కుండపోత.. గుండెకోత

15 Oct, 2020 01:55 IST|Sakshi
నదీమ్‌ కాలనీలో ఇలా..

రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో వర్షాలు 

సాక్షి, హైదరాబాద్‌: వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురిశాయి. సోమవారం రాత్రి మొదలై బుధవారం తెల్లవారుజాము వరకు కురిసిన ఎడతెరపిలేని వానలతో రాష్ట్రం గజగజలాడింది. బుధవారం ఉదయం తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కానీ అప్పటివరకు కురిసిన వానలతో హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ప్రధాన రహదారులు మొదలు అనుసంధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. వరద ధాటికి చాలాచోట్ల రోడ్లు కొట్టుకుపోయి రవాణా వ్యవస్థ స్తంభించింది. పట్టణాల్లోని కాలనీలు, పల్లెల్లోని ఇళ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ సంఖ్యలో చెరువులు నీటితో నిండి అలుగెత్తగా, ఏళ్లుగా నిండని చెరువులు సైతం జలకళను సంతరించుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటినప్పటికీ దాని ప్రభావం మాత్రం కొనసాగుతోంది. దీంతో ఆగ్నేయ దిశగా ఈదురుగాలులు వీస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావం తోడవడంతో పలుచోట్ల బుధవారం సాయంత్రం కూడా వర్షాలు కురిశాయి. బుధవారం ఉదయం నాటికి రాష్ట్రంలో సగటున 5.77 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

మూడు నెలల్లో కురవాల్సిన వర్షపాతం
అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు కొనసాగే ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 12.49 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. ఈ సీజన్‌లో అక్టోబర్‌లో మూడో వంతు వర్షాలు.. నవంబర్, డిసెంబర్‌లలో మోస్తరు వర్షాలు కురుస్తాయి. కానీ రాష్ట్రంలో నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలు సీజన్‌లో కురవాల్సిన మొత్తం రికార్డును ఇప్పుడే నమోదు చేశాయి. బుధవారం ఉదయం నాటికే ఏకంగా 12.77 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. మూడు నెలల్లో కురిసే వానలు కేవలం సీజన్‌ ప్రారంభమైన రెండు వారాల్లోనే నమోదు కావడం గమనార్హం. గతేడాది ఇదే సమయం నాటికి 5.87 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సీజన్‌ ముగిసే నాటికి కేవలం 11.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నైరుతి సీజన్‌లో కూడా సాధారణ వర్షపాతం కంటే 45 శాతం అధికంగా నమోదయ్యాయి. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు రాష్ట్రంలో 72 సెంటీమీటర్ల వర్షపాతానికి గాను 107.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

18 జిల్లాల్లో అతి భారీ వర్షాలు
ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో ఇప్పటివరకు 18 జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. మరో 9 జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా, 6 జిల్లాల్లో మాత్రం సాధారణ వర్షపాతం నమోదైంది. బుధవారం ఉదయం వరకు కురిసిన వర్షాల్లో మేడ్చల్‌ జిల్లాలో అధికంగా 17.8 సెంటీమీటర్లు, హైదరాబాద్‌లో 17.6 సెం.మీ., సంగారెడ్డిలో 12.817  సెం.మీ., రంగారెడ్డిలో 13.51 సెం.మీ., మెదక్‌లో 10.917 సెం.మీ., సిద్దిపేట జిల్లాలో 10.617  సెం.మీ. నమోదైంది. కాగా, తీరం దాటిన వాయుగుండం క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారినట్లు వాతావరణ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఆగ్నేయ దిశగా ప్రయాణించి ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలగుండా బలహీనపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడంతో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్‌ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

జిల్లాలకు వర్ష సూచన
అతిభారీ వర్షాలు: జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్‌ రూరల్, వరంగల్‌ అర్బన్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జనగామ, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, ములుగు, నారాయణపేట.
భారీ వర్షాలు: పెద్దపల్లి, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం.
సాధారణ వర్షాలు: ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల.  

మరిన్ని వార్తలు