ఉప్పల్‌ మెట్రో ఓసీసీకి చుక్కలుచూపిస్తున్న మూసీ కాలుష్యం, ఇలా చేస్తేనే సమస్య పరిష్కారం

9 Feb, 2023 09:36 IST|Sakshi
ఉప్పల్‌లోని ఆపరేషన్‌ కంట్రోల్‌ కేంద్రం 

సాక్షి, హైదరాబాద్‌: నగర మెట్రోపై మూసీ కాలుష్యం పంజా విసురుతోంది. ఎల్బీనగర్‌– మియాపూర్, జేబీఎస్‌–ఎంజీబీఎస్, నాగోల్‌– రాయదుర్గం మూడు మార్గాల్లో పరుగులు తీసే మెట్రో రైళ్లను నియంత్రించే ఉప్పల్‌లోని ఆపరేషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఓసీసీ)కు మూసీ కాలుష్యం పొగబెడుతోంది. బల్క్‌ డ్రగ్, ఫార్మా కంపెనీల వ్యర్థ జలాలు ప్రవహిస్తున్న మూసీ నది నుంచి తరచూ వెలువడుతున్న ఘాటైన వాసనలు ఈ కేంద్రంలోని సున్నితమైన ఎల్రక్టానిక్, హార్డ్‌వేర్, కంప్యూటర్‌ ఆధారిత సేవలను దెబ్బతీస్తున్నాయి.

ఈ కాలుష్యం కారణంగా ఓసీసీ కేంద్రంలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ పరిణామంతో కమ్యూనికేషన్‌ బేస్డ్‌ ట్రైన్‌ కంట్రోల్‌ వ్యవస్థ దెబ్బతింటోంది. దీంతో పట్టాలపై ఉన్నపళంగా మెట్రో రైళ్లు నిలిచిపోతున్నాయి. ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మెట్రో అధికారులు సైతం తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటుండడంతో హతాశులవుతున్నారు.  

ఉప్పల్‌లో సుమారు 104 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మెట్రో డిపోను, ఓసీసీ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ ప్రాంగణంలో రైళ్లను నిత్యం శుభ్రపరచడం, రైళ్ల గమనాన్ని నియంత్రించడం, తరచూ తలెత్తే సమస్యలు, ఇతర నిర్వహణ, మరమ్మతులు చేపడుతున్నారు. దీనిపై మెట్రో నిర్మాణ,నిర్వహణ సంస్థ ఎల్‌అండ్‌టీతో పాటు హైదరాబాద్‌ మెట్రో రైలు ఉన్నతాధికారులను సంప్రదించగా.. ఈ అంశంపై మాట్లాడేందుకు వారు నిరాకరించడం గమనార్హం. 

పరిష్కారమిదే.. 
నగరంలో బాపూఘాట్‌– ప్రతాపసింగారం (44 కి.మీ)మార్గంలో మూసీ నదిలో బల్క్‌డ్రగ్, ఫార్మా వ్యర్థాలు అత్యధికంగా చేరుతున్నాయి. ప్రధానంగా కూకట్‌పల్లి నాలా నుంచి నిత్యం సుమారు 400 మిలియన్‌ లీటర్ల మేర హానికారక రసాయనాలు కలిసిన వ్యర్థజలాలు మూసీలో కలుస్తుండడంతో తరచూ ఘాటైన వాసనలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం జలమండలి వ్యర్థజలాల్లోని మురుగు,ప్లాస్టిక్‌ ఇతర ఘన వ్యర్థాలను పలు ఎస్టీపీల్లో తొలగిస్తోంది. కానీ రసాయనాలను తొలగించేందుకు ఎఫ్లుయెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను మూసీ ప్రవాహ మార్గంలో నిర్మించాల్సి ఉంది.

ఈటీపీల్లో శుద్ధి చేసిన తరవాతనే నాలా నీరు మూసీలోకి చేరే ఏర్పాట్లు చేస్తే కాలుష్యం గణనీయంగా తగ్గుముఖం పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు మెట్రో రైళ్ల గమనానికి వినియోగిస్తున్న కమ్యూనికేషన్‌ బేస్డ్‌ ట్రైన్‌కంట్రోల్‌ వ్యవస్థను మన నగర వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మెట్రో అధికారులు మార్పులు చేర్పులు చేయాల్సి ఉందని స్పష్టంచేస్తున్నారు.  
చదవండి: Telangana: రాష్ట్ర జనాభా మూడున్నర కోట్లు..

మరిన్ని వార్తలు