రాహుల్‌ పర్యటన ఎఫెక్ట్‌.. ఓయూలో మరోసారి ఉద్రిక్తత

3 May, 2022 12:50 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ(మంగళవారం) ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఓయూ సందర్శనను వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్వీ నాయకులు మళ్లీ ఆందోళన చేపట్టారు. 

ఎన్ఎస్‌యూఐ నేతలు కొందరు కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనం చేయడంతో.. కౌంటర్‌గా రాహుల్‌  గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసి.. వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా.. పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌నున్న విష‌యం తెలిసిందే.  ఈపర్యటనలో భాగంగా.. ఈ నెల 7న హైద‌రాబాద్‌, తార్నాక‌లోని ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించి.. విద్యార్థుల‌తో ఆయన ముఖాముఖి చేపట్టాలనుకున్నారు. అయితే ఓయూ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ అందుకు అనుమతులు నిరాకరించింది. 

మరోవైపు అక్క‌డ‌ విద్యార్థి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఓయూలోకి రాహుల్ గాంధీని అడుగుపెట్టనివ్వ‌బోమని టీఆర్ఎస్వీ నాయకులు ఆందోళనలు చేస్తుండ‌గా, కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్‌యూఐ కూడా పోటీగా ఆందోళ‌న‌ల‌కు దిగుతోంది. ఇక హైకోర్టు సైతం రాహుల్‌ సభ నిర్వాహణ నిర్ణయాన్ని దాదాపుగా ఓయూకే వదిలేసింది.

సంబంధిత వార్త: ఓయూ రగడ.. ఆగని అరెస్టులు 

మరిన్ని వార్తలు