Harish Rao: గోలీలు ఇస్తున్నరా?

16 Nov, 2021 03:50 IST|Sakshi

టెలికాన్ఫరెన్స్‌లో గర్భిణులను ఆరా తీయనున్న మంత్రి హరీశ్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణులు/బాలింతలకు అందుతున్న వైద్య సేవల తీరుతెన్నుల గురించి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్వయంగా ఫోన్‌ చేసి వారినే అడిగి తెలుసుకోనున్నారు. వైద్యులు నెలనెలా చెకప్‌లు చేస్తున్నారా? మందులు ఏ మేరకు ఇస్తున్నారు? ఆసుపత్రుల నిర్వహణలో లోపాలు ఏమైనా ఉంటున్నాయా? కేసీఆర్‌ కిట్‌ పథకం కింద అందిస్తున్న ఆర్థిక సాయం అందిందా? వంటి ప్రశ్నలు వేయనున్నారు. రోజుకో ఉమ్మడి జిల్లా చొప్పున పలువురితో టెలికాన్ఫరెన్స్‌ చేపట్టనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదు చేసుకున్న గర్భిణుల ఫోన్‌ నంబర్ల ప్రకారం టెలికాన్ఫరెన్స్‌లోకి తీసుకోనున్నట్లు చెప్పారు. గర్భిణులు వారి ఇళ్ల నుంచే మంత్రితో మాట్లాడవచ్చని వివరించారు. రెండు, మూడు రోజుల్లో ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. 

కేసీఆర్‌ కిట్‌లో మార్పులు చేయాలా?..: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను పెంచే లక్ష్యంతో అమలు చేస్తున్న కేసీఆర్‌ కిట్‌ పథకం గురించి మంత్రి హరీశ్‌రావు టెలికాన్ఫరెన్స్‌లో ప్రత్యేకంగా ఆరా తీయనున్నారు. 15 వస్తువులతో కూడిన కేసీఆర్‌ కిట్‌ అందరికీ అందుతోందో లేదో తెలుసుకోనున్నారు. అలాగే మగబిడ్డ పుడితే రూ. 12 వేలు, ఆడబిడ్డ పుడితే రూ. 13 వేల చొప్పున అందిస్తున్న ఆర్థిక సాయం ఏ మేరకు అందుతోందన్న విషయాన్నీ ఆయన తెలుసుకోనున్నారు. ఈ పథకం కింద గర్భిణులు/బాలింతలకు వివిధ దశల్లో రూ. 1,073.94 కోట్ల ఆర్థిక సాయాన్ని, 10.80 లక్షల కిట్లను ఇప్పటివరకు అందించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు మంత్రికి నివేదించాయి.

ఈ నేపథ్యంలో ఈ పథకంపై లబ్ధిదారులు ఏ మేరకు సంతృప్తిగా ఉన్నారు? కేసీఆర్‌ కిట్‌లో మార్పుచేర్పులు చేయాలా? అని లబ్ధిదారులను ఆయన అడిగి తెలుసుకొనే అవకాశముంది. అలాగే ఆర్థిక సాయం అందని వారికి తక్షణమే విడుదల చేయొచ్చని తెలిసింది. చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని లేబర్‌ రూమ్‌లు పరిశుభ్రంగా ఉండట్లేదన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీనిపై  మంత్రి హరీశ్‌ అధికారులను వివరణ కోరే అవకాశముంది.  

మరిన్ని వార్తలు