స్థానిక పదార్థాలతో సరికొత్త కాంక్రీట్‌

5 Nov, 2022 03:42 IST|Sakshi
హైదరాబాద్‌ ఐఐటీ అభివృద్ధి చేసిన అల్ట్రా హైపర్ఫార్మెన్స్‌ ఫైబర్‌ రీన్‌ఫోర్స్‌డ్‌ కాంక్రీట్‌

అభివృద్ధి చేసిన హైదరాబాద్‌ ఐఐటీ సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగం 

బ్రిడ్జీలు, ఇతర పొడవైన నిర్మాణాలకు ఉపయోగం 

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: హైదరాబాద్‌ ఐఐటీ సివిల్‌ ఇంజనీరింగ్, పరిశోధన విభాగం సరికొత్త కాంక్రీట్‌ను అభివృద్ధి చేసింది. స్థానికంగా లభించే ఫ్లైయాష్‌ (బొగ్గును మండించాక మిగిలే బూడిద), ఇసుక, గ్రౌండ్‌ గ్రాన్యులేటెడ్‌ బ్లాస్ట్‌ ఫర్నేస్‌ స్లాగ్‌ (నిప్పుల కొలిమిల్లో వివిధ మిశ్రమాలను మండించాక మిగిలే పదార్థం), మైక్రో సిలికా (ఓ రకమైన బూడిద), నీరు, స్టీల్‌ ఫైబర్‌ (పలచని స్టీల్‌ ముక్కలు), పాలీప్రొలిన్‌ ఫైబర్స్‌ (ఓ రకమైన ప్లాస్టిక్‌ పీచు) వంటి వాటిని ఉపయోగించి ఈ కాంక్రీట్‌ను అభివృద్ధి చేసినట్లు సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ప్రకటించింది.

దీనికి అల్ట్రా హైపర్ఫార్మెన్స్‌ ఫైబర్‌ రీఇన్‌ఫోర్స్‌డ్‌ కాంక్రీట్‌ (యూహెచ్‌పీఎఫ్‌ఆర్‌సీ)గా పేరుపెట్టింది. సాధారణ కాంక్రీట్‌తో పోలిస్తే సుమారు రెండింతల తక్కువ వ్యయంలోనే దీన్ని తయారు చేసే అవకాశం ఉందని... బ్రిడ్జీలు, పొడవైన కట్టడాలకు అవసరమైన బీమ్‌లకు, స్తంభాలు, ఇతర నిర్మాణాలకు ఈ నూతన కాంక్రీట్‌ను ఉపయోగించుకోవచ్చని ఐఐటీ సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఫ్రొఫెసర్‌ ఎస్‌.సూర్యప్రకాశ్‌ పేర్కొన్నారు.

హైదరాబాద్‌ ఐఐటీలోని క్యాస్టన్‌ ల్యాబ్‌లో ఈ నూతన కాంక్రీట్‌ పనితీరును పరీక్షించామన్నారు. డిజైన్‌ డిపార్ట్‌మెంట్‌ సహకారంతో ఈ కాంక్రీట్‌ను అభివృద్ధి చేసినట్లు ఆయన చెప్పారు. నూతన కాంక్రీట్‌ 150 ఎంపీయూ కంప్రెసివ్‌ స్ట్రెంత్‌ను కలిగి ఉందన్నారు. ఈ సందర్భంగా ఐఐటీ డైరెక్టర్‌ ఫ్రొఫెసర్‌ బీఎస్‌ మూర్తి మాట్లాడుతూ స్థానికంగా లభించే పదార్థాలను ఉపయోగించి నిర్మాణ సామగ్రిని అభివృద్ధి చేయడమంటే ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ కల సాకారం దిశగా ముందడుగు వేయడమేనన్నారు. ఇలాంటి ఆవిష్కరణలు దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడతాయన్నారు.    

మరిన్ని వార్తలు