గృహ లక్షలే లక్షలు

10 Sep, 2023 02:24 IST|Sakshi

పక్కకు పెట్టిన 5 లక్షల దరఖాస్తుల్లో అర్హులు ఉన్నారంటూ ఆందోళన  

ఒకరి ఇచ్చి మరొకరికి ఇవ్వకుంటే వివాదాలకు ఆస్కారం 

డబుల్‌ బెడ్‌రూమ్‌ తరహాలో గందరగోళం తప్పదా?  

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల ముంగిట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న గృహలక్ష్మి పథకానికి భారీపోటీ నెలకొంది. సొంత జాగాలో ఇల్లు కట్టుకోవటానికి పేదలకు రూ.3 లక్షల ఆర్థికసాయం అందజేసేందుకు గృహలక్ష్మి పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.

ఇటీవలే జిల్లా కలెక్టర్లు ఆ పథకానికి దరఖాస్తులు ఆహ్వానించగా, దాదాపు 15.04 లక్షలు అందాయి. వాటిల్లో ప్రాథమిక స్రూ్కటినీతో 10.20 లక్షల దరఖాస్తులు అర్హమైనవిగా తేల్చారు. గతంలో ప్రారంభించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పథకంలో నెలకొన్న గందరగోళం, నిధుల సమస్య కారణంగా ప్రభుత్వం ఆ ఇళ్ల నిర్మాణంలో కొత్తవి చేపట్టడం లేదు. ఉన్నవి పూర్తి చేయటమే కష్టంగా మారిన తరుణంలో ‘గృహలక్ష్మి’అర్హులను ఎలా ఎంపిక చేస్తారా చూడాల్సిందే. 

ఎమ్మెల్యేలదే హవా.. 
గృహలక్ష్మి పథకాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో అధికార పక్షం ఉంది. ఇళ్లు కేటాయించేందుకు రూపొందించే జాబితా వారి కనుసన్నల్లోనే సిద్ధం కానుంది. కలెక్టర్‌ ఆధ్వర్యంలో అధికారుల బృందం జాబితా సిద్ధం చేస్తున్నా, స్థానిక ఎమ్మెల్యే సూచించిన గ్రామాలు, ప్రజలకు ప్రాధాన్యం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే పారీ్టలకతీతంగా ఈ ఎంపిక జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో అలాగే ఎంపికలు ఉంటాయని నేతలు చెబుతున్నారు. జాబితా రూపొందించిన తర్వాతగానీ అది ఎంతవరకు అమలైందో తెలుస్తుంది.

ఎంపికలు ఎలా ఉన్నా.. పోటీ తీవ్రంగా ఉన్న తరుణంలో ఇళ్ల కేటాయింపు పెద్ద సవాల్‌గానే మారే అవకాశం కనిపిస్తోంది. డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ల కేటాయింపులో తీవ్ర గందరగోళం నెలకొన్న నేపథ్యంలో, గృహలక్ష్మి లబ్దిదారుల ఎంపికలోనూ వివాదాలు తప్పేలా లేవు. ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకుంటే వివాదాలు చెలరేగే ప్రమాదం నెలకొంది. ఇది నేతలకు కూడా ఇబ్బందిగా మారే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు అధికారులు పక్కన పెట్టిన దరఖాస్తుల్లోనూ అర్హులున్నారంటూ కొందరు ఆరోపిస్తున్నారు. వాటిని కూడా పద్ధతిగా పరిశీలిస్తే కనీసం మరో 2 లక్షల వరకు దరఖాస్తులు అర్హమైనవిగా తేలుతాయని అంటున్నారు. తహసీల్దార్ల ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించి ఎంపిక ప్రక్రియ జరపాలని, తూతూ మంత్రంగా గ్రామ కార్యదర్శుల ఆధ్వర్యంలో నిర్వహించారని విమర్శలు వినిపిస్తున్నాయి.  

ఉన్నవి 4 లక్షల ఇళ్లే.. 
ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇళ్లు మంజూరు చేసింది. ఈ లెక్కన 3.57 లక్షల ఇళ్లు కేటాయిస్తుంది. ముఖ్యమంత్రి పరిధిలో 43 వేల ఇళ్లు రిజర్వ్‌ చేశారు. వెరసి మొత్తంగా 4 లక్షల ఇళ్లు అర్హులకు కేటాయిస్తారు. ఇప్పుడు 10.20 లక్షల దరఖాస్తులు అర్హమైనవిగా తేల్చటంతో, వీటిల్లో ఎవరికి ఇళ్లు దక్కుతాయోనన్న ప్రశ్న ఉదయిస్తోంది. దీంతో ఇళ్లు దక్కించుకునేందుకు ముమ్మరపోటీ నెలకొంది. ఇప్పటి నుంచి దరఖాస్తుదారులు తమకు అందేలా చూడాలంటూ నేతల చుట్టూ తిరుగుతున్నారు. ఎన్నికలకు ఇంకా ఎక్కువగా సమయం లేనందున వీలైనంత తొందరలో పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.  

మరిన్ని వార్తలు