వర్సిటీల్లో విద్యార్థుల హెల్త్‌రికార్డ్‌

10 Feb, 2023 00:53 IST|Sakshi
వైద్యసంస్థల అధిపతులు, ఇతర నిపుణుల సమావేశంలో మాట్లాడుతున్న గవర్నర్‌ 

తయారు చేయాలని అధికారులకు గవర్నర్‌ సూచన

వైద్యసంస్థల అధిపతులు, నిపుణులతో కేంద్రబడ్జెట్‌పై తమిళిసై భేటీ

సాక్షి, హైదరాబాద్‌: విశ్వవిద్యాలయాల విద్యార్థుల ఆరోగ్య రికార్డులను తయారు చేయాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అధికారులకు సూచించారు. గవర్నర్‌ అధ్యక్షతన గురువారం రాజ్‌భవన్‌లో ‘యూనియన్‌ బడ్జెట్‌ 2023–24లో ప్రతిపాదించిన ఆరోగ్యరంగ కార్యక్రమాలు, కేటా యింపులు’అనే అంశంపై వివిధ కేంద్ర వైద్యసంస్థలు, ఇతర సంస్థల అధిపతులు, ప్రతినిధులు, పలువురు డాక్టర్లతో సమావేశం నిర్వహించారు.  

గవర్నర్‌ మాట్లాడుతూ కేంద్రబడ్జెట్‌–2023లో ఆరోగ్యరంగానికి భారీ కేటాయింపులతో సుస్థిర ఆరోగ్య సంరక్షణ రంగాన్ని రూపొందించడానికి మార్గం ఏర్పడిందన్నారు. కేంద్రబడ్జెట్‌లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖకు రూ.89,155 కోట్లు కేటాయించడంవల్ల ఆరోగ్యరంగంలో మౌలిక సదుపాయాలు, సేవలను అద్భుతంగా మార్చడా నికి వీలు కలుగుతుందన్నారు.

వైద్య విద్య, పారా మెడికల్‌ రంగం, ఆయుష్మాన్‌ భారత్‌ కోసం బడ్జెట్లో కేటాయింపులు భారీగా పెరిగాయని, దీనివల్ల ఈ పథకం కింద మరో 40 కోట్ల మందిని ఆరోగ్య బీమా పరిధిలోకి తీసుకు రావాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు. వైద్య, ఆరోగ్య పరిశోధనలకు కేటాయింపులు పెరగ డం ఆ రంగంలో నూతన ఆవిష్కరణలు పెరుగుతా యని, నాణ్యమైన పరిశోధనలకు దోహదపడుతుందని గవర్నర్‌ అన్నారు. 

నర్సింగ్‌ విద్యకు అంతర్జాతీయ డిమాండ్‌
కొత్త మెడికల్‌ కాలేజీలు, జిల్లా ఆసుపత్రుల ఆధునికీకరణకు రూ.6,500 కోట్లు కేటాయించారని గవర్నర్‌ వివరించారు. కొత్తగా 157 నర్సింగ్‌ కాలేజీలు రాబోతున్నాయని, మనదేశంలో నర్సింగ్‌ విద్యకు అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉందన్నారు. తెలంగాణలో ఫార్మాస్యూటికల్‌ రంగం మరింత వృద్ధి చెందిందన్నారు. బడ్జెట్‌సహా వివిధ అంశాలపై సమావేశానికి వచ్చిన ప్రముఖులు వ్యాసాలు రాసి పంపితే వాటిని పుస్తకరూపంలో ప్రచురిస్తామని గవర్నర్‌ తెలిపారు.

బీబీనగర్‌ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వికాస్‌ భాటియా మాట్లాడుతూ ఈ దశాబ్దకాలంలో దేశంలో ఎంబీబీఎస్‌ సీట్లు 87 శాతం, పీజీ మెడికల్‌ సీట్లు 105 శాతం, మెడికల్‌ కాలేజీల సంఖ్య రెట్టింపు అయ్యాయన్నారు. సమావేశంలో సీసీఎంబీ డైరెక్టర్‌ వినయ్‌ నందుకుమార్, జాతీయ పోషకా హార సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ హేమలత తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు