పిల్లలూ సిద్ధంకాండ్రి: 1 నుంచి 8, 9, 10  తరగతులు

22 Jun, 2021 02:28 IST|Sakshi

దశలవారీగా ప్రత్యక్ష బోధన..

20వ తేదీ నుంచి 6, 7 తరగతులకు విద్యా బోధన

ఈ నెల 25 నుంచి బడులకు టీచర్లు

ఆగస్టు 16 నుంచి 3, 4, 5 తరగతులకు..

  • విద్యాశాఖ ప్రతిపాదనలపై ఉన్నతస్థాయి సమావేశంలో చర్చ.. నాలుగైదు రోజుల్లో తుది నిర్ణయం. వారంలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సర ఫలితాలు
  • రోజూ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు బోధనను కొనసాగించాలని విద్యాశాఖ ప్రతిపాదించింది.
  • పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనతోపాటు బడులకు హాజరుకాని విద్యార్థుల కోసం ఆన్‌లైన్‌ బోధనను కూడా చేపడతారు.
  • రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ యాజమాన్యాల్లోని టీచర్లు ఈనెల 25 నుంచి బడులకు రావాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం రాత్రి విద్యాశాఖ డైరెక్టర్‌ దేవసేన ఆదేశాలు జారీచేశారు.
  • ప్రైవేటు పాఠశాలల ఫీజుల విషయంలో గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను అమలు చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. 30 శాతం ఫీజులను తగ్గించాలన్న తల్లిదండ్రుల విజ్ఞప్తులపై ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలతో చర్చిస్తామన్నారు.


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పాఠశాలల్లో విద్యాబోధనను దశలవారీగా చేపట్టేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. జూలై 1 నుంచి బడులను ప్రారంభించాలని ఇప్పటికే కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో 8, 9, 10 తరగతులకు జూలై 1 నుంచి విద్యా బోధనను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపినట్లు తెలిసింది.  6, 7 తరగతు లకు జూలై 20 నుంచి బోధనను చేపట్టాలని, 3, 4, 5 తరగతులకు ఆగస్టు 16 నుంచి ప్రత్యక్ష బోధనను ప్రారంభించేలా ప్రతిపాదించింది. ఒకటి, రెండో తరగతుల అం శాన్ని ప్రస్తావించలేదు. పాఠశాలల్లో విద్యా బోధనకు అవసరమైన మార్గదర్శకాల కోసం విద్యాశాఖ చేసిన ఈ ప్రతిపాదనలపై సోమవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో చర్చించారు.

దాదాపు ఆ షెడ్యూలు ప్రకారమే ముందుకు సాగాలన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. ప్రభుత్వ పాఠశాలలు, విద్యాశాఖ గురుకులాలతోపాటు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల పరిధిలోని గురుకులాలు, విద్యాశాఖ పరిధిలోని గురుకులాలను కూడా ప్రారంభించాల్సి ఉన్నందున సన్నద్ధతపై ఆయా శాఖల మంత్రులతోనూ చర్చించాకే ముందుకు సాగాలన్న నిర్ణయానికి వచ్చారు. రెండు మూడు రోజుల్లో వారితో సమావేశం నిర్వహించి, విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి తుది నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. కాగా, ఈనెల 25 నుంచి బడులకు హాజరయ్యే ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, మోడల్‌స్కూళ్లు, కేజీబీవీలు, విద్యా శాఖ గురుకులాలు, ఎయిడెడ్‌ స్కూళ్ల టీచర్లు, జిల్లా విద్యా శిక్షణ సంస్థ లెక్చరర్లు అంతా ఆయా విద్యా సంస్థల్లో రిపోర్టు చేయాలని విద్యాశాఖ డైరెక్టర్‌ దేవసేన ఆదేశించారు. అందుకు అనుగుణంగా డీఈవోలు, ఆర్జేడీలు చర్యలు చేపట్టాలని సూచించారు.
 
వచ్చే వారం సెకండియర్‌ ఫలితాలు 
వచ్చే వారంలో ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సర ఫలితాలను ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జూలై 1 నుంచి డిగ్రీ, పీజీ తరగతులు (ప్రత్యక్ష బోధన) ప్రారంభమవుతాయని చెప్పారు. గతంలో జారీ చేసిన జీవో 46 ప్రకారమే యాజమాన్యాలు ఫీజులను తీసుకోవాలని స్పష్టంచేశారు. ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఫీజుల విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కోవిడ్‌ మూలాన భయపడుతున్న ప్రైవేట్‌ ఉపాధ్యాయులకు, లెక్చరర్లకు, డిగ్రీ, పీజీ విద్యార్థులకు వ్యాక్సిన్‌ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరుతామన్నారు. ఈ విషయంలో మరోసారి మంత్రులతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు