కరోనాపై ‘మూడో పోరు’కు సిద్ధం

20 Jan, 2022 05:39 IST|Sakshi
ఆస్పత్రిలో రోగులతో మాట్లాడుతున్న  మంత్రి హరీశ్‌రావు   

అందుబాటులో రెండు కోట్ల టెస్టింగ్‌ కిట్లు, కోటి హోం ఐసోలేషన్‌ కిట్లు  

సబ్‌సెంటర్‌ స్థాయిలో కరోనా పరీక్షలు 

ఐసోలేషన్‌ కిట్ల పంపిణీకి ఏర్పాట్లు: మంత్రి హరీశ్‌రావు 

గజ్వేల్‌: కరోనా మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల టెస్టింగ్‌ కిట్లు, కోటి హోం ఐసోలేషన్‌ కిట్లు అందుబాటులో ఉంచామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కరోనా పరీక్షల తీరు, సాధారణ ఓపీ సేవలు, ప్రసూతి సేవల తీరును పరిశీలించారు. ఆక్సిజన్‌ ప్లాంట్‌ వివరాలను ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహేశ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కరోనా సోకితే భయాందోళనకు గురికావద్దని, సబ్‌సెంటర్‌ స్థాయి నుంచి పీహెచ్‌సీలు, అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో టెస్టింగ్‌ కిట్లు అందుబాటులో ఉంచామని చెప్పారు.

ఎప్పటికప్పుడు పరీక్షలు చేయడంతోపాటు హోం ఐసోలేషన్‌ కిట్లు కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు. సిద్దిపేట మెడికల్‌ కళాశాలలో వంద పడకలతో కరోనా వార్డును ప్రత్యేకంగా సిద్ధం చేశామని, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సైతం వేగంగా సాగుతోందన్నారు. 60 ఏళ్లు పైబడినవారు బూస్టర్‌డోస్‌ తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. కేసీఆర్‌ కిట్‌ కార్యక్రమంతో ప్రభుత్వాసుపత్రుల్లో 22 శాతం మేర ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. గజ్వేల్‌ ఆస్పత్రిలో వైద్యసేవల తీరు బాగుందని ప్రశంసించారు. ఈ ఆస్పత్రిలో నెలకు 400కుపైగా డెలివరీలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆయనతో పాటు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రోజాశర్మ ‘గడా’ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు