హైదరాబాద్‌లో కొత్తగా రెండు జోన్లు, 13 పోలీస్‌ స్టేషన్లు.. ఏయే ప్రాంతాల్లో అంటే...

5 Apr, 2022 17:59 IST|Sakshi

నేరాల నమోదు, జనాభా సంఖ్యే ప్రాతిపదిక

జోన్ల సంఖ్య 7కు, 73కు చేరనున్న పీఎస్‌లు

వీటికి తగ్గట్టుగా డివిజన్లు ప్రతిపాదించిన కమిటీ

ప్రభుత్వ ఆమోదం కోసం సచివాలయానికి దస్త్రం

సాక్షి, హైదరాబాద్‌: సిటీ పోలీసు కమిషనరేట్‌కు 175 ఏళ్ల చరిత్ర ఉంది. ఇది ఏర్పాటైన నాటి నుంచి పలుమార్లు చిన్నచిన్న మార్పులతో పునర్‌వ్యవస్థీకరణ జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు గతానికి భిన్నంగా భారీ రీ– ఆర్గనైజేషన్‌కు కసరత్తు పూర్తయింది. కొత్తగా రెండు జోన్లు, 13 పోలీసుస్టేషన్లతో పాటు వాటికి తగ్గట్టు సబ్‌–డివిజన్లను ప్రతిపాదిస్తూ ప్రత్యేక కమిటీ తయారుచేసిన ప్రతిపాదనలు సోమవారం ప్రభుత్వానికి చేరాయి. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం సర్కారు ఆమోదముద్ర వేయనుంది. ఈమేరకు ఉత్తర్వులు వెలువడితే నగరంలో జోన్ల సంఖ్య 7కు, పోలీసు స్టేషన్లు 73కు చేరనున్నాయి. 

ఇదీ చరిత్ర.. 
► హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనరేట్‌ 1847లో ఏర్పడింది. అప్పట్లో నిజాం స్టేట్‌కు హైదరాబాద్‌ రాజధాని కావడంతో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, జరిగిన నేరాలను కొలిక్కి తీసుకురావడం తదితర విధులతో దీన్ని ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రం, హైదరాబాద్‌ సంస్థానం విలీనం అనంతరం తొలిసారిగా 1955లో నగర పోలీసు పునర్‌వ్యవస్థీకరణ జరిగింది. అప్పటి మద్రాస్‌ సిటీ పోలీసు విధానాలను అధ్యయనం చేసి ఇక్కడ అమలుపరిచారు. దీంతో క్రైమ్, లా అండ్‌ ఆర్డర్‌ వేరు పడటం, హైదరాబాద్‌ జిల్లాలోని అనేక ప్రాంతాలు రైల్వే పోలీసులోకి బదిలీ కావడం తదితర కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.  

► ఆ ఏడాది జూలై 15 నుంచి ఈ విధివిధానాలు అమలులోకి వచ్చాయి. తొలిసారిగా ఏర్పాటు చేసిన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లకు కొందరు సిబ్బందిని అప్పగించి పెట్రోలింగ్‌ విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకున్నారు. 1956లో హైదరాబాద్‌ రాజధానిగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడింది. దీంతో జంట నగరాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పోలీసు విభాగంలో లా అండ్‌ ఆర్డర్, క్రైమ్‌తో పాటు ట్రాఫిక్, స్పెషల్‌ బ్రాంచ్‌ తదితర విభాగాలనూ ఏర్పాటు చేస్తూ 1957 అక్టోబర్‌ 11న నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్పుతో పాటు నగర కమిషనరేట్‌నూ పాలనా సౌలభ్యం కోసం విభజించారు. నాలుగు సబ్‌– డివిజన్లు, 12 సర్కిళ్లతో 34 పోలీసుస్టేషన్లు ఏర్పడ్డాయి. 

నగర విస్తరణతో 1981 పునర్‌వ్యవస్థీకరణ..
► విస్తరిస్తున్న నగరంలో పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టు 1981లో కమిషనరేట్‌ను మరోసారి పునర్‌వ్యవస్థీకరించారు. దీనిప్రకారం నగరంలో నాలుగు జోన్లు (ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్‌), 12 సబ్‌–డివిజన్లు ఏర్పడ్డాయి. జోన్‌కు డీసీపీలు, సబ్‌–డివిజన్‌కు ఏసీపీలు నేతృత్వం వహించే ఏర్పాట్లు చేశారు.  

► 1985, 2001ల్లో జరిగిన మార్పుచేర్పులతో సెంట్రల్‌ జోన్, రెయిన్‌బజార్, కంచన్‌బాగ్‌ పోలీసుస్టేషన్ల ఏర్పాటుతో నగరంలోని జోన్ల సంఖ్య 5కు, పోలీసు స్టేషన్ల సంఖ్య 60కి పెరిగింది. ఆ తర్వాత హైదరాబాద్‌ విశ్వనగరంగా మారుతూ వచ్చినా పోలీసుస్టేషన్లు, సబ్‌–డివిజన్లు, జోన్ల సంఖ్య పెరగలేదు. 

► ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేశారు. తక్షణం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, నేరాల నమోదుతో పాటు జనాభా, పోలీసింగ్‌ తీరుతెన్నులు ప్రాతిపదికన పోలీసు కమిషనరేట్‌ పునర్‌వ్యవస్థీకరణకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దీంతో హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ తన నేతృత్వంలో సంయుక్త పోలీసు కమిషనర్, ముగ్గురు అదనపు డీసీపీలు, ముగ్గురు ఏసీపీలతో గత నెలలో కమిటీకి రూపమిచ్చారు. 

► నగరంలో సుదీర్ఘ కాలం పని చేసిన అనుభవం, పట్టు ఉన్న ఈ అధికారులు పునర్‌వ్యవస్థీకరణ అంశాన్ని అనేక కోణాల్లో పరిశీలించారు. ఎట్టకేలకు సౌత్, వెస్ట్, సెంట్రల్, నార్త్‌జోన్లలో ఉన్న ప్రాంతాలను విడగొడుతూ రెండు జోన్లకు, 15 ఠాణాల్లోని ఏరియాలను కలుపుతూ 13 పోలీసుస్టేషన్లకు రూపమిస్తూ దస్త్రం రూపొందించి ప్రభుత్వానికి పంపారు.  (క్లిక్‌: పోలీస్‌ పరీక్షల ఉచిత శికణకై ప్రీ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌)

► ప్రస్తుత నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ నేపథ్యంలోనే కమిషనరేట్‌లో కీలక మార్పులు జరిగాయి. సెంట్రల్‌ జోన్‌ ఏర్పడినప్పుడు తొలి డీసీపీగా ఆయనే పని చేశారు. హుస్సేన్‌సాగర్‌లో ఆత్మహత్యల నిరోధానికి లేక్‌ పోలీసుస్టేషన్‌కు ఆనందే రూపమిచ్చారు. తాజాగా భారీ మార్పులు ఆయన నేతృత్వంలోని కమిటీ ద్వారానే జరగనుండటం విశేషం. (క్లిక్‌: మది దోచే మల్కంచెరువు..)

మరిన్ని వార్తలు