అలర్ట్‌: మూసీ గ్రాస్‌లో లెడ్‌ ఆనవాళ్లు..  పాలు, మాంసం, పశుగ్రాసంలో..

16 Sep, 2022 20:32 IST|Sakshi

నది గడ్డిలో పరిమితికి మించి లెడ్‌ ఆనవాళ్లు 

మానవ, పాడి పశువుల ఆరోగ్యంపై దుష్ప్రభావం  

నాగోల్, ఉప్పల్, అంబర్‌పేట్‌లలో అత్యధికం 

పరీవాహకంలో 21 చోట్ల నమూనాల సేకరణ 

వివరాలు వెల్లడించిన ‘ఎన్‌ఆర్‌సీఎం’  

సాక్షి, హైదరాబాద్‌: చారిత్రక మూసీ పరివాహక ప్రాంతంలో విరివిగా సాగవుతున్న గడ్డిలోనూ మానవ ఆరోగ్యానికి హానికారకంగా పరిణమించే లెడ్‌ ఆనవాళ్లు అధికంగా ఉన్నట్లు నేషనల్‌ రీసెర్చి సెంటర్‌ ఫర్‌ మీట్‌ (ఎన్‌ఆర్‌సీఎం) తాజా పరిశోధనలో తేలింది. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చి పర్యవేక్షణలో ఎన్‌ఆర్‌సీఎం ఆధ్వర్యంలో పాలు, మాంసం, పశుగ్రాసంలో లెడ్‌ ఆనవాళ్లను పరిశీలించగా ఈ విషయం తేలింది.

మూసీలో హుస్సేన్‌సాగర్‌ జలాలు అధికంగా చేరే నాగోల్‌– ఉప్పల్‌ మార్గంలో ఈ ఆనవాళ్లు అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. గండిపేట్‌ నుంచి ఘట్‌కేసర్‌ వరకు 21 ప్రాంతాల్లో మూసీ నీటి నమూనాలను పరీక్షించగా.. ప్రతి లీటరు నీటిలో లెడ్‌ మోతాదు 61 పార్ట్స్‌ పర్‌ మిలియన్‌ (పీపీఎం)గా నమోదైనట్లు ఈ సంస్థ తాజా నివేదిక తెలిపింది. పీసీబీ నిబంధనల ప్రకారం ఈ మోతాదు 20 పీపీఎంకు మించరాదు. ఫార్మా కంపెనీల వ్యర్థాలు అధికంగా చేరడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని నివేదిక స్పష్టం చేసింది. లెడ్‌ మోతాదు అధికమైతే మానవ, పాడి పశువుల ఆరోగ్యంపై దుష్ప్రభావం తప్పదని నివేదిక వెల్లడించింది. 

కాలుష్యానికి కారణాలివీ..  
నగరంలో రోజువారీగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాల ద్వారా నిత్యం 1800 మిలియన్‌ లీటర్ల మురుగు నీరు ఉత్పన్నమవుతోంది. ఇందులో సుమారు 900 మిలియన్‌ లీటర్ల మురుగు నీటిని జలమండలి 23 ఎస్టీపీల్లో శుద్ధి చేస్తోంది. మిగతా నీరు శుద్ది ప్రక్రియ లేకుండానే మూసీలో కలుస్తోంది. ఈ మురుగు నీటిలో కూకట్‌పల్లి నాలా నుంచి హుస్సేన్‌ సాగర్‌లోకి అటు నుంచి వచ్చి మూసీలోకి చేరుతున్న సుమారు 400 మిలియన్‌ లీటర్ల మేర ఫార్మా, బల్క్‌డ్రగ్‌ వ్యర్థ జలాలు కూడా ఉన్నాయి. ఈ జలాల చేరికతోనే లెడ్‌ తదిర హానికారక భారలోహ అవశేషాలు మూసీలోకి చేరుతున్నాయి. 

కలుషిత జలాలతో దుష్ఫలితాలు.. 
►ఆక్సిజన్‌ స్థాయి తగ్గడంతో  నదిలో చేపలు, వృక్ష, జంతు ఫ్లవకాలు చనిపోతున్నాయి. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. జీవావరణ సమతౌల్యం దెబ్బతింటుంది. పశువులు దాహార్తి తీర్చుకునే పరిస్థితి ఉండదు.  
►పరీవాహక ప్రాంతాల్లో సాగు చేస్తున్న గడ్డి తిన్న పశువుల పాలల్లో కాలుష్య కారకాలు చేరడంతో ఇవి మానవ దేహంలోకి ప్రవేశిస్తున్నాయి.   
►ఈ నీరు తాగిన వారు న్యుమోనియా, టైఫాయిడ్, కామెర్లు, విరేచనాలు, కోరింత దగ్గు, పోలియో వంటి వ్యాధుల బారిన పడుతున్నారు.  

నగరంలోకి ప్రవేశించగానే కాలుష్య కాటు.. 
వికారాబాద్‌ జిల్లా అనంతగిరి కొండలు మూసీ జన్మస్థానం. 90 కి.మీ ప్రవహించి బాపూఘాట్‌ వద్ద నగరంలోకి ప్రవేశిస్తోంది. నగరంలో ఫార్మా, వాణిజ్య, గృహ వ్యర్థ జలాలు చేరుతుండడంతోనే మూసీ కాలుష్య కాసారమవుతోంది.  

మరిన్ని వార్తలు