యూకే లేబర్‌ పార్టీ లాంగ్‌లిస్ట్‌లో ఉదయ్‌

23 Oct, 2022 09:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యూకే పార్లమెంటు ఎన్నికల్లో లేబర్‌ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న హైదరాబాద్‌ మూలాలుగల తెలుగు వ్యక్తి ఉదయ్‌ నాగరాజు తాజాగా ఆ పార్టీ వడపోత అనంతరం రూపొందించిన ఆశావహుల జాబితాలో చోటు సంపాదించారు. మిల్టన్‌ కీన్స్‌ నార్త్‌ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిత్వాన్ని ఉదయ్‌ ఆశిస్తున్నారు. యూకే పార్లమెంటరీ ప్రక్రియలో భాగంగా పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వందలాది మంది వ్యక్తులు తొలుత తాము అభ్యర్తిత్వం కోరకుంటున్న పార్టీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను వడపోసి ముగ్గురు లేదా నలుగురిని ఎంపిక చేసి లాంగ్‌లిస్ట్‌ రూపొందిస్తారు. వారిలో ఒకరిని పార్టీ స్థానిక సభ్యులు ఎన్నుకుంటారు. ఆ అభ్యర్థే పార్టీ తరఫున అధికారికంగా పార్లమెంటరీ అభ్యర్థి అవుతారు.

రాజకీయ అనుభవం, గెలుపు అవకాశాలు, ప్రజాసేవ పట్ల నిబద్ధత తదితరాల ఆధారంగా లాంగ్‌ లిస్ట్‌ను లేబర్‌ పార్టీ రూపొందించగా ఉదయ్‌ అందులో చోటు సంపాదించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, రాజ్యసభ మాజీ ఎంపీ కెప్టెన్‌ లక్ష్మీకాంతరావుకు దగ్గరి బంధువైన ఉదయ్‌ నాగరాజు.. అంతర్జాతీయ వక్తగా, లేబర్‌ పార్టీ విధాన నాయకుడిగా మేథో విభాగాన్ని నడిపిస్తున్నారు.

ఇదీ చదవండి: UK political crisis: రిషి, బోరిస్‌ నువ్వా, నేనా?

మరిన్ని వార్తలు