులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. సంప్రదాయ ఫ్యాకల్టీ పాత్ర కన్నా, రాజకీయ ముఖ్యులు, విశ్లేషకులే ఇక్కడ బోధకులుగా వ్యవహరిస్తారు. నాలుగు గోడల మధ్య చదువును పక్కన బెట్టి, విశాల ప్రపంచంలో విస్తృత అవగాహన బీఏ ఆనర్స్‌ పొలిటికల్‌ సైన్స్‌ ప్రత్యేకత. 

చారిత్రక అవసరం : ఓయూ వీసీ ప్రొ. డి. రవీందర్‌ 
ఉన్నత విద్యలో మహిళల పాత్ర 70 % మేర పెరిగింది. గొప్ప నాయకత్వ లక్షణాలను సంతరించుకునే దిశగా వాళ్లు అడుగులు వేస్తున్నారు. అందుకే బీఏ హానర్స్‌ పొలిటికల్‌ సైన్స్‌ కోర్సును కోఠి ఉమెన్స్‌ కాలేజీలో ప్రవేశపెట్టాం. దేశంలోని అన్ని యూనివర్సిటీల్లో అధ్యయనం చేసిన తర్వాతే ఈ కోర్సు రూపొందించాం. భావితరాలకు మంచి నాయకులను అందిస్తామనే ఆత్మవిశ్వాసంతో వెళ్తున్నాం.

ఢిల్లీ కన్నా ... ఇక్కడే బెస్ట్‌
ఢిల్లీలోని విశ్వవిద్యాలయాల కన్నా మెరుగైన రీతిలో బీఏ ఆనర్స్‌ను తెలంగాణ అందించాలనుకుంటోం ది. దక్షిణ భారతదేశంలో ఈ కోర్సుకు అనువైన పరిస్థితులు తెలంగాణలోనే ఉన్నాయి. భవిష్యత్‌లో ఈ కోర్సు కోసం ఇతర రాష్ట్రాల వాళ్లూ పోటీపడతారు. తెలంగాణలోని నాయకత్వ లక్షణాలు, విద్యాహబ్‌గా హైదరాబాద్‌ ముందుండటం వల్ల ఈ కోర్సు కు మంచి భవిష్యత్‌ ఉంటుందని భావిస్తున్నాం. ఈ కోర్సు అభ్యసించిన విద్యార్ఙినులు రోల్‌మోడల్‌గా నిలుస్తారని ఆశిస్తున్నాం.    – ప్రొ.వెంకటేశు 
రాజకీయాల్లో విలువలు పెంచే కోర్సు

విలువలతో కూడిన రాజకీయాలు నేటితరానికి అవసరం. ప్రజా సంక్షేమ పాలనకు ఇదే పునాది. ముఖ్యంగా మహిళారాజకీయ చైతన్యం వెల్లివిరుస్తున్న నేపథ్యంలో హానర్స్‌ పొలిటికల్‌ కోర్సులకు ఎంతో ప్రాధాన్యముంది. పార్లమెంటరీ విలువలు, నాయకత్వ లక్షణాలు కలబోసి రూపొందించిన ఈ పాఠ్యప్రణాళిక... వాస్తవాలే పాఠాలు మార్చి అందించే బోధనావిధానం తెలంగాణను దేశంలో గర్వంగా నిలుపుతుందని భావిస్తున్నాం.  – ముసలయ్య (రాజనీతి శాస్త్రం ఆచార్యుడు) 

మరిన్ని వార్తలు