ఆ రూ. 495 కోట్లు ఇప్పించండి

23 Jan, 2023 01:27 IST|Sakshi

ఏపీకి బదలాయించిన సీఎస్‌ఎస్‌ నిధులపై మంత్రి హరీశ్‌రావు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించిన కేంద్ర ప్రాయోజిత పథకాలకు (సీఎస్‌ఎస్‌) సంబంధించిన రూ.495 కోట్లు తిరిగి ఇప్పించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. 2014–15లో సీఎస్‌ఎస్‌ కింద తెలంగాణకు హక్కుగా రావాల్సిన నగదును పొరపాటున ఆంధ్రప్రదేశ్‌లో ఖాతాలో జమచేశారని, దాన్ని తిరిగి తెలంగాణకు ఇప్పించాలని కోరారు. ఈ మేరకు హరీశ్‌రావు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు.

ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేసినా, కేంద్రానికి లేఖలు రాసినా ఫలితం లేకుండా పోయిందని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటి సంవత్సరంలో (2014–15) కేంద్రం నుంచి వచ్చే నిధులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జనాభా ప్రాతిపదికన విభజించారని, అయితే పొరపాటు­గా మొత్తం సీఎస్‌ఎస్‌ నిధులను ఆంధ్రప్రదేశ్‌కు జమ చేశారని గుర్తుచేశారు. దీంతో తెలంగా­ణ నష్ట పోయిందన్నారు.

ఈ విషయాన్ని తాము ఇప్పటికే ఏపీ, కేంద్ర ప్రభుత్వాలతోపాటు అకౌంటెంట్‌ జనరల్‌ దృష్టికి తీసుకువెళ్లినట్లు వివరించా­రు. ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఆ రూ.495 కోట్లను తెలంగాణకు ఇంకా సర్దుబాటు చేయలేదన్నారు. ఇప్పటికైనా ఆ మొత్తాన్ని తిరిగి ఇప్పించేలా కృషి చేయాలని, వ్యక్తిగతంగా చొరవ తీసుకొని తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని సీతారామన్‌ను కోరారు. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు