ఇంటర్‌లో గురుకులాల హవా

29 Jun, 2022 00:59 IST|Sakshi

బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఏకలవ్య సంస్థల్లో అద్భుత ఫలితాలు 

ఉత్తీర్ణతా శాతం, మార్కుల్లో భేష్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో చదివిన ఇంటర్‌ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. ఇంటర్‌ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు. ఇంటర్‌ రెండో సంవత్సర ఫలితాల్లో 93.84 శాతం, మొదటి సంవత్సరం ఫలితాలలో 86.14 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

950కి పైగా మార్కులు పొంది న విద్యార్థుల సంఖ్య వందకు పైగా ఉంది. ఇంటర్‌ రెండో సంవత్సరం పరీక్షలను 2,755 మంది విద్యార్థులు రాయగా వారిలో 2,544 మంది పాసయ్యారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో కొత్తగా ప్రారంభించిన ఒకేషనల్‌ కోర్సుల్లోనూ విద్యార్థులు తమ సత్తా చాటారు. నాగార్జునసాగర్‌లోని గురుకుల కాలేజీ ఫస్ట్, సెకండియర్‌ ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించింది. మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులను, అధ్యాపకులను, సిబ్బందిని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, కార్యదర్శి మల్లయ్య బట్టు అభినందించారు. 

ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల మెరుపులు.. 
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి చెందిన విద్యార్థినీ విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు. ఫస్టియర్‌ విద్యార్థులు 88.03 శాతం ఉత్తీర్ణులు కాగా, రాష్ట్రవ్యాప్త ఉత్తీర్ణత 64.25% మాత్రమే కావడం గమనార్హం. 17 కాలేజీలు నూటికి నూరు శాతం ఫలితాలు సాధించాయి. సెకండియర్‌లో ఏకంగా 93.23 శాతం మంది (రాష్ట్ర ఉత్తీర్ణత 68.68%) ఉత్తీర్ణులయ్యారు. 41 కాలేజీలు నూటికి నూరు శాతం ఫలితాలు సాధించాయి.

అత్యుత్తమ ఫలితాలు సాధించడం పట్ల ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, సొసైటీ కార్యదర్శి రోనాల్డ్‌ రాస్‌లు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో చదివిన విద్యార్థులు కూడా మంచి ఫలితాలు సాధించారు. సెకండియర్‌లో 82.09 శాతం, ఫస్టియర్‌లో 78.75 శాతం ఫలితాలు వచ్చాయి. తేజావత్‌ భావనశ్రీ 984 మార్కులతో సెకండియర్‌ టాపర్‌గా నిలిచారు.

ఇక రాష్ట్రంలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో చదువుతున్న ఇంటర్‌ విద్యార్థులు ఇంటర్‌ ఫలితాల్లో 94.18 సగటుతో ఉత్తీర్ణులై తమ ప్రత్యేకతను నిలుపుకున్నారు. విద్యార్థులను మంత్రి సత్యవతి రాథోడ్‌ అభినందించారు. మైనారిటీ గురుకులాల వివరాలు ఇంకా  ప్రకటించలేదు.

మరిన్ని వార్తలు