సిటీజన్ల కోసం స్వచ్ఛవాయువు..

25 Aug, 2021 07:48 IST|Sakshi

ఊపిరి సలపని వాయుకాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్న దేశ రాజధాని ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో తాజాగా స్మాగ్‌ టవర్‌ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. ముక్కుపుటాలు, శ్వాసకోశాలను దెబ్బతీసే వాహన కాలుష్యం నుంచి తక్షణ విముక్తికి ఈ టవర్లు ఉపయోగపడతాయి. ముంబయి, ఢిల్లీ ఐఐటీ నిపుణుల సహకారంతో రూ.20 కోట్ల అంచనా వ్యయంతో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ తయారు చేసిన ఈ టవర్‌ 24 మీటర్ల ఎత్తున ఉంటుంది. ఇందులో 40 భారీ ఫ్యాన్లు, ఐదువేల ఫిల్టర్లు ఉంటాయి. ఇవి స్థానికంగా గాలిలో అధికంగా ఉండే కార్భన్‌మోనాక్సైడ్, నైట్రోజన్‌ ఆక్సైడ్, కార్బన్‌ డయాక్సైడ్‌ తదితర ఉద్ఘారాలను గ్రహించడంతో వాయు శుద్ధి జరుగుతుంది. కూడళ్లలో సిగ్నల్స్‌ వద్ద కొన్ని నిమిషాలపాటు ఆగే వాహనదారులకు 
కొద్దిసేపు స్వచ్ఛమైన గాలి పీల్చే అవకాశం దక్కుతుంది.     

ఢిల్లీ తరహాలో గ్రేటర్‌ పరిధిలోనూ వాయుకాలుష్యం బెడద తీవ్రంగా ఉంది. లక్షలాది వాహనాల రాకపోకలతో అత్యధిక వాయు కాలుష్యం వెలువడే పంజగుట్ట, ఆబిడ్స్, సికింద్రాబాద్, బాలానగర్, జీడిమెట్ల, కుత్భుల్లాపూర్, ఎల్‌బీనగర్, ఉప్పల్, సనత్‌నగర్, పాశమైలారం, పటాన్‌చెరు, కూకట్‌పల్లి తదితర కూడళ్లలో స్మాగ్‌టవర్లను ఏర్పాటుచేసి సిటీజన్లకు స్వచ్ఛవాయువును సాకారం చేయాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. 

అవధులు దాటిన వాయుకాలుష్యం.. 
గ్రేటర్‌ పరిధిలో వాహనాల సంఖ్య సుమారు 60 లక్షలకు చేరువైంది. ఇందులో 15 ఏళ్లకు పైబడిన వాహనాలు పదిలక్షలకు పైగానే ఉన్నాయి. వీటి ద్వారా భయంకరమైన పొగ వెలువడుతుంది. ఈ ఉద్గారాల్లో ఉండే నైట్రోజన్‌ ఆక్సైడ్‌లు, కార్బన్‌ డయాక్సైడ్‌ తదితర ఉద్ఘారాలు అత్యధికంగా ఉంటాయి. అంతేకాదు..సూక్ష్మ ధూళికణాల మోతాదు ప్రతి ఘనపు మీటరు గాలిలో 60 మైక్రోగ్రాములు దాటరాదు. కానీ మహానగరం పరిధిలోని పలు పారిశ్రామిక వాడలు సహా, ప్రధాన రహదారులపైసుమారు 80 కూడళ్ల వద్ద నిత్యం లక్షలాది వాహనాలు రాకపోకల కారణంగా తరచూ ధూళి కాలుష్యం 90 నుంచి 110 మైక్రోగ్రాముల మేర నమోదవుతుంది. ఈ నేపథ్యంలో నగరంలోనూ స్మాగ్‌టవర్ల ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నది నిపుణుల మాట.  

స్వచ్ఛ వాయువును అందించాలి 
నగరవాసులకు స్వచ్ఛ ఊపిరిని సాకారం చేసే బాధ్యత ప్రభుత్వానిదే. ఆర్టీఏ, పరిశ్రమలు, ట్రాఫిక్, పీసీబీ విభాగాల సమన్వయంతో టోక్యో తరహాలో క్లీన్‌ఎయిర్‌ అథారిటీని ఏర్పాటు చేయాలి. కాలం చెల్లని వాహనాలు రోడ్డెక్కకుండా చూడాలి. ఉద్ఘారాలను పరిమితికి మించి విడుదల చేస్తున్న పరిశ్రమలను కట్టడిచేయాలి. నగరంలో హరితహారాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలి. అత్యధిక కాలుష్యం వెలువడే కూడళ్ల వద్ద స్మాగ్‌టవర్లు ఏర్పాటు 
చేయాలి.     
– జీవానందరెడ్డి, పర్యావరణ వేత్త 
   

మరిన్ని వార్తలు