ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ వాయిదా?

1 Apr, 2021 08:29 IST|Sakshi

మూడు ప్రత్యామ్నాయాలతో ప్రభుత్వానికి ప్రతిపాదన 

వాయిదా వైపే మొగ్గుచూపే అవకాశం 

అదనపు ప్రత్యామ్నాయాలపై వాకబు చేస్తున్న ప్రభుత్వం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏప్రిల్‌ 7 నుంచి ప్రాక్టికల్‌ పరీక్షలు జరగనున్నా.. విద్యాసంస్థల మూసివేత కారణంగా ఎలా ముందుకు వెళ్లాలో అర్థం కాని స్థితిలో ఇంటర్మీడియట్‌ బోర్డు ఉంది. ఫిబ్రవరి 1 నుంచి కాలేజీల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభమైనా కరోనా కేసులు పెరుగుతుండటంతో మార్చి 24 నుంచి మళ్లీ ప్రత్యక్ష బోధనను ప్రభుత్వం నిలిపేసింది. ముంద స్తు షెడ్యూలు ప్రకారం ఏప్రిల్‌ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.

అయితే ఇప్పుడు ప్రభుత్వం విద్యాసంస్థలను మూసేసినందున ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంలో 3 ప్రత్యామ్నాయాలను రూపొందించి ప్రభుత్వానికి పంపింది. అందులో యథావిధిగా ప్రాక్టికల్స్‌ నిర్వహణకు అనుమతించడం, లేదంటే ఏప్రిల్‌ 10 వర కు వాయిదా వేయడం, అదీ కుదరకపోతే మేలో ఇం టర్‌ పరీక్షలు, జేఈఈ మెయిన్‌ పరీక్షలు పూర్తయ్యా క ప్రాక్టికల్స్‌ నిర్వహించడం వంటి 3 ప్రత్యామ్నా యాలను పేర్కొన్నట్లు తెలిసింది. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాక్టికల్స్‌ నిర్వహించాల్సిందేనని, ప్రాక్టికల్‌ పరీక్షలు లేకుండా మార్కులు వేయ డం సాధ్యం కాదన్న భావనను వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రాక్టికల్‌ పరీక్షల వాయిదా వైపే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే ప్రాక్టికల్‌ ఏప్రిల్‌ 7 నుంచి నిర్వ హించినా, 10 నుంచి నిర్వహించినా పెద్ద తేడా ఏ మీ ఉండదు. అందుకే ప్రాక్టికల్స్‌ను మే నెలాఖరు కు వాయిదా వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ప్రాక్టికల్స్‌కు బదులు మరేమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? ఇంటర్నల్‌ అసైన్‌మెంట్స్‌ ఇచ్చి వాటినే ప్రాక్టికల్‌ మార్కులుగా పరిగణనలోకి తీసుకుంటే ఎలా ఉంటుందనే కోణంలో యోచిస్తు్తన్నట్లు తెలిసింది. ఏదేమైనా రెండు మూడ్రోజుల్లో ప్రాక్టికల్‌ పరీక్షల నిర్వహణపై స్పష్టత రానుంది.  

ఆందోళనలో 2,62,169 మంది విద్యార్థులు 
ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలకు హాజరు కావాల్సిన సైన్స్‌ కోర్సులకు చెందిన ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 2,62,169 మంది ఉన్నట్లు ఇంటర్‌ బోర్డు లెక్కలు వేసింది. వొకేషనల్‌ ప్రథమ సంవత్సర విద్యార్థులు 48,026 మంది, వొకేషనల్‌ ద్వితీయ సంవత్సర విద్యార్థులు 40,287 మంది, జాగ్రఫీ విద్యార్థులు 557 మంది ప్రాక్టికల్స్‌కు హాజరు కావాల్సి ఉంది. మరోవైపు ఇంటర్మీడియట్‌ పరీక్షలకు హాజరయ్యేందుకు ప్రథమ సంవత్సర విద్యార్థులు 4,58,814 మంది, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 4,73,523 మంది పరీక్ష ఫీజు చెల్లించినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి.   

మరిన్ని వార్తలు