బడా కంపెనీలు నడపడమే కాదు.. చిరు వ్యాపారులనూ గుర్తుపెట్టుకోండి

27 May, 2022 01:35 IST|Sakshi
గురువారం ఐఎస్‌బీ వార్షికోత్సవంలో ప్రధాని మోదీ. చిత్రంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, గవర్నర్‌ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఐఎస్‌బీ సిబ్బంది తదితరులు 

ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవంలో విద్యార్థులకు ప్రధాని మోదీ పిలుపు

సాంకేతికత సాయంతో కొత్త మార్కెట్లను వారికి చేరువ చేయాలని సూచన

ఘనంగా హైదరాబాద్, మొహాలీ క్యాంపస్‌ల విద్యార్థుల ఉమ్మడి స్నాతకోత్సవం

సాక్షి, హైదరాబాద్‌: పట్టభద్రులై వ్యాపార ప్రపంచంలోకి అడుగుపెడుతున్న ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) విద్యార్థులు పెద్దపెద్ద కంపెనీలను నడపడమే కాకుండా చిన్న వ్యాపారాలను, వ్యాపారులనూ గుర్తుపెట్టుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. చిరు వ్యాపారులకు టెక్నాలజీని అందుబాటులోకి తేవడంతోపాటు కొత్త మార్కెట్లను గుర్తించి వారికి చేరువ చేయాలని సూచించారు. తద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు మేలు జరుగుతుందని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవం, 2022 పీజీపీ విద్యార్థుల స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఐఎస్‌బీ హైదరాబాద్‌ క్యాంపస్‌తోపాటు మొహాలీ క్యాంపస్‌ విద్యా ర్థులతో ఉమ్మడిగా జరిగిన ఈ స్నాతకోత్సవంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రధాని ప్రోత్సాహకాలు అందించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న ఈ అమృత ఘడియల్లో ఐఎస్‌బీ విద్యార్థులు తమ వ్యక్తిగత లక్ష్యాలకు దేశ ప్రయోజనాలనూ జోడించి ముందడుగు వేయాలని కోరారు. వారికి ఇదో గొప్ప అవకాశమన్నారు. 2001లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి ప్రారంభించిన ఐఎస్‌బీ ఇప్పుడు ప్రపంచంలోనే పేరెన్నికగన్న బిజినెస్‌ స్కూల్‌గా అవతరించిందని చెప్పారు. 

సంస్కరణల ఫలాన్ని దేశం చూస్తోంది... 
గత ప్రభుత్వాలు అసాధ్యంగా భావించిన అనేక పాలనా సంస్కరణలను తాము వేగంగా చేపట్టడం వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని మోదీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపట్టిన రిఫార్మ్‌ (సంస్కరణలు), పెర్‌ఫార్మ్‌ (పనిచేయడం), ట్రాన్స్‌ఫార్మ్‌ (మార్పు తీసుకురావడం) నినాదం ఫలితాలను దేశం ఇప్పుడిప్పుడే చూస్తోందని ప్రధాని తెలిపారు. జీ–20 దేశాల్లో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదగడం మొదలుకొని.. స్మార్ట్‌ఫోన్‌ డేటా వినియోగంలో తొలి స్థానానికి, ఇంటర్నెట్, రిటైల్‌ రం గాల్లో రెండో స్థానానికి, స్టార్టప్‌ల రంగం, అతిపెద్ద వినియోగదారుల మార్కెట్‌లలో మూడోస్థానంలో ఉండటాన్ని ఇందుకు ఉదాహరణలుగా పేర్కొన్నా రు. ఇందులో ప్రభుత్వం మాత్రమే కాకుండా ఐఎస్‌బీ, వృత్తి నిపుణుల భాగస్వామ్యమూ ఉందన్నారు. భారతీయులకు, భారతీయ ఉత్పత్తులకూ తమ ప్రభుత్వ హయాంలో కొత్త గుర్తింపు, గౌరవం దక్కాయని, దేశ సమస్యల పరిష్కారానికి చేసిన ప్రయత్నాలు, పరిష్కార మార్గాలు ఇప్పుడు ప్రపంచస్థాయిలో అమలవుతున్నాయని వివరించారు. దేశంలో వ్యాపారాభివృద్ధికి, విస్తరణకు ఇప్పుడున్న విస్తృత అవకాశాలను ఐఎస్‌బీ విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సూచించారు. 2014 తరువాత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, చర్యలను ఐఎస్‌బీతోపాటు మేనేజ్‌మెంట్‌ విద్యార్థులు తమ వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో అమలు చేస్తే తప్పకుండా అద్భుత ఫలితాలు లభిస్తాయని మోదీ తెలిపారు. 


సంబంధిత వార్త: నమో హైదరాబాద్‌.. ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అప్‌డేట్స్‌


మీపై నమ్మకం ఉంది... 
కరోనాను ఎదుర్కొన్న తీరు భారత్‌ సత్తాను ప్రపం చానికి మళ్లీ చాటిందని ప్రధాని చెప్పారు. ఈ దేశ యువత ఎలాంటి సవాల్‌నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందన్న నమ్మకం తనకుందన్నారు. విద్యార్థుల హర్షధ్వానాల మధ్య ప్రధాని మరోసారి ఈ విషయాన్ని చెబుతూ ‘నాకు మీపై నమ్మకం ఉంది. మీకు మీపై ఆ నమ్మకం ఉందా?’ అని ప్రశ్నించి.. ‘ఉంది’ అన్న సమాధానాన్ని రాబట్టారు. కేంద్ర ప్రభుత్వ చర్యల కారణంగా ఇప్పుడు దేశం ఫిన్‌టెక్, వైద్యం, వైద్య విద్య, క్రీడల్లాంటి అనేక రంగాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకెళుతోందని, అద్భుత ప్రగతి సాధిస్తోందని ప్రధాని గణాంకాలతో వివరించారు. ప్రజల భాగస్వామ్యం కూడా పెరిగిన కార ణంగానే స్వచ్ఛ భారత్, వోకల్‌ ఫర్‌ లోకల్, ఆత్మనిర్భర్‌ భారత్, మేకిన్‌ ఇండియా వంటి కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర హోం సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్, ఐఎస్‌బీ డీన్‌ పిల్లుట్ల మదన్‌తోపాటు చైర్మన్‌ హరీశ్‌ మన్వానీ, మొహాలీ క్యాంపస్‌ ముఖ్యాధికారి రాకేశ్‌ భారతీ మిట్టల్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని తన ప్రసంగాన్ని మొదలుపెడుతూ వేదికపై ఉన్న ప్రముఖులను పేర్లతో పలకరించినా తలసానిని మాత్రం తెలంగాణ మంత్రిగానే ప్రస్తావించడం గమనార్హం!  

మరిన్ని వార్తలు