బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే..

24 Feb, 2023 09:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ప్రజలు భావిస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఇందులో భాగంగానే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టామని, సంస్థాగత నిర్మాణంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల కంటే బీజేపీ బలంగా ఉందన్నారు. రాష్ట్రంలో 34 వేల పోలింగ్‌బూత్‌ కమిటీలకుగాను తాము 80 శాతం పూర్తి చేసినా బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ కావాలనే బీజేపీకి అభ్యర్థుల్లేరని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

బీఆర్‌ఎస్‌ను వ్యతిరేకిస్తున్న ప్రజలు గత రెండు ఉపఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో గెలిపించి బీజేపీనే ప్రత్యామ్నాయమని తేల్చి చెప్పారన్నా రు. గురువారం ఇక్కడ జరిగిన ‘బూత్‌ సశక్తీకరణ్‌ అభియాన్‌’వర్క్‌షాప్‌లో సంజయ్‌ మాట్లాడుతూ బీజేపీ సంస్థాగతంగా బలంగా ఉన్నందునే 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని, కేంద్రంలో మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత స్ట్రీట్‌కార్నర్‌ మీటింగ్‌లతో పారీ్టకి మంచి వాతావరణం ఏర్పడిందని, ప్రజల నుంచి స్పందన బాగా వస్తోందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక ఉచిత విద్య, వైద్యం, అందరికీ ఇళ్లు, రైతులకు ఫసల్‌ బీమాను అమలు చేస్తామని చెబుతున్నామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడంలేదో సమాధానం చెప్పలేక సెంటిమెంట్‌ రగిలించేందుకు ప్రధాని మోదీ, బీజేపీ నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. 

28 వరకు ‘స్ట్రీట్‌ కార్నర్లు’పొడిగింపు: బన్సల్‌ 
ఈ నెల 28 వరకు ‘ప్రజాగోస– బీజేపీ భరోసా’స్ట్రీట్‌కార్నర్‌ మీటింగ్స్‌ను పొడిగించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25 వరకు 11 వేల మీటింగ్స్‌ జరపాల్సి ఉండగా, ఆరువేలే కావడంతో నాయకుల విజ్ఞప్తిపై మూడురోజుల పొడిగింపునకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌బన్సల్‌ అంగీకరించారు. అయితే 28న వీటి ముగింపునకు సూచికగా 119 నియోజకవర్గాల్లో ఒక్కోచోట 5 వేలకు తగ్గకుండా ప్రజలతో బహిరంగసభలు నిర్వహించాలని ఆదేశించారు.

రాష్ట్రంలో ఇంతవరకు సాగిన ‘స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌’లు జరిగిన తీరుపట్ల సంజయ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్‌ చుగ్, సునీల్‌ బన్సల్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. తక్కువ మందితో జరిగిన చోట మళ్లీ స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహించాలని నిర్ణయించినట్టు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌ రెడ్డి మీడియాకు తెలిపారు. 28న కార్నర్‌ మీటింగ్‌ ముగింపు సభలు ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి అరవింద్‌ మీనన్, పారీ్టనేతలు ఇంద్రసేనారెడ్డి, మురళీధర్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, విజయశాంతి, ఏపీ జితేందర్‌ రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, జి.ప్రేమేందర్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

చదవండి: అప్పటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌.. తరుణ్‌ చుగ్‌ క్లారిటీ

మరిన్ని వార్తలు